
స్వల్పంగా పెరిగిన స్కేల్ ఆఫ్ రిలీఫ్
అనంతపురం అగ్రికల్చర్: వరదలు, ఈదురుగాలులు, వడగండ్ల వాన, అకాల వర్షాలు తదితర ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఆస్తి, పంట నష్టం, అలాగే పశువులు, జీవాలు, కోళ్లు నష్టం తదితర వాటికి వర్తింపజేసే ఎక్స్‌గ్రేషియా (స్కేల్ ఆఫ్ రిలీఫ్) స్వల్పంగా పెంచుతూ రాష్ట్ర ప్రకృతి విపత్తుల విభాగం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (ఎస్‌డీఆర్‌ఎఫ్) నిబంధనల ప్రకారం ప్రతి రెండు, మూడు సంవత్సరాలకు స్కేల్ ఆఫ్ రిలీఫ్ ఖరారు చేస్తారు. ఈ క్రమంలో తాజాగా పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చారు. పెరిగిన స్కేల్ ఆఫ్ రిలీఫ్ 2024 ఆగస్టు నుంచి వర్తిస్తుందని పేర్కొన్నారు.
● పాడి ఆవు లేదా గేదె చనిపోతే రూ.50 వేలు, ఎద్దుకు రూ.40 వేలు, దూడలకు రూ.25 వేలు, గొర్రెలు, మేకలకు రూ.7,500, ఒక్కో కోడికి రూ.100 ప్రకారం గరిష్టంగా రూ.10 వేలు, పశువుల పాక నష్టానికి రూ.5 వేల ప్రకారం పరిహారం వర్తింపజేశారు.
● మనిషి చనిపోతే రూ.5 లక్షలు, ఇళ్లు కూలినా, దెబ్బతిన్నా రూ. 10 వేలు, కిరాణా కొట్టుకు రూ.25 వేలు, రూ.40 లక్షల వార్షిక టర్నోవర్ కలిగిన కుటీర పరిశ్రమలకు రూ.50 వేలు, రూ.1.50 కోట్ల లోపు టర్నోవర్ కలిగిన వాటికి రూ.లక్ష, రూ.ఒకటిన్నర కోట్లకు పైగా టర్నోవర్ కలిగిన వాటికి రూ.1.50 లక్షలు, ద్విచక్రవాహనాలకు రూ.3 వేలు, త్రిచక్ర వాహనాలకు రూ.10 వేలు, తోపుడు బండ్లకు రూ.20 వేలు, చేనేతలకు రూ.25 వేలు, పాక్షికంగా బోట్లు దెబ్బతింటే రూ.9 వేలు, వలలకు రూ.5 వేలు, బోట్లు, వలలు పూర్తిగా దెబ్బతింటే రూ.20 వేలు, మోటార్ బోట్లు, వలలు దెబ్బతింటే రూ.25 వేలు, చేపల చెరువుకు రూ.18 వేలు, పట్టు రైతులకు 25 వేలు ప్రకారం నష్ట ఉపశమనం వర్తింపజేస్తారు.
● వేరుశనగ, పత్తి, వరి, చెరకు హెక్టారుకు రూ.25 వేల ప్రకారం లెక్కకట్టి ఇస్తారు. సజ్జ, మినుము, పెసర, మొక్కజొన్న, రాగి, కంది, కుసుమ, సోయాబీన్, పొద్దుతిరుగుడు, పొగాకు, ఆముదం, కొర్ర, సామ, జూట్ పంటలు హెక్టారుకు రూ.15 వేల ప్రకారం స్కేల్ ఆఫ్ రిలీఫ్ ఖరారు చేశారు.
● అరటి, మామిడి, దానిమ్మ, జామ, ఉసిరి, సపోటా, రేగు, డ్రాగన్‌ఫ్రూట్, జీడిపప్పు, కాఫీ, పసుపు, మిరప హెక్టారుకు రూ.35 వేలు, కళింగర, కర్భూజా, దోస, బొప్పాయి, టమాటా, పూలు, ఉల్లి, ధనియాలు, కూరగాయలకు రూ.25 వేలు, సెంటు విస్తీర్ణంలో ఉన్న ఆకుతోటలకు రూ.300 ప్రకారం గరిష్టంగా రూ.75 వేల వరకు ఇస్తారు. కర్రపెండలం రూ.10 వేలు, ఒక్కో కొబ్బరి చెట్టుకు రూ.1,500 ప్రకారం స్కేల్ ఆఫ్ రిలీఫ్ ఖరారు చేశారు.