ఏకైక మహిళా ఎమ్మెల్యే .. | - | Sakshi
Sakshi News home page

ఏకైక మహిళా ఎమ్మెల్యే ..

Published Wed, Jun 5 2024 7:58 AM | Last Updated on Wed, Jun 5 2024 1:30 PM

-

అరసవల్లి: స్వాతంత్య్ర సమరయోధుడు సర్దార్‌ గౌతు లచ్చన్న వారసురాలు, ఆయన మనవరాలు గౌతు శిరీష తొలిసారి చట్టసభల్లోకి అడుగుపెట్టనున్నారు. 2014లో తొలిసారి ఆమె టీడీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పలాస నుంచి ఎన్నికల బరిలో దిగినప్పటికీ గెలుపు సాధ్యం కాలే దు. అయితే తాజా ఎన్నికల ఫలితాల్లో మాత్రం ఆమె మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజుపై గెలుపొందారు. 1952 నుంచి శ్రీకాకుళం జిల్లా రాజకీయ చరిత్రలో ఈమె 16వ మహిళా ఎమ్మెల్యే కా గా...సంఖ్యా పరంగా 23వ మహిళా ఎమ్మెల్యేగా రికార్డులోకి ఎక్కారు.

 1962లో తొలిసారి బ్రాహ్మణతర్ల నుంచి ఎమ్మెల్యేగా బెండి లక్ష్మీనారాయణమ్మ గెలుపొందగా, ఆ తర్వాత 1972లో నరసన్నపేట నుంచి బగ్గు సరోజినమ్మ, పాతపట్నం నుంచి చుక్క పగడాలమ్మ, ఉణుకూరు నుంచి పాలవలస రుక్మిణిలు గెలుపొందారు. ఆ తర్వాత ఎన్టీఆర్‌ టీడీపీ ఆవిర్భావం 1983లో ఎచ్చెర్ల ఎమ్మెల్యేగా కావలి ప్రతిభాభారతి గెలిచారు. 1983, 1988, 1989, 1994, 1999లలో కూడా ఆమె ఎచ్చెర్ల ఎమ్మెల్యేగానే గెలుపొందారు. రాష్ట్ర అసెంబ్లీకి తొలి మహిళా స్పీకర్‌ కూడా ఎన్నికయ్యారు. అలాగే 1985లో టెక్కలి నుంచి వరద సరోజ, 1989లో టెక్కలి నుంచి దువ్వాడ నాగావళి, అలాగే 1989, 1999లలో పాలకొండ నుంచి పీజే అమృతకుమారి, 1996లో ఎన్టీఆర్‌ సతీమణి నందమూరి లక్ష్మీపార్వతి పాతపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యేగానూ గెలుపొందారు.

అనంతరం 2004లో కొత్తూరు ఎమ్మెల్యేగా మినతి గొమాంగో, 2004, 2009లలో ఆమదాలవలస ఎమ్మెల్యేగా బొడ్డేపల్లి సత్యవతి, 2009లో టెక్కలి ఎమ్మెల్యేగా కొర్ల భారతి, 2014లో, 2019లోనూ పాలకొండ ఎమ్మెల్యేగా విశ్వాసరాయి కళావతి, 2014లో శ్రీకాకుళం ఎమ్మెల్యేగా గుండ లక్ష్మీదేవి, 2014లో పాతపట్నం ఎమ్మెల్యేగా రెడ్డి శాంతిలు ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. తాజాగా వెలువడిన ఎన్నికల ఫలితాల్లో జిల్లా నుంచి గెలుపొందిన ఏకై క మహిళా ఎమ్మెల్యేగా గౌతు శిరీష రికార్డులకెక్కారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement