
రేపటి నుంచే ఇంటర్ తరగతులు
అడ్మిషన్లు పెంచడమే లక్ష్యం..
ప్రభుత్వ కళాశాలల్లో నిష్ణాతులైన అధ్యాపకులతో పాఠాలు బోధించడంతోపాటు అన్ని వసతులు, సౌకర్యాలతో విద్య అందుతోంది. పాఠ్యపుస్తకాలు, నోట్‌పుస్తకాలు, బ్యాగులతోపాటు మధ్యాహ్న భోజనం కూడా అమలవుతోంది. ఈ ఏడాది అడ్మిషన్లను భారీగా పెంచేందుకు ఇంటర్ విద్య ఉన్నతాధికారులు పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో చేరేందుకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆసక్తి చూపిస్తున్నారు. – శివ్వాల తవిటినాయుడు,
ఇంటర్మీడియెట్ విద్య జిల్లా అధికారి(డీఐఈవో),
శ్రీకాకుళం
● ఇంటర్మీడియెట్ విద్యలో కీలక పరిణామాలు
● ఏప్రిల్ ఒకటి నుంచి సర్కారీ జూనియర్ కళాశాలలు పునఃప్రారంభం
● 7 నుంచి అడ్మిషన్లు చేయాలని ఇప్పటికే నిర్ణయం
● ప్రైవేటు కళాశాలలకు పోటీగా అడ్మిషన్ల కోసం ఇంటర్ విద్య డైరెక్టర్ నిర్ణయాలు
● కొత్త ఏడాదిలో 235 రోజుల పాటు పనిచేయనున్న జూనియర్ కళాశాలలు
శ్రీకాకుళం న్యూకాలనీ:
ప్రభుత్వ యాజమాన్య జూనియర్ కళాశాలలు మంగళవారం నుంచి పునఃప్రారంభం కానున్నాయి. సెకెండియర్ విద్యార్థులకు తరగతులు మొదలు కానున్నాయి. వాస్తవానికి ఏటా జూన్ ఒకటి నుంచి తరగతులు ప్రారంభమవుతుండగా.. ఈ ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచే తరగతులను నిర్వహించాలని ఇంటర్ విద్య డైరెక్టర్ నిర్ణయించారు. అలాగే ప్రైవేటు కాలేజీలకు పోటీగా ఏప్రిల్ ఒకటి నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఫస్టియర్ ప్రవేశాలకు అడ్మిషన్లు మొదలుపెట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయమై జిల్లా అధికారులు, ప్రిన్సిపాళ్లకు వెబెక్స్ ద్వారా దిశానిర్దేశం చేశారు.
ఇప్పటికే అడ్మిషన్ డ్రైవ్స్ నిర్వహణ..
జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మొదటి సంవత్సరంలో ప్రవేశాల కోసం ఇప్పటికే అధికారుల ఆదేశానుసారం అడ్మిషన్ డ్రైవ్స్ (క్యాంపెయినింగ్‌లు) నిర్వహించారు. ఫిబ్రవరి మూడు, నాలుగు వారాల్లో కళాశాలలకు సమీప ప్రాంతాల్లో ఉన్న సర్కారీ పాఠశాలల్లో, గ్రామాల్లో ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు అడ్మిషన్ డ్రైవ్స్ నిర్వహించారు.
235 రోజులు పనిదినాలు..
2025–26 విద్యా సంత్సరానికి సంబంధించి ఇంటర్ కోర్సులను అందిస్తున్న జూనియర్ కళాశాలలు 235 రోజులు పనిచేయనున్నాయి. ఏప్రిల్ 1న కాలేజీలు మొదలుకానుండగా, వేసవి సెలవులను ఏప్రిల్ 24 నుంచి జూన్ ఒకటో తేదీగా ప్రకటించారు. మళ్లీ జూన్ 2వ తేదీన పూర్తిస్థాయిలో కాలేజీలు పునఃప్రారంభం కానున్నాయి. ఆఖరి పనిదినంగా 2026 మార్చి 18ను నిర్ణయించారు.

రేపటి నుంచే ఇంటర్ తరగతులు