బత్తలపల్లి: ప్రభుత్వ భూ పంపిణీలో భాగంగా నిరుపేదలకు అందజేసిన అసైన్డు భూమిని కూటమి నేతలు తమ అనుచరులకు కట్టబెట్టేందుకు సిద్ధమయ్యారు. సదరు భూమిలో రాత్రికి రాత్రే మామిడి మొక్కలు నాటారు. వివరాలు... బత్తలపల్లి మండలం దంపెట్ల రెవెన్యూ గ్రామంలోని సర్వే నంబర్107 లో 26.80 ఎకరాల భూమిని 2012లో అప్పటి ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి చొరవతో సూర్యచంద్రాపురం గ్రామానికి చెందిన 11 మంది ఎస్టీలకు రెండు ఎకరాల చొప్పున 22 ఎకరాలను ప్రభుత్వం పంపిణీ చేసింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మిగిలిన 4.80 ఎకరాల భూమితో పాటు 11 మంది రైతులకు పంపిణీ చేసిన భూమిని ఆక్రమించుకునేందుకు కూటమి పార్టీల నేతలు కుట్రకు తెరదీశారు. గత 15 రోజులుగా ఆ భూమిని కబ్జా చేసేందుకు ముళ్లచెట్లు తొలగించడం, భూమిని చదును చేయడం, మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలను రాత్రికి రాత్రే చేపట్టారు. తమకు పంపిణీ చేసిన భూమిలో సాగు ఎలా చేస్తారంటూ హక్కుదారులు కూటమి నేతలను అడ్డుకుని, న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించారు. ఇరువర్గాల వారు భూమి తమదంటే తమదంటూ వాగ్వాదానికి దిగడంతో అందరినీ పిలుచుకెళ్లి తహసీల్దార్ ఎదుట పోలీసులు బైండోవర్ చేయించారు. ఈ భూ సమస్య పరిష్కారం అయ్యే వరకూ ఎవరూ అందులోకి వెళ్లకూడదని, సాగు చేయరాదని, ఘర్షణలకు పాల్పడరాదంటూ ఎస్‌ఐ సోమశేఖర్ సూచించారు. కాగా, తమకు గతంలోనే ప్రభుత్వం భూ పంపిణీ చేస్తూ హక్కు పట్టాలు ఇచ్చిందని తహసీల్దార్ స్వర్ణలత దృష్టికి లబ్ధిదారులు తీసుకెళ్లగా.. ఆ భూములు సాగులో లేనందున పట్టాలను రద్దు చేస్తున్నట్లు తహసీల్దార్ బెదిరింపు ధోరణిలో మాట్లాడడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాభావం, కరువు పరస్థితుల కారణంగా తాము భూమిని సాగు చేయలేకపోయామని, అంతమాత్రాన సాగు హక్కులు పొందిన భూమి తమకు కాకుండా పోతుందా? అంటూ బాధిత రైతులు వాపోతున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని పట్టాలను రద్దు చేయించి తమకు అనుకూలమైన వారికి పట్టాలు ఇప్పించేందుకు కూటమి నేతలు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ఈ విషయమై కలెక్టర్‌ను కలసి న్యాయం కోరనున్నట్లు తెలిపారు. కాగా, దంపెట్ల రెవెన్యూ పొలం సర్వే నంబర్ 107లోని వివాదాస్పద భూమిలోకి ఎవరూ వెళ్లరాదని బత్తలపల్లి పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు తహసీల్దారు ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొన్నారు.
రాత్రికి రాత్రే అసైన్డ్ భూమిలో
మామిడి మొక్కలు నాటిన వైనం
ఇరువర్గాలను బైండోవర్ చేసిన
పోలీసులు
సాగులో లేనందున పట్టాలు రద్దు
చేస్తానంటూ తహసీల్దార్ బెదిరింపు