శ్రీకాకుళం క్రైమ్ : సముద్రమార్గం గుండా ఉగ్రవాదులు భారతదేశంలో ప్రవేశించకుంటా అడ్డుకుంటామని, మాదకద్రవ్యాల అక్రమ రవాణా అరికడతామని, ఆ దిశగా తీర ప్రాంత ప్రజలను అవగాహనపర్చడమే లక్ష్యంగా సీఐఎస్‌ఎఫ్ (సెంట్రల్ ఇండస్ట్రీస్ సెక్యూరిటీ ఫోర్స్) సైకిల్ ర్యాలీని కోల్‌కతా నుంచి కన్యాకుమారి వరకు చేపడుతున్నట్లు విశాఖ పోర్టు ట్రస్టు కమాండెంట్ సతీష్‌కుమార్ బాజ్‌పాయ్ అన్నారు. 6553 కిలోమీటర్ల లక్ష్యంగా మొదలైన సీఐఎస్‌ఎఫ్ ర్యాలీ(50 మందితో) ఆదివారం శ్రీకాకుళం కొత్త రోడ్డు జంక్షన్ వద్దకు చేరుకుంది. అనంతరం స్థానిక గోపి డ్యాన్స్ అకాడమీ నుంచి ఆర్మీ థీమ్, దేశ భక్తి గీతాలు ప్రదర్శన రెండో పట్టణ సీఐ పి.ఈశ్వరరావు ఆధ్వర్యంలో జరిగాయి. ఈ సందర్భంగా కమాండెంట్ మాట్లాడుతూ ఇప్పటివరకు 1100 కిలోమీటర్లు ప్రయాణించారని మార్చి 31 కల్లా కన్యాకుమారి చేరుకుంటారని చెప్పారు. గతంలో సముద్రమార్గం గుండానే ఉగ్రవాదులు భారత్‌లో చొరబడి పార్లమెంటుపై దాడిచేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. సోమవారం ఉదయం 6.30 గంటలకు బయల్దేరి విశాఖపట్నం సాయంత్రం 5 గంటలకు చేరుతామన్నారు. కార్యక్రమంలో ఎన్టీపీసీ డిప్యూటీ కమాండెంట్ వినీత్‌కుమార్ ప్రభాకర్, విశాఖ స్టీల్‌ప్లాంట్ సీనియర్ కమాండెంట్ ఏఎం హనీఫ్, అసిస్టెంట్ కమాండెంట్లు జి.శ్రీనివాస్, శ్రీకర్ లోహియా, మాజీ సైనికులు కటకం పూర్ణచంద్రరావు, వీర నారీలు అమ్మన్నమ్మ, వంజరాపు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
హాజరైన అధికారులు
సముద్రమార్గ ఉగ్ర చర్యలను అరికడతాం