ఒకరు రోడ్డు ప్రమాదంలో మృతి
మరొకరు జమ్మూకాశ్మీర్‌లో ఆత్మహత్య
శోకసంద్రంలో జీడిపుట్టుగ, మోదుగులపుట్టి గ్రామాలు
కాశీబుగ్గ : దేశరక్షణలో సేవలందిస్తున్న ఇద్దరు ఆర్మీ జవాన్లు వేర్వేరు కారణాలతో మృత్యువాతపడ్డారు. ఒకరు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి సాయం కోసం వేడుకుంటూ హృదయ విదారకరంగా మృతిచెందగా.. మరొకరు తాను విధులు నిర్వహిస్తున్న చోటే ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు విడిచారు. దీంతో ఆయా కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి.
లారీ కింద నలిగిపోయి..
సోంపేట మండలం జీడిపుట్టుగ గ్రామానికి చెందిన చెల్లూరి చైతన్య (28) ఇటీవల సీఆర్‌పీఎఫ్ జవాన్‌గా ఎంపికయ్యాడు. శిక్షణ పూర్తి చేసుకుని సెలవు నిమిత్తం స్వగ్రామానికి వచ్చాడు. పలాసలో ఉంటున్న తన పెద్దమ్మను కలిసి ఆశీర్వాదం తీసుకునేందుకు మంగళవారం బైక్‌పై బయలుదేరాడు. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని కోసంగిపురం జాతీయ రహదారి వంతెన దిగువ ప్రాంతానికి వచ్చే సరికి ఇసుక లారీ ఢీకొట్టింది. చక్రాలమధ్య ఇరుక్కుపోవడంతో సగభాగం నుజ్జయిపోయి విలవిల్లాడాడు. తనను రక్షించాలని వేడుకున్నా ఫలితం లేకపోయింది.
సమాచారం అందుకున్న 108 అంబులెన్సు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని బాధితుడ్ని పలాస ప్రభుత్వ సామాజిక ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అధిక మొత్తంలో రక్తాన్ని కోల్పోవడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చైతన్య మృతి చెందాడు. చైతన్య తండ్రి మరణించగా.. తల్లి కష్టపడి ఇద్దరు కుమారులను చదివించింది. మరో సోదరుడు తేజ చదువుతున్నాడు. చైతన్యకు ఉద్యోగం రావడంతో కుటుంబానికి పెద్ద దిక్కుగా మారాడు. ఇంతలోనే విధి కన్నెర్రచేయడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఏం జరిగిందో..
పలాస మండలం టెక్కలిపట్నం పంచాయతీ మోదుగులపుట్టి గ్రామం కొత్తవీధికి చెందిన మద్దిల జోగారావు (40) జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని ఉదంపూర్ యూనిట్‌లో జేసీఓ కేడర్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. సోమవారం రాత్రి విధి నిర్వహణలో ఉండగా ఆత్మహత్య చేసుకున్నట్లు మంగళవారం ఉదయం కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. జోగారావుకు తండ్రి ఇది వరకే మరణించారు. తల్లి ఆదెమ్మ, భార్య హేమాకుమారి, టెన్త్ చదువుతున్న కుమార్తె చాందిని, ఎనిమిదో తరగతి చదువుతున్న లక్ష్మివరప్రసాద్‌లు గ్రామంలోనే ఉన్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియడం లేదు. జమ్మూ కాశ్మీర్ నుంచి బుధవారం సాయంత్రానికి మృతదేహం స్వగ్రామానికి చేరుకోనుందని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment