
చట్టంపై అవగాహన అవసరం..
సాక్షి, నెట్‌వర్క్: కొనే ప్రతి వస్తువులోనూ, సేవలోనూ లోపం లేకుండా సరైన ధర, తూకం, నాణ్యత, స్వచ్ఛత కలిగినవి పొందే హక్కు వినియోగదారులకు ఉంది. అయితే ప్రస్తుతం మోసాలు ఎక్కువైపోయాయి. తాగే పాలు, నీళ్లలో కూడా నాణ్యత ఉండటం లేదు. తూకాల్లో భారీగా తేడాలు ఉంటున్నాయి. బ్రాండ్ పేరుతో నకిలీ వస్తువులు రాజ్యమేలుతున్నా.. అధికారులు మౌనం వహిస్తున్నారు. ఫిర్యాదు వచ్చిన రోజు తూతూ మంత్రంగా తనిఖీ చేసి జేబులు నింపుకొంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు వినియోగదారుల హక్కులపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అధికారులు కూడా మొక్కుబడిగా కార్యక్రమాలు చేస్తున్నారు. జిల్లా కేంద్రమైన పుట్టపర్తిలో శుక్రవారం ‘సాక్షి’ విజిట్‌లో పలు మోసాలు బయటపడ్డాయి.
‘మామూళ్ల మత్తు’లో వ్యవస్థలు..
కల్తీ, నాణ్యత, తూకాలు, గడువు మీరిన వస్తువులు. నకిలీ సరుకు, బ్రాండ్ పేరుతో దోపిడీ.. ఇలా ఇన్ని జరుగుతున్నా.. లీగల్ మెట్రాలజీ అధికారులు, డ్రగ్స్ కంట్రోలర్స్, ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. వినియోగదారులు ఫిర్యాదులు ఇస్తే.. కానీ తనిఖీలు చేయడం లేదు. చేసినా నివేదిక ఏం తెలుస్తారో బయటికి చెప్పరు. నెలవారీ మామూళ్ల మత్తులో పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి.
ఇలా ఫిర్యాదు చేద్దాం..
వినియోగదారులు నష్టపోయామని భావిస్తే జిల్లాలో అయితే డీసీఐసీ, మండలాల్లో అయితే ఎంీసీఐసీ ద్వారా కేవలం తెల్లకాగితంపై రాసి ఇస్తే సరిపోతుంది. అయితే కచ్చితంగా రసీదు ఉండాలి. విక్రయించే ప్రతి వస్తువుపైనా ఎంఆర్‌పీ తయారు చేసిన తేదీ, ఎక్స్‌పైరీ డేట్, వినియోగదారుల హెల్ప్‌లైన్‌కు చెందిన నంబరు విధిగా ముద్రించి ఉండాలి. అలా లేకపోతే వస్తువుల విక్రయ దుకాణాలపై ప్రభుత్వం జరిమానా విధించాలి. అనుమతి లేకుండా సినిమా టికెట్లు అధిక ధరలకు అమ్మినా, తూకాల్లో తేడాలున్నా, సేవల్లో లోపాలను పసిగట్టినా ఫిర్యాదు చేయొచ్చు.
నష్టపరిహారం కోరవచ్చు
నాణ్యత లేని ఉత్పత్తులపై (ప్రాడక్ట్ లైబులిటీ) తయారీదారులు, విక్రయదారులు, సేవాదారులు అందరూ బాధ్యత వహించాలి. వినియోగదారులకు నష్టపరిహారం చెల్లించాలి. రెండు సంవత్సరాల కాల పరిమితికి లోబడి కమిషన్ ఎదుట ఫిర్యాదులు దాఖలు చేయవచ్చు. వినియోగదారుల్లో చైతన్యం రావాలి. అప్పుడే వినియోగదారుల రక్షణ చట్టం లక్ష్యం నెరవేరుతుంది.
– ఎం.శ్రీలత, జిల్లా వినియోగదారుల కమిషన్ అధ్యక్షురాలు
ప్రజల్లో అవగాహన రావాలి
వినియోగదారుల చట్టంపై ప్రజలు అవగాహన పెంచుకోవాలి. అధికారులు తూతూ మంత్రంగా తనిఖీలు చేస్తుండటంతో ప్రజలు నిత్యం మోసానికి గురి కావాల్సి వస్తోంది. ఎంఆర్‌పీకి మించి అమ్ముతున్నా.. పట్టించుకునే వారు లేకపోవడం దారుణం. జిల్లా కేంద్రంలో ఆహార పరీక్షల ల్యాబ్ ఏర్పాటు చేయాలని చాలాసార్లు విన్నవించాం.
– సురేశ్‌బాబు, వినియోగదారుల సంఘం సభ్యుడు, పుట్టపర్తి
వినియోగదారుల రక్షణ చట్టం–2019 ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. నాణ్యత లేని ఉత్పత్తులు, తప్పుడు ప్రకటనలు, అధిక ధరలు, సరైన సేవలు అందకపోవడం వంటి సమస్యల నుంచి పరిహారం కోసం వినియోగదారులకు రక్షణ చట్టం అమల్లో ఉంది. మారుతున్న కాలానికి, సాంకేతిక సౌలభ్యానికి అనుగుణంగా ఈ–కామర్స్, ఆన్‌లైన్ షాపింగ్‌పై నియంత్రణ ఈ చట్టంలో ఉంది.
జిల్లా కమిషన్ ఎదుట కోటి రూపాయల లోపు
రూ. కోటి నుంచి రూ.10 కోట్ల మధ్య రాష్ట్ర కమిషన్ ఎదుట
రూ.10 కోట్ల పైబడిన కేసులు జాతీయ కమిషన్ ఎదుట దాఖలు చేయవచ్చు
వినియోగదారులు ఆన్‌లైన్‌లోనూ ఫిర్యాదు చేసే వెసులుబాటు ఉంది.

చట్టంపై అవగాహన అవసరం..
Comments
Please login to add a commentAdd a comment