
వారు చెప్పిందే ముహూర్తం
సమస్యలు సరిదిద్దుతాం
ముందుగా స్లాట్ బుక్ చేసుకుని ఆ సమయానికి ఇరు పార్టీలు హాజరైతే రిజిస్ట్రేషన్ ప్రక్రియ సులువుగా పూర్తిచేయడం జరుగుతోంది. స్లాట్ బుకింగ్ ఈ రోజే ప్రారంభం కావడంతో చిన్నచిన్న సమస్యలున్నా సరిదిద్దుతాం. ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు స్లాట్ బుక్ చేసుకున్న తరువాతే రిజిస్ట్రేషన్‌కు వస్తే మంచిది.
– నాగలక్ష్మి, రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్‌శాఖ డీఐజీ, శ్రీకాకుళం జిల్లా రిజిస్ట్రార్
● స్లాట్ బుక్ చేస్తేనే రిజిస్ట్రేషన్
● చలానా తీశాకే రూ.200తో స్లాట్
● స్లాట్ సమయంలో వెళ్లకుంటే డబ్బులు పోయినట్లే
● సాంకేతిక, సమస్యలతో తప్పని తిప్పలు
● ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): భూముల క్రయవిక్రయాలకు జనం నానా అవస్థలు పడాల్సి వస్తోంది. ఇప్పటికే ఫిబ్రవరి 1 నుంచి కూటమి ప్రభుత్వం భారీగా భూములు ధరలు పెంచి ప్రజల నెత్తిన భారం వేసింది. నిత్యావసరాల సంగతి సరేసరి. విద్యుత్ బిల్లుల భారం ఇప్పుడిప్పుడే అందరికీ తెలిసి వస్తోంది. ఏదో ఒక రూపేణా ప్రజల నెత్తిన భారం వేసి ప్రభుత్వ ఆదాయం పెంచుకుపోవడమే కూటమి లక్ష్యంగా కనిపిస్తోంది. ఇప్పుడు రిజిస్ట్రేషన్ శాఖలో కొత్తగా స్లాట్ బుకింగ్ సిస్టమ్ తెరపైకి తీసుకొచ్చి మరో రకంగా ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. సాధారణంగా మంచి ముహూర్తం చూసుకుని రిజిస్ట్రేషన్ చేసుకోవడం రివాజు. కానీ ఈ కొత్త పద్ధతితో వారు చెప్పిందే ముహూర్తంగా మారుతోంది.
స్లాట్ బుకింగ్‌తో తప్పని తిప్పలు
భూముల కొనుగోలు, అమ్మకాలు చేసుకునే వారు డాక్యుమెంట్ రైటర్ వద్దకు వెళ్లి సంబంధిత డాక్యుమెంట్ తయారు చేయించుకుని ఐజీఆర్‌ఎస్ సర్వీ స్‌లో వివరాలన్నీ నమోదు చేసుకుని సంబంధిత వ్యక్తులు సంతకాలు చేసి రిజిస్ట్రేషన్ ప్రక్రియ సులభంగా చేసుకునేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. ఇవన్నీ చేస్తూ ముందస్తుగానే చలానా తీస్తేనే స్లాట్ బుక్ చేయడం జరుగుతుంది. స్లాట్ సమయానికి ఒక వేళ ఏదైనా కారణం వల్ల రిజిస్ట్రేషన్‌కు హాజరు కాలేకపోయినా.. సాంకేతిక పరమైన సమస్యలు ఉండి రిజిస్ట్రేషన్ కాకపోయినా స్లాట్ డబ్బులు పోయినట్లే. ఆ రోజులో ఎన్నిసార్లు స్లాట్ బుక్ చేస్తే అన్ని రూ.200 చెల్లించాల్సిందే. ఓ మంచి ముహూ ర్తాన రిజిస్ట్రేషన్ ఎవరైనా చేయించాలనుకుంటే ఆన్‌లైన్‌లో స్లాట్ దొరికితేనే వారికి రిజిస్ట్రేషన్ లేకుంటే అంతే సంగతులు. స్లాట్ బుక్ చేసుకున్నాక కొనుగోలు చేసిన వారికో అమ్మిన వారికో అనారోగ్యం వచ్చినా, డబ్బులు ఎడ్జస్ట్‌మెంట్ కాకపోయినా, బ్యాంక్‌లో చలానా తీయడం ఆలస్యం కావడం లాంటి సంఘటనలు ఎదురైతే రిజిస్ట్రేషన్ జరగదు. స్లాట్ సమయానికి సబ్ రిజిస్ట్రార్‌లు, సంబంధిత సిబ్బంది అందుబాటులో లేకపోయినా డబ్బులు వృధాగా పోతాయి. స్లాట్‌లు సరిగా జరగకపోవడంతో రిజిస్ట్రేషన్‌శాఖ కార్యాలయంలో గంటల కొద్ది వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.

వారు చెప్పిందే ముహూర్తం