టెక్కలి: డివిజన్ కేంద్రమైన టెక్కలిలో గల హెడ్ పోస్టల్ కార్యాలయంలో ఆధార్ నమోదు కోసం వచ్చిన వినియోగదారులు శుక్రవారం గేటు బయట పడిగాపులు కాశారు. పశు సంవర్ధక శాఖ కార్యాలయం ప్రాంగణం నుంచి పోస్టల్ కార్యాలయానికి ఉన్న గేటు మార్గాన్ని పశు సంవర్ధక శాఖాధికారులు మూసివేశారు. దీంతో ఆధార్ నమోదుకు వచ్చిన వారితో పాటు పోస్టల్ సిబ్బంది గేటు బయట పడిగాపులు కాశారు. కొంత సమయం తర్వాత పశు సంవర్ధక శాఖ డీడీ జయరాజ్ కార్యాలయానికి చేరుకోవడంతో, పోస్టల్ సిబ్బందికి డీడీకి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం పోస్టల్ సిబ్బంది మాట్లాడుతూ.. గత కొన్ని దశాబ్దాలుగా ఇదే మార్గా న్ని వినియోగిస్తున్నామని, ఇప్పుడు ఆధార్ నమోదు కోసం వచ్చిన వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. దీనిని ఆర్డీఓ దృష్టికి తీసుకువెళ్లినట్లు గుర్తు చేశారు. అయితే తమ కార్యాలయం ప్రాంగణం నుంచి పోస్టల్ కార్యాలయానికి వెళ్లే వారంతా పరిసరాలను అపరిశుభ్రం చేస్తున్నారంటూ పశు సంవర్ధక శాఖాధికారులు చెప్పడం గమనార్హం.