
ఈ భవనాసిని తీర్థమే ఒకప్పటి కోనేరు
కదిరి: ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ప్రాంగణంలోని ఈశాన్య మూలలో ఉన్న ఈ భవనాసిని తీర్థంలోనే భక్తులు గతంలో స్నానమాచరించే వారు. భక్తులు తమ ఇలవేల్పు దేవుడు నారసింహుడికి తలనీలాలు సమర్పించిన మీదట ఇందులో స్నానం చేసిన అనంతరం స్వామివారిని దర్శించుకునేవారు. అయితే లోతైన బావి తరహాలో ఉండటంతో చిన్న పిల్లలు, మహిళా భక్తులు ఇందులోకి దిగి స్నానం చేయడం కష్టంగా ఉండేది. అందుచేత ఆలయ అధికారులు కొన్నేళ్లుగా ఇందులో స్నానం చేయడానికి భక్తులను అనుమతించడం లేదు. కాగా ఇందులో ఏర్పాటు చేసిన ఆంజనేయుడి విగ్రహం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
కొట్టుకుపోయిన కోనేరు..
ఆలయానికి పడమటి వైపున అర్జున నదీ(మద్దిలేరు)తీరం ఉంది. అక్కడ భృగు మహర్షి తపస్సు చేసి స్వామి వారిని స్మరణం చేసుకున్నారు. ఆయన కోరిక మేరకు శ్రీవారు ప్రత్యక్షమై శ్రీదేవి, భూదేవి సమేత ఉత్సవ విగ్రహాలను స్వయంగా అందించినట్లు బ్రహ్మాండ పురాణం చెబుతోంది. వాటినే ఏటా బ్రహ్మోత్సవాల్లో తిరువీధుల్లో ఊరేగిస్తున్నారు. వసంత రుతువులో శ్రీవారు అనుగ్రహించడంతో ఉత్సవ మూర్తులకు వసంత వల్లభులని పేరొచ్చింది. భృగు మహర్షి తపస్సు ఫలితంగా కోనేరును భృగుతీర్థం అని పిలుస్తున్నారు. అయితే 2022లో కురిసిన భారీ వర్షాలకు కోనేరు మొత్తం కొట్టుకు పోయింది. ప్రస్తుతం నిర్మాణంలో ఉంది.
మరిన్ని తీర్థాలు..
శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి అనుబంధంగా భృగుతీర్థం, భవనాసిని తీర్థాలతో పాటు మొత్తం 13 పవిత్ర తీర్థాలు ఉన్నట్లు బ్రహ్మాండ పురాణం ద్వారా తెలుస్తోంది. 1 గజేంద్ర తీర్థం, 2 ఆళ్వారుల తీర్థం, 3 అచ్యుత తీర్థం, 4 భృగుతీర్థం, 5 అర్జున తీర్థం, 6 శ్వేత పుష్కరిణి తీర్థం, 7 భవనాసిని తీర్థం, 8 గరుడ తీర్థం, 9 నాగుల తీర్థం, 10 కూర్మతీర్థం, 11 స్వర్ణతీర్థం, 12 శ్రీ తీర్థం, 13 క్షీర తీర్థం..ప్రస్తుతం దీన్ని పాలబావిగా పిలుస్తున్నారు.

ఈ భవనాసిని తీర్థమే ఒకప్పటి కోనేరు
Comments
Please login to add a commentAdd a comment