పెనుకొండ రూరల్: ‘‘మంత్రి సవిత నోటికి ఏది వస్తే అది మాట్లాడుతోంది. నాలుక ఉంది కదా అని ఇష్టానుసారం విమర్శలు చేస్తోంది. కానీ ఆమె తన స్థాయి తెలుసుకుని మాట్లాడాలి. ఇంకోసారి తమ పార్టీనిగానీ, తమ అధినేత వైఎస్ జగన్‌పై గానీ నోరుజారితే ఊరుకునే ప్రసక్తే లేదు’ అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ హెచ్చరించారు. సోమవారం ఆమె తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఓ జాతీయ పార్టీని రాష్ట్రంలో నామరూపాల్లేకుండా చేసిన ఘనత తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిదని గుర్తించుకోవాలన్నారు. సింహంలా ఎవరి పొత్తు లేకుండా సింగిల్‌గా ఎన్నికల్లో పోటీ చేసిన వైఎస్సార్ సీపీకి 40 శాతం మంది ఓటు వేసిన విషయం తెలుసుకోవాలన్నారు. తాము టీడీపీలాగా... రోజుకో పార్టీతో జతకట్టి దిగజారుడు రాజకీయాలు చేయలేమన్నారు. ఇప్పటికైనా మంత్రి సవిత వాస్తవాలు తెలుసుకుని తన స్థాయి గుర్తించుకుని మాట్లాడాలన్నారు. నిజంగా ఆమెకు చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన హామీలు నెరవేర్చేలా ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఒత్తిడి తేవాలన్నారు.
దందాలు నిజం కాదా?
పెనుకొండ నియోజకవర్గంలోని క్రషర్ల యజమానులపై మంత్రి, ఆమె అనుచురులు అజమాయిషీ చేస్తున్న విషయం నిజం కాదా అని ఉషశ్రీచరణ్ ప్రశ్నించారు. ఇందులో మంత్రికి ఏమైనా సందేముంటే ఆమైపె ఆమె ఇంటిలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకుంటే కళ్లు బైర్లుకమ్మే వాస్తవాలు తెలుస్తాయన్నారు. మంత్రి అనుచరులు రొద్దం, పరిగి మండలాల నుంచి ఇసుక దందాలకు తెర లేపారని, గోరంట్ల, పాలసముద్రం, గొందిపల్లి, గ్రామాల నుంచి అక్రమంగా మట్టి తరలిస్తు సొమ్ము చేసుకుంటున్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు. కాదనే దమ్ము సవితకు ఉంటే నిరూపించుకోవాలన్నారు.
మరోసారి ఇష్టానుసారం
మాట్లాడితే ఊరుకోం
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు
ఉషశ్రీచరణ్ హెచ్చరిక