
అభివృద్ధి ఎక్కడ జరిగిందో చెప్పాలి
మడకశిర: కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మడకశిర నియోజకవర్గంలో అభివృద్ధి ఎక్కడ జరిగిందో చెప్పాలని ఎమ్మెల్యే ఎంఎస్ రాజును వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త ఈరలక్కప్ప డిమాండ్ చేశారు. ఆర్భాటాలు చేయడం, ప్రగల్భాలు పలకడమే అభివృద్ధి కాదని విమర్శించారు. పట్టణ సుందరీకరణ జరగలేదని సాక్షిలో ప్రచురితమైన కథనంపై ఎమ్మెల్యే అవాకులు చెవాకులు పేలడాన్ని ఖండించారు. మీడియాన్ని భయపెట్టాలని చూస్తే కష్టాలను కొని తెచ్చుకున్నట్లేనని హెచ్చరించారు. ఆదివారం మడకశిర ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి ఆనందరంగారెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు నరసింహమూర్తి, కుంచిటి వక్కలిగ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రంగేగౌడ్‌తో కలిసి ఈరలక్కప్ప మాట్లాడారు. ఎమ్మెల్యే ఎంఎస్ రాజు వారానికి ఒకసారి అనంతపురం నుంచి మడకశిరకు వచ్చి వెళ్తారన్నారు. అభివృద్ధి జరగడం లేదని, సమస్యలు పరిష్కారం కావడం లేదని కథనాలు ప్రచురిస్తున్న సాక్షిపై చిందులు వేయడం పరిపాటిగా మారిందని, ఎమ్మెల్యే తాటాకు చప్పుళ్లకు ఎవ్వరూ భయపడరని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించాలని చూడడం తగదన్నారు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్, పత్రికను, పాత్రికేయులను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. టీటీడీ బోర్డు సభ్యుని నోటి నుంచి ఇలాంటి మాటలు రాకూడదన్నారు. విమర్శలు మాని మడకశిర నియోజకవర్గంలో మట్కా, గ్యాంబ్లింగ్, మద్యం బెల్ట్ షాపులు, కర్ణాటక మద్యం అమ్మకాలు అరికట్టడంపై దృష్టి సారించాలని హితవు పలికారు. గడిచిన తొమ్మిది నెలల కాలంలో ప్రభుత్వ శాఖలపై ఏమాత్రం పట్టు సాధించలేదని, కనీసం రెగ్యులర్ అధికారులను నియమించుకోవడానికి కూడా నీ చేతకాలేదన్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తల జోలికొస్తే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను ఎందుకు నెరవేర్చలేదో చెప్పాలని ఎమ్మెల్యేను ప్రశ్నించారు. ఓట్ల కోసం హామీలు ఇవ్వడం, అధికారంలోకి రాగానే మోసం చేయడమే మీ పార్టీ పని అని ధ్వజమెత్తారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ప్రజలు ఉగాదిని కూడా సంతోషంగా చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి వైఎస్సార్‌సీపీ పూర్తిస్థాయిలో సహకారం అందిస్తుందని, అనవసరంగా మీడియాపై చిందులు తొక్కడం, వైఎస్‌జగన్‌ను దుర్భాషలాడడాన్ని మానుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ నాయకులు శేషు, హరి తదితరులు పాల్గొన్నారు.
ఆర్భాటాలు, ప్రగల్భాలు వద్దు
వారానికోసారి వచ్చి వెళ్తే సరిపోతుందా?
రెగ్యులర్ అధికారులను
వేయించడంలో విఫలం
మీడియాను భయపెట్టాలని చూస్తే కష్టాలు కొనితెచ్చుకున్నట్టే
మడకశిర ఎమ్మెల్యేపై వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త ఈరలక్కప్ప ధ్వజం