సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు దుర్మార్గం
పరిగి: ‘కులం, మతం, ప్రాంతం, రాజకీయాలతో సంబంధం లేకుండా అర్హతే ప్రామాణికంగా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో జగనన్న ఆధ్వర్యంలో అందరికీ సంక్షేమ ఫలాలు అందాయి. టీడీపీతో పాటు వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు కూడా లబ్ధిపొందడం మనమందరమూ చూశాము. అయితే అందుకు విరుద్ధంగా ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహరిస్తుండటం దుర్మార్గం’ అని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ విమర్శించారు. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల శ్రేణులను రెచ్చగొట్టేలా వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులకు పనిచేయొద్దని ప్రజా వేదిక సాక్షిగా వ్యాఖ్యానించడం దురదృష్టకరమన్నారు. పరిగి మండలం ధనాపురంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.
ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలేనా ?
గత శనివారం చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో నిర్వహించిన సభలో సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో యావత్ రాష్ట్ర ప్రజానీకం సిగ్గుతో తలదించుకుంటున్నారని మాజీ మంత్రి ఉషశ్రీచరణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు, నాయకులకు, ప్రజాప్రతినిధులకు ఎలాంటి పని చేయకూడదని, ఒక వేళా చేస్తే పాముకు పాలు పోసినట్టేనని సాక్ష్యాత్తు సీఎం వ్యాఖ్యానించడందురదృష్టకరమన్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున రాజ్యాంగబద్ధంగా, దేవుడిపై ప్రమాణం చేసి పక్షపాత ధోరణితో వ్యవహరించనని ప్రమాణం చేసిన విషయాన్ని అప్పుడే మర్చిపోయారా అని ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీ వాళ్లకు పనులు చేయొద్దని సీఎం చంద్రబాబు చెప్పడం అటు అధికారులను, ఇటు కూటమి శ్రేణులను రెచ్చగొట్టడమేనన్నారు. ముఖ్యమంత్రిగా ఐదేళ్లు పరిపాలించిన వైఎస్ జగన్ ఏరోజైనా చంద్రబాబులాగా వ్యాఖ్యలు చేశారా? అని ధ్వజమెత్తారు. రాబోయే రోజుల్లో కేవలం కూటమి నాయకులకు, కార్యకర్తలకు మాత్రమే తమ ప్రభుత్వం పని చేస్తుందన్నది స్పష్టమైందన్నారు. సూపర్ సిక్స్ పథకాలను కేవలం తమ పార్టీ శ్రేణులకు అందించాలన్న దురుద్దేశాన్ని నింపుకుని మిగిలిన వారికి దక్కించవద్దని సూత్రప్రాయంగా చెప్పడం సబబుకాదన్నారు. ప్రశ్నిస్తామన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ వ్యవహారంపై తన స్పందన తెలపాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని వెంటనే రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్నారు.
వైఎస్సార్‌సీపీ వాళ్లకు పనిచేయొద్దని చెప్పడం శోచనీయం
జగనన్న హయాంలో అందరికీ సంక్షేమ ఫలాలు అందించాం
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు
ఉషశ్రీచరణ్
Comments
Please login to add a commentAdd a comment