
గరుడ వాహనంపై దేవ దేవుడు
కదిరి: అశేష భక్త జన గోవింద నామస్మరణ మధ్య ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి శుక్రవారం గరుడ వాహనంపై తిరువీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాలకు అధిపతి అయిన బ్రహ్మదేవుడు తన ఇష్ట వాహనమైన గరుత్మంతున్ని నారసింహుడికి వాహనంగా పంపుతారని, అందుకే ఈ ఉత్సవాన్ని బ్రహ్మ గరుడ సేవ అంటారని అర్చక పండితులు అంజన్ కుమార్ ఆచార్యులు తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో సమస్త వాహనాల్లో సర్వ శ్రేష్ఠమైన గరుడ వాహనంపై స్వామివారిని దర్శించుకుంటే స్వర్గం ప్రాప్తిస్తుందని, బాధల నుంచి విముక్తి కల్గుతుందని భక్తుల నమ్మకం. నారసింహుని బ్రహ్మోత్సవాల సమయంలో ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలికేది గరుత్మంతుడే కాబట్టి ఈ వాహన సేవకు ప్రాధాన్యత ఉంది.
రాజగోపుర దర్శనానికి పోటీ..
తమ ఇష్టదైవం ఖాద్రీశుడు తూర్పు రాజగోపురం వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా ‘ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి గోవిందా..గోవింద’ అంటూ భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. బ్రహ్మ గరుడ సేవలో తూర్పు రాజగోపురం వద్ద స్వామి వారిని దర్శించుకుంటే మరింత పుణ్యం లభిస్తుందని భక్తుల విశ్వాసం. అందుకే భక్తులు తమ ఇలవేల్పు అయిన నృసింహుడిని అక్కడ దర్శించుకోవడానికి పోటీ పడ్డారు. విద్యుత్ దీపాలంకరణ, కదిరి మల్లెలతో శ్రీవారిని విశేషంగా అలంకరించారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఉత్సవాలకు ఉభయదారులుగా కుటాగుళ్లకు చెందిన బేరి వర్తకులు బీపీ నారాయణప్ప శెట్టి కుటుంబ సభ్యులు వ్యవహరించారని ఆలయ ఈఓ శ్రీనివాసరెడ్డి తెలిపారు.
నేడు శేష వాహనం..
బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం (నేడు) లక్ష్మీ నారసింహుడు శేషవాహనంపై తన భక్తులకు తిరువీధుల్లో దర్శనం ఇవ్వనున్నారు.
భక్తులతో పోటెత్తిన నృసింహాలయం గోవింద నామస్మరణతో మార్మోగిన కదిరి

గరుడ వాహనంపై దేవ దేవుడు
Comments
Please login to add a commentAdd a comment