
శ్రీకాకుళం: ఆరు నెలలుగా ఆ కుటుంబం నరకయాతన అనుభవిస్తోంది. కూలి పనికి వెళ్తే గానీ రోజు గడవని పరిస్థితుల్లో ఆ ఇంటి యజమాని కాలేయ వ్యాధికి గురై మంచానికే పరిమితమైపోయాడు. కాలేయ మార్పిడి జరిగితే గానీ అతని ప్రాణం దక్కదు. కానీ ఆపరేషన్ చేయించే స్థోమత ఆ నిరుపేద కుటుంబానికి లేదు. ప్రభుత్వ పెద్దలతోపాటు దాతలు సాయం చేస్తే తన భర్త ప్రాణాలు దక్కుతాయని ఆ ఇంటి ఇల్లాలు అభ్యర్థిస్తున్నారు. తండ్రికి వచ్చిన వ్యాధి ఏమిటో తెలియకపోయినా నాన్న ప్రాణాలు కాపాడండి ప్లీజ్ అంటూ ఇద్దరు చిన్నారులు విన్నవిస్తుండడం హృదయాలను ద్రవింపజేస్తోంది.
వివరాల్లోకి వెళితే..
మండల పరిధిలోని సంతవురిటి గ్రామానికి చెందిన సవలాపురపు వెంకటరావు (41) కాలేయ వ్యాధితో బాధ పడుతున్నారు. ఆరు నెలలుగా పరిస్థితి తీవ్రంగా ఉండగా.. లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయాలని నెల కిందటే డాక్టర్లు వారికి సూచించారు. ఆయనకు భార్య రాజేశ్వరి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రాజేశ్వరి, వెంకటరావులు కూలి పనికి వెళ్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. రెండేళ్ల నుంచి కాలేయ వ్యాధి ఆయనను ఇబ్బంది పెడుతూ ఇప్పుడు ముదిరిపోయింది. ఇప్పటికే విజయనగరం, విశాఖ, విజయవాడ, శ్రీకాకుళంలో ఉన్న ప్రైవేటు ఆస్పత్రులకు తీసుకెళ్లి చూపించారు.
ఇప్పుడు లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఒక్కటే ఆయన ప్రాణాలను కాపాడగలదని వైద్యులు చెప్పడంతో.. ఆపరేషన్ చేయించడానికి ఆ కుటుంబం అష్టకష్టాలు పడుతోంది. ఇప్పటికే రూ.15 లక్షల వరకు అప్పు చేశామని, ఇప్పుడు ఇంకో రూ.50 లక్షల వరకు అవసరమవుతోందని, ఇంత పెద్ద మొత్తం తీసుకురావడం తమ వల్ల కావడం లేదని రాజేశ్వరి కన్నీరు పెట్టుకుంటూ చెబుతున్నారు. దాతలే ముందుకువచ్చి సాయం అందిస్తే తన భర్త ప్రాణాలు కాపాడుకుంటానని అభ్యర్థిస్తున్నారు.
కూలి చేసి కాపాడుకుంటున్నాం
మాది రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం. నా భర్తను కాపాడుకునేందుకు నానా ఇబ్బందులు పడుతున్నాం. రోజువారీ కూలి డబ్బులు బతకడానికే సరిపోవడం లేదు. మరోవైపు ఇద్దరు పిల్లలను పోషించాల్సిన బాధ్యత కూడా నాపై ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రూ.50 లక్షలు వైద్యం కోసం తీసుకురావడం నాకు తలకుమించిన పని. ప్రభుత్వం, దాతలే మమ్మల్ని ఆదుకోవాలి.
– ఎస్.రాజేశ్వరి, వెంకటరావు భార్య
సాయం చేయాలనుకునేవారు
99598 06655 నంబర్‌ను
సంప్రదించాలని, ఫోన్ పే నంబర్ కూడా అదేనని కుటుంబ సభ్యులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment