
దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి
● కలెక్టర్ టీఎస్ చేతన్ పిలుపు
ప్రశాంతి నిలయం: దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో తాము ఎంచుకున్న రంగంలో ముందుకు సాగాలని కలెక్టర్ టీఎస్ చేతన్ సూచించారు. జిల్లా విభిన్న ప్రతిభావంతుల శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్‌లో దివ్యాంగులకు స్వయం ఉపాధి పథకం కింద 17 మంది విభిన్న ప్రతిభావంతులకు రూ.38.50 లక్షల విలువైన రుణాలు, డిగ్రీ, ఇతర వృత్తి విద్యా కోర్సులు అభ్యసిస్తున్న 15 మంది విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, మరో 13 మంది బధిరులకు టచ్‌ఫోన్లను కలెక్టర్ చేతన్ అందజేశారు. అలాగే విభిన్న ప్రతిభావంతులకు రూ.47 లక్షల రుణాలు, ఉపకరణాలు అందించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ... విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థులు చదువులు, క్రీడల్లో ముందంజలో ఉండాలన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సంచాలకులు వినోద్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
అకాల వర్షం..
రైతుకు కష్టం
పుట్టపర్తి అర్బన్: అకాల వర్షంతో రైతులకు తీరని నష్టం కలిగింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో కాస్తోకూస్తో ఉన్న పంటలూ దెబ్బతిన్నగా రైతులకు రూ.లక్షల నష్టం వాటిల్లింది. ముఖ్యంగా ఉద్యాన పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అరటి నేలవాలగా, దోస, కళింగర, మామిడి తదితర పంటలకు నష్టం జరిగింది. 20 నుంచి 30 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీయడంతో పలుచోట్ల చెట్లు నేలకొరిగాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ తీగలు తెగిపోయి సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
27 మండలాల పరిధిలో వర్షం..
వాతావరణంలో మార్పులతో గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం ఉదయం వరకూ జిల్లాలోని 27 మండలాల పరిధిలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఒక్కరోజే జిల్లాలో 614 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అత్యధికంగా నల్లమాడ మండలంలో 59.4 మి.మీ వర్షం కురిసినట్లు వెల్లడించారు. ఇక కనగానపల్లి మండలంలో 51.4 మి.మీ, పుట్టపర్తి మండలంలో 51.4 మి.మీ, చెన్నేకొత్తపల్లి 45.6, రామగిరి 41.4, కొత్తచెరువు 39.4, ఓడీచెరువు 35.4, పెనుకొండ 34.8, ధర్మవరం 34.6, బుక్కపట్నం 34, అమరాపురం 32.6, బత్తలపల్లి 23.6, రొద్దం 22.2, సోమందేపల్లి 19.6, తాడిమర్రి 18.2, ముదిగుబ్బ 15.2, గోరంట్ల 15.2, చిలమత్తూరు 9.8, తలుపుల 6.4, కదిరి 5.2, మడకశిర 4.6, నల్లచెరువు మండలంలో 3.4 మి.మీ మేర వర్షపాతం నమోదైనట్లు వెల్లడించారు.

దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి