
ఇక చాలు.. దయ చేయండి!
అనంతపురం: ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న కూటమి ప్రభుత్వం మాట తప్పింది. పైగా ఇప్పటివరకూ ఉన్న ఉద్యోగాలనూ తొలగిస్తోంది. జేఎన్‌టీయూ (ఏ) పరిధిలో పనిచేస్తున్న 150 మంది అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్వాసన పలికేందుకు సర్వం సిద్ధం చేయడమే ఇందుకు నిదర్శనం. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో 2008లో జేఎన్‌టీయూ (ఏ) వర్సిటీ ఏర్పాటైంది. వర్సిటీలో కార్యకలాపాల నిర్వహణకు అప్పట్లోనే అవుట్ సోర్సింగ్ కింద ఉద్యోగులను నియమించారు. ప్రస్తుతం వర్సిటీ పరిధిలో మొత్తం 650 మంది ఉన్నారు. కలికిరి ఇంజినీరింగ్ కళాశాలలో 120 మంది, పులివెందుల ఇంజినీరింగ్ కళాశాల 150, క్యాంపస్ ఇంజినీరింగ్ కళాశాల 80, ఓటీఆర్‌ఐ 26, జేఎన్‌టీయూ (అనంతపురం నగరంలో)లో 274 మంది పనిచేస్తున్నారు.
అంతలోనే ఎంత తేడా..
చిరుద్యోగులకు దన్నుగా నిలిచేలా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంది. ‘ఆప్కాస్’ ఏర్పాటు చేసి ప్రతి నెలా క్రమం తప్పకుండా జీతం చెల్లించింది. ఉద్యోగాలను ఇష్టానుసారం తొలగించే పరిస్థితి లేకుండా భద్రత కల్పించింది. పీఎఫ్ సౌకర్యం ఉండేది. అయితే, కూటమి ప్రభుత్వం వచ్చాక పరిస్థితి ఒక్కసారిగా తలకిందులైంది. ‘ఆప్కాస్’ నుంచి జీతాలు చెల్లించలేమంటూ చేతులెత్తేసింది. దీంతో జేఎన్‌టీయూ అంతర్గత వనరుల నుంచి జీతాలు ఇవ్వాల్సి రావడంతో ఆ మేరకు ఆర్థిక వనరులు లేక ఉద్యోగులను తొలగించాలనే నిర్ణయానికి ఉన్నతాధికారులు వచ్చారు. మూడు రోజుల క్రితం జరిగిన పాలకమండలి సమావేశంలో దాదాపు 150 మంది ఉద్యోగులను తొలగించాలని తీర్మానించినట్లు తెలిసింది. ఈ విషయం బయటకు పొక్కడంతో ఉద్యోగుల్లో భయాందోళన నెలకొంది. గత ప్రభుత్వ హయాంలో జేఎన్‌టీయూ(ఏ)లో ఇద్దరు, కలికిరిలో ఐదుగురిని మాత్రమే ఉద్యోగాల్లోకి తీసుకున్నారు. మిగిలిన 643 మంది చాలా ఏళ్లనుంచి కొనసాగుతున్న వారే. ఈ క్రమంలో వర్సిటీ ఏర్పడినప్పటి నుంచి ఉన్న ఉద్యోగులకూ ఉద్వాసన తప్పదని తెలుస్తోంది.
జేఎన్‌టీయూ (ఏ) పరిధిలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపునకు కసరత్తు
రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి
ఉద్యోగులను తొలగించే ప్రక్రియను జేఎన్‌టీయూ యాజమాన్యం మానుకోవాలి. అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ వ్యవస్థలో దళారుల ప్రమేయం అధికంగా ఉండేది. సక్రమంగా జీతాలు చెల్లించేవారు కాదు. ‘ఆప్కాస్’ ద్వారా సక్రమంగా జీతాలు అందేవి. ఇటీవల ‘ఆప్కాస్’ నుంచి జీతాలు చెల్లించలేమని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఉన్న ఉద్యోగులను తొలగించేలా నిర్ణయం తీసుకోవడం సరికాదు.
– కే.విజయ్, ఉమ్మడి జిల్లా కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