సమష్టి కృషితోనే మహిళాభ్యుదయం
కదిరి అర్బన్: సమష్టి కృషితోనే మహిళాభ్యుదయం సాధ్యమవుతుందని ఎస్పీ రత్న అన్నారు. ప్రస్తుతం పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తున్నప్పటికీ, మహిళల హక్కులను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో బుధవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తొలుత మున్సిపల్ కార్యాలయం నుంచి వందలాది మంది మహిళలు ర్యాలీగా జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలకు చేరుకున్నారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఎస్పీ వి.రత్న, ఆర్డీఓ వీవీఎస్ శర్మ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... మారుతున్న కాలానికి అనుగుణంగా మహిళలు కూడా మారాలన్నారు. మహిళలకు వ్యక్తిగత స్వేచ్ఛ చాలా ముఖ్యమన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ అలరించాయి. కార్యక్రమంలో సీఐలు నారాయణరెడ్డి, ఎంపీడీఓ పోలప్ప, సీడీపీఓ రాధిక, రెడ్స్ సంస్థ అధ్యక్షురాలు భానూజా పాల్గొన్నారు.
సమష్టి కృషితోనే మహిళాభ్యుదయం
Comments
Please login to add a commentAdd a comment