రైతుల పేరుతో రెడ్డెప్పశెట్టి డ్రామా!
సాక్షి టాస్క్‌ఫోర్స్: చిత్రావతి నదిపై అక్రమంగా వంతెన నిర్మించి ఏళ్లుగా నదీ జలాలను సొంతానికి వాడుకుంటూ రైతుల నోట్లో మట్టికొట్టిన రియల్టర్ రెడ్డప్పశెట్టి...ఇప్పుడు తప్పించుకునేందుకు కొత్తరాగం అందుకున్నారు. చిత్రావతిపై వంతెన రైతుల కోసమేనంటూ సరికొత్త డ్రామాకు తెరతీశారు. అటు అధికారులను, ఇటు కోర్టులను కూడా తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. తన ఎస్టేట్ కోసం చిత్రావతి నదిపై నిర్మించుకున్న అక్రమ వంతెన తొలగిస్తే రైతులకు ఇబ్బంది అంటూ సంబంధం లేని వ్యక్తలతో గోప్యంగా కలెక్టర్‌కు వినతిపత్రం అందించినట్లు తెలుస్తోంది. కంచె వేసుకొని రైతులకు దారి కూడా ఇవ్వకుండా వేధిస్తున్న రెడ్డెప్పశెట్టి... ఇప్పుడు తప్పించుకునేందుకు రైతుల పేరునే వాడుకుంటున్నాడు. తనకు అనుకూలంగా ఉండే కొంతమందిని తన స్వార్థ ప్రయోజనాలకు వాడుకోవడంపై ప్రజల నుంచి విమర్శలు వినపడుతున్నాయి.
చర్యలకు అధికారుల వెనకడుగు
రియల్టర్ రెడ్డెప్పశెట్టి అక్రమాలు సాక్ష్యాలతో సహా వెలుగులోకి వచ్చినా...చర్యలు తీసుకోవడంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. నదిపై అక్రమంగా వంతెన నిర్మాణం, కంచె వ్యవహారంపై ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించగా.. అధికారులు హడావుడి చేశారు. రెడ్డెప్పశెట్టికి నోటీసులిచ్చి, కేసు పెట్టి వదిలేశారు. ఫిబ్రవరి 28వ తేదీలోపే అక్రమ వంతెనను కూల్చేస్తామని నోటీసుల్లో పేర్కొన్నా...నేటికీ చర్యలు తీసుకోలేదు. ఇక ఈడీ అటాచ్‌మెంట్‌లో ఉన్న లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూములనూ విడిపించలేదు. నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న అసైన్డ్ భూములనూ వెనక్కి తీసుకునే ప్రయత్నమేదీ చెయ్యలేదు. ఇది అధికారుల్లో నెలకొన్న అలసత్వమా.. లేక మరేదైనా కారణమా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
తప్పించుకునేందుకు సమయం ఇస్తున్నారా?
రెడ్డెప్పశెట్టిపై రెండు కేసులు నమోదు కాగా, పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకునేందుకు తొలుత ప్రయత్నాలు చేశారు. అయితే ఆయన ఎక్కడ ఉన్నాడన్నది తెలియకపోవడంతో ఆ ప్రయత్నాలు విరమించారు. సదరు రియల్టర్‌కు బెయిల్ కూడా రాకపోవడంతో ఆయన అజ్ఞాతంలోనే ఉండిపోయారు. ఇక తామే చర్యలు తీసుకుంటామని చెప్పిన ఇరిగేషన్ అధికారులు నేటికీ ఆ దిశగా అడుగులు వెయ్యకపోవడంతో ఉన్నతాధికారుల ఒత్తిళ్లు ఏమైనా ఉన్నాయా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 43 ఎకరాలు నది, ప్రభుత్వ భూమికి ఎంజాయ్‌మెంట్ పట్టా పొందడం, దాన్ని ఆక్రమించడం వంటి వాటికి సంబంధించి న్యాయ పరంగా తప్పించుకునేందుకే అధికారులు సమయం ఇస్తున్నారన్న విమర్శలు వినపడుతున్నాయి.
గ్రీన్ ట్రిబ్యునల్, ఈడీలకు ఫిర్యాదు?
రెడ్డెప్పశెట్టి తన పలుకుబడి వినియోగించి అక్రమాలను దాచేసి కోర్టులను తప్పుదోవ పట్టిస్తున్న నేపథ్యంలో కొంతమంది రైతులు గ్రీన్ ట్రిబ్యునల్‌లో ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నదీ జలాలను ఏళ్లుగా తన సొంత అవసరాలకు వినియోగించుకుంటూ, తన బోరుబావుల్లో నీరు వచ్చేలా ప్లాన్ చేసుకోవడం వంటి వాటితో నదీ పరివాహక రైతులు నీటి సమస్యతో ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు కూడా తప్పించుకునే ప్రయత్నం చేస్తుండటంతో ఇక నేరుగా గ్రీన్ ట్రిబ్యునల్‌లో ఫిర్యాదు చేసేందుకు రైతులు సిద్ధమైనట్లు సమాచారం. అదే విధంగా ఈడీ అటాచ్‌మెంట్‌లోని భూములను ఆక్రమించిన నేపథ్యంలో ఈడీ కార్యాలయంలోనూ ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
చిత్రావతిపై అక్రమంగా వంతెన కట్టి
రైతులను వంచించిన రియల్టర్
ఇప్పుడు రైతుల కోసమే వంతెన
కట్టానంటూ తప్పించుకునే ప్రయత్నం
ఫిబ్రవరి 28లోపే బ్రిడ్జి తొలగిస్తామని నోటిసులిచ్చి ఊరుకున్న అధికారులు
కంచె తొలగింపులోనూ అలసత్వం
గ్రీన్‌ట్రిబ్యునల్, ఈడీకి ఫిర్యాదు
చేసేందుకు సిద్ధమైన రైతులు
Comments
Please login to add a commentAdd a comment