నాటి కేంద్రమంత్రి కిల్లి కృపారాణి కేటాయించిన నిధులతో నిర్మించిన వంతెనను చూపిస్తున్న బొడ్డబడ గ్రామస్తులు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: టీడీపీ నేతలకు సెల్ఫీ పిచ్చిపట్టింది. తమ హయాంలో జరిగిన ఘనకార్యమిది అని సెల్ఫీ ఫొటోలు దిగుతూ సామాజిక మాధ్యమాల్లో వదులుతున్నారు. తీరా వాస్తవాలు చూసేసరికి అడ్డంగా బుక్ అయిపోయి సెల్ఫ్ గోల్ అవుతున్నారు. తమ అధినేతలు చంద్రబాబునాయుడు, లోకేష్‌లను అనుసరించి ప్రజల చేత చీదరించుకుంటున్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులకు సవాల్ చేసి, నిజాలు తెలుసుకున్నాక కంగుతింటున్నారు.
పాదయాత్ర నుంచి మొదలు..
లోకేష్ పాదయాత్ర చేపట్టినప్పటి నుంచి సెల్ఫీ రాజకీయాలు ప్రారంభించారు. ప్రతిచోటా సెల్ఫీలు దిగుతూ సామాజిక మాధ్యమాల్లో పెడుతూ వైఎస్సార్‌సీపీ నాయకులకు సవాల్ విసురుతున్నారు. దీనికి వెంటనే వైఎస్సార్‌సీపీ నేతలు, తటస్థులు, స్థానికులు దీటుగా బదులిస్తున్నారు. సెల్ఫీలో ఉన్నవి మీ ఘనకార్యం కాదని...అవన్నీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్..ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన కార్యక్రమాలని ఆధారాలతో పాటు అప్పటి ఫొటోలు పెట్టి రీట్విట్ చేస్తున్నారు.
దీంతో ఇప్పటికే చాలాసార్లు లోకేష్ కంగుతిన్నారు. ఇది చాలదన్నట్లు చంద్రబాబు సైతం సెల్ఫీ రాజకీయాలు మొదలు పెట్టారు. టీడీపీ హయాంలో అరకొర పనులు చేపట్టిన టిడ్కో గృహాలను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం హయాంలో పూర్తి చేస్తే..వాటిని కాస్త తన ఖాతాలో వేసుకుని సెల్ఫీ తీసుకుని సవాల్ విసిరారు. దీంతో వైఎస్సార్‌సీపీ నాయకులు వెంటనే స్పందిస్తూ చంద్రబాబు హయాంలో పనులు ఎంత వరకు జరిగాయి.. వారెంత ఖర్చు పెట్టారు..ఇప్పుడెంత పనులు జరిగాయి..వీరెంత ఖర్చు పెట్టారన్న దానిపై ఆధారాలు, వ్యయాలు, ఫొటోలతో కలిపి చంద్రబాబుకు కౌంటర్ ఇచ్చారు. దీంతో చంద్రబాబు షాక్ తిన్నారు.
ఇప్పుడు జిల్లానేతల వంతు..
సెల్ఫీ పిచ్చి ఇప్పుడు టీడీపీ జిల్లా నేతల వంతు వచ్చింది. ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ సెల్ఫీ రాజకీయాలకు తెరలేపారు. ఇచ్ఛాపురం మండలం బొడ్డబడ గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కేంద్రమంత్రిగా కిల్లి కృపారాణి ఉన్నప్పుడు రూ.7కోట్ల వ్యయంతో రోడ్ కమ్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. పనులు ప్రారంభించాక కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోయింది. టీడీపీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ హయాంలోనే ఆ నిధులన్నీ మంజూరయ్యాయి. కాంట్రాక్టర్ పనులు కూడా చేపట్టారు. కిల్లి కృపారాణికి ఆ గ్రామస్తులు కృతజ్ఞతగా సత్కారం కూడా చేశారు.
కానీ ఈ బ్రిడ్జి నిర్మాణం తమ ఘనత అంటూ.. ఇలాంటివి మీ హయాంలో జరిగాయా అంటూ వైఎస్సార్‌సీపీ నాయకులకు సవాల్ విసురుతూ మంగళవారం ట్విట్టర్‌లో పోస్టు చేశారు. రాజకీయంగా చూస్తే టీడీపీ నేతల సవాల్‌కు వైఎస్సార్‌సీపీ నేతలు స్పందించాలి. కానీ వారికన్నా ముందు బొడ్డబడ గ్రామస్తులే స్పందించారు. ఇది మీ గొప్పతనం కాదు.. కాంగ్రెస్ హయాంలో మంత్రిగా పనిచేసిన కిల్లి కృపారాణి గొప్పతనమంటూ ఆ బ్రిడ్జి వద్ద సెల్ఫీ తీసుకుని ఎంపీ, ఎమ్మెల్యేలకు కౌంటర్ ఇచ్చారు. ఇందులో టీడీపీ గొప్పతనమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీడీపీకి సెల్ఫీ సవాల్ విసిరితే..
వైఎస్సార్‌సీపీ నేతలు గాని, సంబంధిత గ్రామస్తులు గాని తమ కళ్ల ముందు టీడీపీ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలు.. ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ హయాంలో చేపడుతున్న అభివృద్ధి పనులపై సెల్ఫీలు తీసుకుని సవాల్ విసిరితే టీడీపీ నేతలు జవాబు చెప్పలేని పరిస్థితి ఉంది. గతంలో లేనట్టుగా ప్రతి గ్రామంలోనూ సచివాలయం, విలేజ్ హెల్త్ క్లినిక్, రైతు భరోసా కేంద్రాలు, పశు వైద్య క్లినిక్, అగ్రి ల్యాబ్‌లతో సెల్ఫీలు తీసుకుని సవాల్ విసిరితే టీడీపీ నాయకులు తట్టుకోలేని పరిస్థితి. ఇక, టీడీపీ హయాంలో చేపట్టిన నాసిరకం పనులు, నాణ్యత లేని రోడ్లు, వందల కోట్లు మేసేసి, అడ్డంగా దోచుకున్న నీరు చెట్టు పనులు, టీడీపీ హయాంలో చేపట్టిన నాణ్యత లేని రోడ్లు, ఇతర నిర్మాణాలపై సెల్ఫీలు తీసి సామాజిక మాధ్యమాలు, పత్రికలకు వదిలితే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment