ఆక్రమిత భూములపై ఆర్డీఓ విచారణ
ముదిగుబ్బ: మండల పరిధిలోని ఏబీపల్లి తండాలో ధర్మవరం ఆర్డీఓ మహేష్ బుధవారం విచారణ చేపట్టారు. ఎంపీపీ ఆదినారాయణ యాదవ్ గిరిజనుల భూములను ఆక్రమించి తమ బంధువుల పేరుతో ఆన్‌లైన్‌లో ఎక్కించుకుని బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకున్నారని బాధితులు ఆరోపిస్తుండగా... మంగళవారం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఏబీపల్లి తండాలో పర్యటించి బాధితులతో మాట్లాడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం ఆర్డీఓ మహేష్, తహసీల్దార్ నారాయణస్వామి, సర్వేయర్ శివకుమార్ నాయక్ ఏబీపల్లి తండాలో పర్యటించారు. సర్వే నంబర్ 1858, 1962, 1963, 1809లలోని భూములను ఆర్డీఓ స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు రవిశంకర్ నాయక్, గాయత్రిబాయి, నారాయణమ్మ, జయమ్మ, కుల్లాయప్ప నాయక్, బాలునాయక్‌లు తదితరులు ఆర్డీఓ ఎదుట తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఎంపీపీ ఆదినారాయణ యాదవ్ తమ భూములను ఆన్‌లైన్‌లో ఇతర పేర్లపై ఎక్కించాడని, ఆ పత్రాలతో బ్యాంకుల్లో రుణాలు కూడా తీసుకున్నాడని వాపోయారు. తమ వద్ద భూములకు సంబంధించిన అన్ని ఆధారాలు ఉన్నాయని తెలిపారు. స్పందించిన ఆర్డీఓ... గ్రామస్తులు, పెద్దల సమక్షంలో గ్రామసభ నిర్వహించి రైతులకు న్యాయం జరిగేలా చేస్తామని హామీ ఇచ్చారు. వెంటనే గ్రామ సభల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని తహసీల్దార్‌ను ఆదేశించారు.
గ్రామ సభలు నిర్వహించి అర్హులకు న్యాయం చేస్తామని వెల్లడి
Comments
Please login to add a commentAdd a comment