అనంతపురం: ప్రమాదవశాత్తు ఇంటిపై నుంచి కిందపడి ఓ వైద్యుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... అనంతపురం నగరంలోని రెవెన్యూ కాలనీలో నివాసముంటున్న డాక్టర్ అమిలినేని మధు (49)కు భార్య డాక్టర్ సుష్మ, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. దంపతులిద్దరూ దంత వైద్యులు కావడంతో నగరంలోని క్లాక్ టవర్ సమీపంలో ఓ ప్రైవేట్ క్లినిక్ నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. శుక్రవారం మధ్యాహ్నం భోజనం చేసిన అనంతరం ఇంటిపైన నాలుగో అంతస్తులో ఉన్న వాటర్ ట్యాంక్‌ను పరిశీలించేందుకు డాక్టర్ అమిలినేని మధు వెళ్లాడు. గోడపైకి ఎక్కి వాటర్ ట్యాంక్ మూత తీసి పరిశీలిస్తుండగా, ప్రమాదవశాత్తు కాలు జారి పై నుంచి కిందకు పడడంతో వెన్నముక, కాళ్లు విరిగాయి. తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే మృతిచెందాడు. డాక్టర్ సుష్మ ఫిర్యాదు మేరకు అనంతపురం మూడో పట్టణ సీఐ కె.శాంతిలాల్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.