తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతుల ధర్నా
అగళి: పరిశ్రమల ఏర్పాటుకు తమ భూములు ఇవ్వబోమని హెచ్.డి.హళ్లి పంచాయతీ గాయత్రీ కాలనీ, ఉల్లేకెర, దేవరహళ్లి, సుగాలి తండా, వడ్రహట్టి, పి.బ్యాడగేర గ్రామాల రైతులు సోమవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు.ఇటీవల పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి తమ భూములను కలెక్టర్ పరిశీలించారని, ఎట్టి పరిస్థితుల్లోనూ భూములు ఇచ్చేందుకు తాము సుముఖంగా లేమని తేల్చి చెప్పారు.
తమకున్న అరకొర భూములను పరిశ్రమల ఏర్పాటు పేరుతో ప్రభుత్వం తీసుకుంటే తాము ఎలా బతకాలని ఆవేదన వ్యక్తం చేశారు. తమ అభిప్రాయానికి వ్యతిరేకంగా భూసేకరణ ప్రక్రియ చేపట్టి పొట్ట కొట్టరాదంటూ తహసీల్దార్ సుబ్బారావుకు వినతిపత్రం అందజేశారు. సమస్యను జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చొరవ తీసుకుంటానని తహసీల్దార్ ఇచ్చిన హామీతో ఆందోళనను రైతులు విరమించారు.
విద్యుదాఘాతంతో రైతు మృతి
పుట్టపర్తి అర్బన్: విద్యుత్ షాక్‌కు గురై ఓ రైతు మృతి చెందాడు. పుట్టపర్తి రూరల్ పీఎస్ ఏఎస్‌ఐ ప్రసాద్ తెలిపిన మేరకు... పుట్టపర్తి మండలం రాచువారిపల్లికి చెందిన నంబూరి ప్రసాద్(45)కు భార్య చంద్రకళ, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వ్యవసాయంతో కుటుంబాన్ని పోషించుకుంటున్న ప్రసాద్... తనకున్న ఎనిమిది ఎకరాల్లో వరి, కళింగర, దోస పంటలను సాగు చేస్తున్నాడు. సోమవారం మధ్యాహ్నం 1 గంట సమయంలో విద్యుత్ సరఫరా కావడంతో పంటకు నీళ్లు పెట్టేందుకు పొలానికి వెళ్లాడు.
ఈ క్రమంలో స్టార్టర్ పెట్టెలో బటన్ నొక్కినా మోటార్ ఆన్ కాకపోవడంతో ట్రాన్స్‌ఫార్మర్ వద్ద కేబుల్‌ను పరిశీలిస్తుండగా ప్రమాదవశాత్తు షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. పొలంలో బోరు మోటార్ ఆన్ చేసి వస్తానంటూ వెళ్లిన వ్యక్తి ఎంతకూ రాకపోవడంతో కుటుంబసభ్యులు ఆయన సెల్‌ఫోన్ నంబర్‌కు కాల్ చేశారు. అటువైపు నుంచి స్పందన లేకపోవడంతో ఆందోళనకు గురయ్యారు. ఈ లోపు పొలం వద్ద నుంచి వచ్చిన చుట్టుపక్కల రైతులు.. నంబూరి ప్రసాద్ మృతిచెందినట్లు తెలపడంతో కుటుంబసభ్యులు బోరున విలపిస్తూ పొలానికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. చంద్రకళ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

భూసేకరణతో పొట్ట కొడతారా?