సోంపేట/కంచిలి: ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ ఆనవాయితీ కొనసాగించారు. పచ్చటి పల్లెలో కక్షలు రగిలించి రాజకీయ లబ్ధి పొందాలనే రాక్షస రాజకీయ సంప్రదాయాన్ని మళ్లీ కొనసాగించారు. ఇన్నాళ్లూ ఏ పార్టీ తరఫున ఆ పార్టీ నాయకులు ప్రశాంతంగా ప్రచారం చేసుకుంటూ ఉంటే.. అశోక్ మాత్రం తన నైజం చూపించారు. తాను ఎమ్మెల్యే స్థానంలో ఉండి కూడా తన పార్టీ కార్యకర్తలతో ఓ యాదవ సామాజిక వర్గ నాయకుడిపై దాడి చేయించారు.
సోంపేట మండలం కర్తలిపాలెం పంచాయతీ పరిధి సంధికొత్తూరు గ్రామంలో గురువారం సాయంత్రం నిర్వహించిన టీడీపీ ఎన్నికల ర్యాలీలో వైఎస్సార్ సీపీ నేత ఇంటిపై టీడీపీ రౌడీమూకలు మూకమ్మడిగా దాడి చేశాయి. ఆయన ఇంటిలోకి చొరబడి విధ్వంసకాండ సృష్టించాయి. దాడిలో యాదవ సామాజిక వర్గం నేత, ఉపసర్పంచ్ కొల్లి గోపయ్య, ఉలాల తిరుపతి, పోగల ఈశ్వరరావు గాయపడ్డారు. పదేళ్లు అధికారంలో ఉండి అశోక్ కనబర్చిన రాజకీయ పరిణితి ఇదేనా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. తమ నాయకుడికి జరిగిన అవమానంపై యాదవ సామాజిక వర్గానికి చెందిన వారంతా భగ్గుమంటున్నారు.
దాడి అమానుషం: మాజీ ఎమ్మెల్యే సాయిరాజ్
వైఎస్సార్ సీపీకి చెందిన యాదవ సామాజిక వర్గ నేత, ఉపసర్పంచ్ కొల్లి గోపయ్య, మరో ఇద్దరుపై టీడీపీ రౌడీ మూకలు దాడి చేయడం అమానుషమని మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్ తీవ్రంగా ఖండించారు. గాయపడిన వారిని ఆయన పరామర్శించారు. పదేళ్లు అధికారం ఇచ్చిన ప్రజలకు నువ్వు ఇచ్చిన బహుమతి ఇదా అని అశోక్ తీరును దుయ్యబట్టారు. అహంకారం, అహంభావానికి ఓటుతో ప్రజలు బుద్ధి చెప్పి ఓడిస్తారని అన్నారు.
ఇచ్ఛాపురం నియోజకవర్గం యాదవులు తప్పనిసరిగా అశోక్‌కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తారని అన్నారు. యాదవులే లక్ష్యంగా ఎమ్మెల్యే దాడికి ఉసిగొల్పారని అన్నారు. సంధికొత్తూరులో ఉన్న కీలక నేతలను భయపెట్టి గ్రామంలో లేకుండా చేస్తే గుంపగుత్తగా ఓట్లు వేయించుకోవచ్చన్న కుట్రతో వైఎస్సార్ సీపీ కార్యకర్తల ఇళ్లపై దాడిచేయించారని అన్నారు. ఎమ్మెల్యే అశోక్ దగ్గరుండి దాడి చేయించడం ఆయన తీరును కనబరుస్తుందన్నారు. పోలీసులు ఎమ్మెల్యే అశోక్‌పైన కూడా కేసు నమోదు చేసి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment