తీరు మారదు.. కక్కుర్తి తీరదు | - | Sakshi
Sakshi News home page

తీరు మారదు.. కక్కుర్తి తీరదు

Published Tue, Mar 25 2025 2:00 AM | Last Updated on Tue, Mar 25 2025 1:55 AM

కదిరి అర్బన్‌: కమీషన్ల మోజులో వైద్య సేవలను నిర్లక్ష్యం చేస్తూ వృత్తికి మాయని మచ్చను తెస్తున్నారు కొందరు డాక్టర్లు. రూ.లక్షల్లో ప్రభుత్వ జీతం తీసుకుంటూనే అడ్డగోలు సంపాదనపై మోజుతో రోగులపై అదనపు ఆర్థిక భారం మోపుతున్నారు. ప్రభుత్వ వైద్యశాలలో అన్ని సేవలూ ఉచితం కాగా, కొందరు డాక్టర్ల తీరుతో ఆ సేవలు కాస్త అభాసుపాలవుతున్నాయి. ఇందుకు నిదర్శనమే కదిరిలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి. ఇక్కడ సేవ అనే పదానికి అర్థం లేకుండా పోయింది. ఇక్కడి వైద్యుల కాసుల కక్కుర్తి కారణంగా రూ.వేలల్లో ఆర్థిక భారాన్ని నిరుపేద రోగులు భరించాల్సి వస్తోంది.

కాసుల కక్కుర్తికి పరాకాష్టగా...

ఈ నెల 7న కదిరి మండలం చిప్పలమడుగు గ్రామానికి చెందిన గర్భిణి అంజలి పురిటి నొప్పులతో కాన్పు కోసం కదిరి ఏరియా ఆస్పత్రికి రాగా, ఆమెకు గర్భంలో సమస్య ఉందని నాలుగు స్కానింగ్‌లను చేయించుకుని రావాలంటూ గైనకాలిజిస్టు ఒకరు ఆస్పత్రి పక్కనే ఉన్న ప్రైవేట్‌ ల్యాబ్‌కు రెఫర్‌ చేశారు. ఆస్పత్రిలో స్కానింగ్‌ చేయరా? అని అంజలి బంధువులు అడిగితే ఇక్కడ అలాంటి సౌకర్యం లేదని బుకాయించడంతో గత్యంతరం లేని స్థితిలో అంజలి కుటుంబసభ్యులు రూ.4,500 ఫీజు చెల్లించి ప్రైవేట్‌ ల్యాబ్‌లో స్కాన్‌ చేయించారు. ఈ అంశంపై ఈ నెల 11న ‘ప్రభుత్వ డాక్టర్‌ అత్యాశ’ శీర్షికన ‘సాక్షి’లో కథనం వెలువడిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ వెంటనే సదరు డాక్టర్‌కు షోకాజ్‌ నోటీసు జారీ చేశారు. ఆస్పత్రిలో రూ. 45 లక్షలు విలువ చేసే అత్యాధునిక స్కానింగ్‌ యంత్రాలు ఉన్నా... గర్భంలో సమస్య ఉందంటూ భయబ్రాంతులకు గురి చేస్తూ కమీషన్ల కోసం ప్రైవేట్‌ స్కానింగ్‌ సెంటర్లకు రెఫర్‌ చేస్తున్న ప్రభుత్వ వైద్యుల కాసుల కక్కుర్తికి ఈ ఘటన పరాకాష్టగా నిలిచింది.

నాటి ఘటన మరువకనే..

