గుడిబండ: మహిళా సంఘాల్లోని రైతులకు ఆర్థిక స్వావలంబన, వ్యవసాయ రంగంలో బలోపేతం చేయడం చాలా అవసరమని ఐఐపీఎం ప్రొఫెసర్ నరేంద్రన్ పేర్కొన్నారు. స్థానిక మండల కేంద్రంలోని ఎఫ్‌పీఓ కార్యాలయంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాంటేషన్ మేనేజ్‌మెంట్ ఆధ్వర్యంలో వ్యాపార ప్రణాళిక, బ్రాండింగ్, మార్కెటింగ్‌పై మహిళా సంఘాల రైతులకు శనివారం శిక్షణ నిర్వహించారు. ప్రొఫెసర్ నరేంద్రన్ మాట్లాడుతూ రైతులు పండించిన పంటను నేరుగా అమ్మకుండా ప్రాసెస్ చేసి, ప్యాకింగ్ చేసి మార్కెట్‌లో అమ్మతే అధిక లాభాలు పొందవచ్చునని సూచించారు.
అనంతరం పండించిన పంటను గ్రేడింగ్ ఏ విధంగా చేయాలి, గ్రేడింగ్ చేసిన పంటను ఏ విధంగా ప్యాకింగ్ చేయాలి, బ్రాండింగ్ ఏ విధంగా ఉండాలి, పంటను నిల్వ ఎలా చేయాలి, బ్రాండింగ్‌కు ప్రచారం ఏ విధంగా చేయాలన్న అంశాలపై శిక్షణ ఇచ్చారు. వెలుగు పథకం ద్వారా స్వయం సహాయక బృందాల మహిళలకు జీవనోపాధిపై ప్రణాళికలు తయారు చేసుకోవాలని అసిస్టెంట్ ప్రొఫెసర్ రసూల్ కోరారు. కార్యక్రమంలో ఏపీఎం తిప్పన్న, ఎఫ్‌పీఓ సీసీ దేవరాజు, మహిళా సంఘాల రైతులు పాల్గొన్నారు.
ఒకే వరుసలో మూడు వాహనాలు ఢీ
పెనుకొండ రూరల్: దుద్దేబండ మలుపు సమీపంలో శనివారం ఒకే వరుసలో వస్తున్న మూడు వాహనాలు వేగాన్ని అదుపు చేసుకోలేక ఢీకొన్నాయి. కియా స్టేషన్ ఎస్‌ఐ రాజేష్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కురుబవాండ్లపల్లికి చెందిన లావణ్య తన భర్తతో కలసి కియా అనుంబంధ పరిశ్రమలో విధులకు ఆటోలో వస్తోంది. మార్గమధ్యంలో దుద్దేబండ మలుపు సమీపంలో స్పీడ్‌బ్రేకర్ వద్ద ఆటోను స్లో చేయడంతో వెనకే వస్తున్న మారుతి కారు ఢీకొంది.
అదే సమయంలో వేగంగా వచ్చిన ఐచర్ వాహనం కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న లావణ్య, కారులో ప్రయాణిస్తున్న త్రివేణి గాయపడ్డారు. స్థానికులు 108 వాహనం ద్వారా పెనుకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం వైద్యుల సూచన మేరకు లావణ్యను అనంతపురం పంపించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

వ్యాపార ప్రణాళికపై శిక్షణ