
ఘనంగా కురిగాం పీహెచ్‌సీ వార్షికోత్సవం
కొత్తూరు : ప్రజాప్రతినిధులు, అధికారులు, వైద్య సిబ్బందితో పాటు పలువురి సహకారంతో కురిగాం పీహెచ్‌సీ పరిధిలో రోగులకు నాణ్యమైన వైద్యసేవలు అందుతున్నాయని పూర్వ వైద్యాధికారులు, జిల్లా ఆరోగ్యశ్రీ అధికారి పి.ప్రకాశరావు, హనుమంతు రమేష్, జంపు కృష్ణమోహన్, తిరుపతిరావు రెడ్డి, నరేష్‌కుమార్, సందీప్, దిలీప్, శ్రీలత చెప్పారు. కురిగాం పీహెచ్‌సీ ఏర్పాటై 20 ఏళ్లు పూర్తి కావడంతో వైద్యాధికారి పి.ప్రసన్నకుమార్ అధ్యక్షతన వార్షికోత్సవం సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రిలో వార్షికోత్సవం నిర్వహించడం రాష్ట్రంలో ఇదే మొదటిసారని చెప్పారు. భౌగోళికంగా ఒడిశాకు ఆనుకుని గ్రామీణ ప్రాంతంలో ఉన్న కురిగాం పీహెచ్‌సీలో వైద్యం అందించడం కష్టసాధ్యమైనప్పటికీ జాతీయ స్థాయి ప్రమాణాలకు అణుగుణంగా సేవలు అందుతున్నాయని, ఈ విషయంలో కురిగాం పీహెచ్‌సీ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచిందని తెలిపారు. వైస్ ఎంపీపీ తులసీ వరప్రసాదరావు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత రోగులకు నాణ్యమైన వైద్యం అందివ్వడం హర్షనీయమన్నారు. వైద్యాధికారులకు ఎల్లప్పుడూ మావంతు సహకారం ఉంటుందని చెప్పారు. అనంతరం పూర్వ వైద్యులను సత్కరించారు. కార్యక్రమంలో సర్పంచ్ సేపాన అశోక్‌కుమార్, ఈవో బుజ్జిబాబు, సూపర్‌వైజర్ తిరుపతిరావు, ఏఎన్‌ఎంలు, ఆశ వర్కర్లు, ఆస్పత్రి సిబ్బంది, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.