
టీడీపీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గిన అధికారులు
లేపాక్షి: లక్షలాది రూపాయలతో వేలం పాట దక్కించుకున్నా అధికారులు డబ్బులు కట్టించుకోకుండా టీడీపీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గారు. ఎమ్మెల్యే కార్యాలయ పైరవీలతో చివరకు వేలాన్ని రద్దు చేసారు. వివరాలు... లేపాక్షి గ్రామ పంచాయతీ పరిధిలో వారపు సంత, బస్టాండు ఆదాయ వనరులపై పంచాయతీ అధికారులు సోమవారం ఉదయం వేలం పాట నిర్వహించారు. ఇందులో బస్టాండులో వాహనాల పార్కింగ్‌కు సంబంధించి లేపాక్షికి చెందిన శంకరరెడ్డి అత్యధికంగా రూ.72 లక్షల వేలం పాడి దక్కించుకున్నారు. నిబంధనల మేరకు వేలం పాడిన 24 గంటల్లోపు వేలం పాడిన మొత్తంలో 50 శాతం డిపాజిట్ చెల్లించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం 12 గంటలకే 50 శాతం మొత్తాన్ని వేలం పాటదారుడు చెల్లించడానికి వెళితే అక్కడ అధికారులు అందుబాటులో లేకుండా పోయారు. ఇదేమని ఆరా తీస్తే టీడీపీ నేతల ఒత్తిళ్లతో అధికారులు కార్యాలయం వదిలి వెళ్లిపోయారని తేలింది. అదే సమయంలో సమయం మించి పోయిన తర్వాత డబ్బు చెల్లించేందుకు వచ్చినందుకు తిరస్కరిస్తున్నట్లుగా అక్కడున్న కింది స్థాయి సిబ్బంది నోటీసులు ఇచ్చే ప్రయత్నం చేసారు. ఈ అన్యాయంపై శంకర్‌రెడ్డి అసహనం వ్యక్తం చేస్తుండగానే టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. అధికారంలో ఉన్నాం కాబట్టి తమకు అనుకూలంగా ఉన్న వారికే అధికారులు పనులు చేయాలని, తమ పార్టీకి సంబంధంలోని వ్యక్తికి టెండర్ ఎలా ఇస్తారంటూ దౌర్జన్యానికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ నరేంద్ర, గ్రామ సర్పంచ్ ఆదినారాయణ అక్కడకు చేరుకుని సర్ది చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. ఈఓఆర్డీ ఆనందకుమార్, పంచాయతీ కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ... నిబంధనల మేరకు వేలం పాట రద్దు చేసి తిరిగి ఎప్పడు వేలం నిర్వహించేది ప్రకటిస్తామని పేర్కొన్నారు. శంకర్‌రెడ్డి మాట్లాడుతూ మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు తాను కార్యాలయానికి చేరుకున్న సమయంలో పంచాయతీ సిబ్బంది తప్ప కార్యదర్శి అందుబాటులో లేరన్నారు. 2 గంటల తర్వాత వచ్చిన కార్యదర్శి, ఈఓఆర్డీ డబ్బులు కట్టించుకోకుండా నిరాకరించారన్నారు. కేవలం టీడీపీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి తనకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయంపై న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నట్లు పేర్కొన్నారు.
వాహనాల పార్కింగ్‌కు సంబంధించి రూ.72 లక్షల వేలం రద్దు చేసిన వైనం
తెలుగు తమ్ముళ్ల హైడ్రామాలకు వేదికగా మారిన పంచాయతీ కార్యాలయం
Comments
Please login to add a commentAdd a comment