
చంపినట్లే. నిన్ను చంపేస్తాం!
లింగమయ్యను
పుట్టపర్తి టౌన్: ‘ప్రభుత్వం మాది... ఇక్కడ మాదే రాజ్యం. పాపిరెడ్డిపల్లి లింగమయ్యను చంపేసినట్లే నిన్నూ చంపేస్తాం’ అంటూ ఓ సామాజిక సేవా కార్యకర్తపై టీడీపీ నేతలు దౌర్జన్యానికి తెగబడ్డారు. మహిళ అని కూడా చూడకుండా చెప్పులతో కొట్టి అవమానపరిచి చంపుతామని బెదిరించారు. దీంతో టీడీపీ నేతల నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. న్యాయం చేయాల్సిన ఖాకీలు చేతులెత్తేశారు. కేసును నీరుగార్చి బాధితురాలి ప్రాణాలకు భరోసా లేకుండా చేశారు. దీంతో జరిగిన ఘటనను ఎస్పీ రత్న దృష్టికి బాధితురాలు, అమడగూరు మండలం మహమ్మదాబాద్‌కు చెందిన లక్ష్మీదేవి తీసుకొచ్చారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎస్పీని కలసి వినతి పత్రం అందజేసి, తన గోడు వెల్లబోసుకున్నారు. ఫిర్యాదులో ఆమె పేర్కొన్న వివరాలు..
‘మాది అమడగూరు మండలం మహమ్మదాబాద్ గ్రామం. నాకు, నా కుటుంబసభ్యులకు ఏ రాజకీయ పార్టీలతో సంబంధం లేదు. అనాథ పిల్లలు, వృద్ధులకు సేవ చేయాలని అనుకున్నా. 2024, డిసెంబర్ 5న నా సొంత పొలంలోని 20 సెంట్ల స్థలంలో ఓ షెడ్ వేయించాలనుకున్నా. ఇందుకు గాను నాకున్న మూడు సెంట్ల స్థలాన్ని అమ్మగా వచ్చిన డబ్బుతో ఇటీవల షెడ్ వేయిస్తున్నా. నా సేవా సంకల్పాన్ని చూసి ఓర్వలేక స్థానిక టీడీపీ నాయకులు రాము, వెంకటేష్, సురేష్.. షెడ్డు కట్టకూడదని అడ్డుకున్నారు. నన్ను నోటికొచ్చినట్లు తిట్టారు. చెప్పులతో కొట్టారు. అధికారంలో ఉన్నాం... మా వెనుక మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి ఉన్నారు... రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో లింగమయ్యను చంపినట్లు చంపేస్తాం... ఎవరు అడ్డొస్తారో చూస్తాం అంటూ బెదిరించారు. దీంతో నాకు ప్రాణహాని ఉందని సాక్ష్యాలతో సహా అమడగూరు పోలీసులకు ఫిర్యాదు చేశాను. అయితే పోలీసులు టీడీపీ నేతలకే వత్తాసు పలికారు. వారిపై గొడవ కేసు నమోదు చేసి, అరెస్ట్ కూడా చేయకుండా స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపారు. దీంతో వాళ్లు నామీద మరింత కక్ష కట్టి నన్ను భయపెడుతున్నారు. నాకు ప్రాణహాని ఉంది. న్యాయం చేయండి’ అంటూ ఎస్పీ వద్ద బాధితురాలు వాపోయారు. దీనిపై స్పందించిన ఎస్పీ... నీకు ఎలాంటి హాని లేకుండా చూస్తామని, బెదిరింపులకు పాల్పడిన వారిని బైండోవర్ చేయిస్తానంటూ భరోసానిచ్చారు.
65 వినతులు..
జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వివిధ సమస్యలపై 65 వినతులు అందాయి. ఎస్పీ రత్న స్వయంగా వినతులు స్వీకరించి, అర్జీదారులతో మాట్లాడారు. సమస్య తీవ్రత తెలుసుకుని, చట్ట పరిధిలోని అంశాలకు తక్షణ పరిష్కారం చూపాలని సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్లను ఆదేశించారు. కార్యక్రమంలో మహిళా పీఎస్ డీఎస్పీ ఆదినారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.
సామాజిక సేవా కార్యకర్తను
బెదిరించిన టీడీపీ నేతలు
ప్రాణహాని ఉందంటూ చేసిన ఫిర్యాదును నీరుగార్చిన పోలీసులు
తనకు న్యాయం చేయాలంటూ
పోలీసులను వేడుకున్న బాధిత మహిళ

చంపినట్లే. నిన్ను చంపేస్తాం!