ఈ నెల 10న వెలుగు చూసిన కదిరి ఏరియా ఆస్పత్రి వైద్యుల కాసుల కక్కుర్తి ఘటన మరువకనే మరో ఘటన వెలుగు చూసింది. తన నెలవారీ వైద్య పరీక్షల్లో భాగంగా ఈ నెల 22న కదిరిలోని మగ్గాల క్వాటర్స్‌కు చెందిన ఓ గర్భిణి కదిరి ఏరియా ఆస్పత్రికి వెళ్లింది. ఆమెను పరీక్షించిన డ్యూటీ గైనకాలజిస్ట్‌... గర్భస్థ శిశువు ఎదుగుదలపై స్కానింగ్‌ చేయించుకుని రావాలంటూ ఆర్‌ఎస్‌ రోడ్డులో ఉన్న ఓ ప్రైవేట్‌ స్కానింగ్‌ సెంటర్‌కు రెఫర్‌ చేశారు. ఇప్పటికే ప్రతి నెలా పలు రకాల వైద్య పరీక్షల కోసం ప్రైవేట్‌ స్కానింగ్‌ సెంటర్లకు రూ.వేలల్లో ఫీజులు చెల్లించుకున్న సదరు గర్భిణి కుటుంబసభ్యులకు ఇది అదనపు ఆర్థిక భారంగా మారింది. దీంతో ప్రత్యామ్నాయ వైద్య పరీక్షల కోసం ఆరా తీస్తే గర్భంలో సమస్య ఉందంటూ భయభ్రాంతులకు గురి చేశారు. తప్పని పరిస్థితుల్లో సదరు గర్భిణిని పిలుచుకుని ఆర్‌ఎస్‌ రోడ్డులోని స్కానింగ్‌ సెంటర్‌కు కుటుంబసభ్యులు చేరుకున్నారు. విషయం కాస్త బయటకు పొక్కడంతో ఈ అంశాన్ని విజయవాడకు వ్యక్తిగత పనిపై వెళ్లిన ఆస్పత్రి సూపరింటెండెంట్‌ దృష్టికి పాత్రికేయులు ఫోన్‌లో తీసుకెళ్లారు. దీంతో ఆయన అసహనానికి గురై వెంటనే సదరు గైనకాలజిస్ట్‌కు ఫోన్‌ చేసి మందలించడంతో ఆమె స్కానింగ్‌ సెంటర్‌ నిర్వాహకులకు ఫోన్‌ చేసి తాను పంపిన గర్భిణికి స్కానింగ్‌ చేయకుండా వెనక్కు పంపాలని అభ్యర్థించినట్లు తెలిసింది.

స్పందించని అధికారులు..

ఈ నెల 7న పురిటి నొప్పులతో ఏరియా ఆస్పత్రికి వచ్చిన గర్భిణికి గర్భంలో సమస్య ఉందంటూ నాలుగు స్కానింగ్‌లకు ప్రైవేట్‌ ల్యాబ్‌కు రెఫర్‌ చేసిన గైనకాలజిస్ట్‌కు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ హుస్సేన్‌ మెమో జారీ చేశారు. ఇది జరిగి రెండు వారాలకు పైగా అవుతున్నా... ఇప్పటి వరకూ సదరు గైనకాలజిస్ట్‌పై ఎలాంటి చర్యలూ లేవు. ఇదే అంశంపై సదరు గర్భిణి మామ రాత పూర్వకంగా ఫిర్యాదు చేసినా ఉన్నతాధికారులు స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. తాజాగా జరిగిన ఘటనలో సంబంధిత గైనకాలజిస్ట్‌ మాట్లాడుతూ.. హిందూపురానికి చెందిన తన బంధువుల అమ్మాయికి రాసిన స్కానింగ్‌ ప్రిస్కిప్షన్‌ను పొరపాటున అదే పేరుతో ఉన్న కదిరికి చెందిన గర్భిణి తీసుకెళ్లిందన్నారు. విషయం ఆలస్యంగా గుర్తించిన వెంటనే స్కానింగ్‌ సెంటర్‌ డాక్టర్‌కు ఫోన్‌ చేసి ఆ స్కానింగ్‌ చేయొద్దని తెలిపి, ఆమెను తిరిగి ఆస్పత్రికి పిలిపించి ఇక్కడే స్కానింగ్‌ చేయించినట్లు వివరించారు.

మెమోలిచ్చినా తీరు మార్చుకోని

ప్రభుత్వ వైద్యులు

రూ.లక్షల్లో ప్రభుత్వ జీతం

అయినా అడ్డగోలు సంపాదనపై మోజు

కమీషన్ల కోసం రోగులపై అదనపు ఆర్థిక భారం

వీళ్లింతే మారరు

రోగ నిర్ధారణ, గర్భస్థ శిశువు ఎదుగుదల పరిశీలన తదితర అంశాలపై ప్రైవేట్‌ ల్యాబ్‌లకు రెఫర్‌ చేయరాదని పలుమార్లు ఇక్కడి డాక్టర్లకు చెబుతూనే ఉన్నాం. అయినా వారి పని తీరు మారలేదు. ఇక నాతో కాదు. వీరు మారరు. నేనే ఇక్కడి నుంచి ట్రాన్స్‌ఫర్‌ పెట్టుకుని వెళ్లిపోతా. ఈ నెల 7న బయటకు స్కానింగ్‌ రాసిన డాక్టర్‌కు షోకాజ్‌ నోటీసు జారీ చేశాను. ఆమె వివరణను ఉన్నతాధికారులకు పంపాను.

– డాక్టర్‌ హుస్సేన్‌, ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌

తీరు మారదు.. కక్కుర్తి తీరదు 1
1/2

తీరు మారదు.. కక్కుర్తి తీరదు

తీరు మారదు.. కక్కుర్తి తీరదు 2
2/2

తీరు మారదు.. కక్కుర్తి తీరదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement