
ప్లాస్టిక్ కాటు.. చేటు!
ధర్మవరం: ప్రజారోగ్యాన్ని, పర్యావరణాన్ని దెబ్బతీసే ప్లాస్టిక్ వినియోగంపై ప్రభుత్వాలు నిషేధించాయి. కానీ జిల్లాలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లు, ఇతర సామగ్రి విక్రయాలు విచ్చల విడిగా సాగుతున్నాయి. ఇందులో ధర్మవరం మున్సిపాలిటి జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలుస్తోంది. దీంతో రోడ్డు ప్రక్కన, డ్రైనేజీలలో ఎక్కడ చూసినా ప్లాస్టిక్ కవర్లు దర్శనమిస్తున్నాయి. పట్టణానికి చెందన కొందరు వ్యాపారులు జిల్లాలోని పలు ప్రాంతాలకూ ప్లాస్టిక్ కవర్లను సరఫరా చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
నిబంధనలు బేఖాతర్
40 మైక్రాన్‌ల కంటే తక్కువ మందం ఉండే ప్లాస్టిక్ వస్తువులను ప్రభుత్వం నిషేధించింది. ఈ ప్లాస్టిక్ కవర్‌లు గానీ, వస్తువులు గానీ ఎక్కడా కూడా విక్రయించ కూడదు. కానీ మున్సిపల్ అధికారులు ప్లాస్టిక్ నిషేధంపై దృష్టి సారించకపోవడంతో పట్టణంలోని వ్యాపారులు, చిరు వ్యాపారులు నిబంధనలు బేఖాతర్ చేస్తున్నారు.
ప్లాస్టిక్ ఎగుమతులకు అడ్డాగా ధర్మవరం
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యాపారులు కంపెనీల నిర్వాహకులతో ఒప్పందం కుదుర్చుకుని నిషేధిక ప్లాస్టిక్ కవర్లు, ఇతర సామగ్రిని భారీగా నిల్వ చేసుకుని విక్రయాలు జరుపుతున్నారు. పట్టణంలోని పీఆర్‌టీ సర్కిల్, అంజుమన్ సర్కిల్, కాలేజ్ సర్కిల్‌లో ముగ్గురు వ్యాపారులు నిషేధిక ప్లాస్టిక్ కవర్లను కదిరి, హిందూపురం, పెనుగొండ, మడకశిర, రాప్తాడులకు ఎగుమతి చేస్తున్నట్లు సమాచారం. 40 మైక్రాన్‌ల కంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ వస్తువులను కిలో రూ.130 చొప్పున అమ్ముతున్నట్లు తెలుస్తోంది.
అధికారులకు ముడుపులు
ప్లాస్టిక్ హోల్‌సేల్ వ్యాపారులు మున్సిపాలిటిలోని కొందరు అధికారులకు ప్రతి నెలా ముడుపులు ముట్టజెపుతూ ప్లాస్టిక్ విక్రయాలను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. అందువల్లే అధికారులు కూడా సదరు వ్యాపారుల గోడౌన్‌లు, దుకాణాల వైపు చూడటం లేదు. ఒకవేళ ప్రభుత్వం నుంచి ఒత్తిడి వస్తే హడావుడి చేస్తారు. తోపుడు బండ్ల వ్యాపారులు, కిరాణా షాపు యజమానులకు జరిమానా విధించి చేతులు దులుపుకుంటున్నారు. ఫలితంగా మున్సిపాలిటి పరిధిలో ప్లాస్టిక్ వాడకం ఎక్కువైంది. దీంతో ప్రజారోగ్యం, పర్యావరణం కూడా దెబ్బతింటోంది. ప్లాస్టిక్ కవర్లను ఎక్కడపడితే అక్కడ పడేస్తుండటంతో వాటిని తిని మూగ జీవాలు మృతి చెందుతున్నాయి.
పూలు, పండ్లతో పాటు ఏ చిన్నపాటి వస్తువు కొన్నా ప్లాస్టిక్ కవర్లలో చుట్టివ్వడం సాధారణమైంది. దీనికి తోడు ఇప్పుడు ఇడ్లీ వేసేందుకూ ప్లాస్టిక్ కవర్లనే వాడుతున్నారు. వేడీ వేడి సాంబార్‌ను, టీని సైతం ప్లాస్టిక్ కవర్‌లో పార్శిల్ చేస్తున్నారు. ఇలా విచ్చల విడిగా ప్లాస్టిక్ వాడటం వల్ల అటు పర్యావరణానికి, ప్రజారోగ్యానికి తీవ్ర నష్టం జరుగుతోంది. అందువల్లే ప్రభుత్వాలు సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్‌ను నిషేధించాయి. కానీ ధర్మవరంలో మాత్రం ప్లాస్టిక్ కవర్ల వినియోగం తగ్గలేదు. పైగా ఇక్కడి నుంచే జిల్లాలోని వివిధ ప్రాంతాలకు నిషేధిత ప్లాస్టిక్ కవర్లు, ఇతర సామగ్రి ఎగుమతి అవుతోంది.
ప్లాస్టిక్ కూపంగా ధర్మవరం
యథేచ్ఛగా ప్లాస్టిక్ వస్తువుల వినియోగం
కీలకంగా మారిన ముగ్గురు వ్యాపారులు
ఇతర ప్రాంతాలకూ ‘ప్లాస్టిక్’ సరఫరా
కట్టడి చేయడంలో వ ుున్సిపల్ అధికారులు విఫలం
దెబ్బతింటున్న పర్యావరణం,
ప్రజారోగ్యం

ప్లాస్టిక్ కాటు.. చేటు!