వరల్డ్ రికార్డులో రాయదుర్గానికి చోటు
రాయదుర్గంటౌన్: నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో రాయదుర్గానికి చోటు దక్కింది. శ్రీకళారాధన భరతనాట్య డ్యాన్స్ అకాడమీ 12వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం చిందనూరు కళ్యాణమంటపం వేదికగా సామూహిక లలితా సహస్ర నామ పారాయణం నిర్వహించారు. దాదాపు 200 మంది మహిళలు పాల్గొన్నారు. ఈ మొత్తం ప్రక్రియను చైన్నె నుంచి విచ్చేసిన నోబెల్ బుక్ ఆఫ్ రికార్డు ప్రతినిధులు ప్రదీప్, హేమంత్ నాగరాజు రికార్డు చేశారు. 32 నిమిషాల 47 సెకన్లలో లలితా సహస్ర పారాయణాన్ని పఠించడం అంతర్జాతీయస్థాయిలో మొదటి సారి కావడం విశేషం. ఆధ్యాత్మిక గురువు, విప్రమలై లక్ష్మీనరసింహస్వామి ఆలయ కమిటీ గౌరవాధ్యక్షుడు రామ్మూర్తిస్వామిజీ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమానికి డ్యాన్స్ అకాడమీ టీచర్ జ్యోతి నగేష్, శ్వేతాపద్మని నేతృత్వం వహించారు. కో–ఆర్డినేటర్‌గా ఆల్ ఇండియా రేడియో అనౌన్సర్ లంకా ప్రసాద్ వ్యవహరించారు. కార్యక్రమం అనంతరం నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సర్టిఫికెట్‌ను నిర్వాహకులకు ప్రతినిధులు అందజేశారు. ముఖ్య అతిథులుగా వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి సతీమణి మెట్టు యశోదమ్మ, వైఎస్సార్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌని ఉపేంద్రరెడ్డి హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment