
2.50 లక్షల మంది విద్యార్థులు లక్ష్యం
పోలాకి: రానున్న విద్యాసంవత్సరంలో జిల్లాలో 2.50 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదివేలా లక్ష్యం నిర్దేశించుకున్నట్లు డీఈఓ తిరుమల చైతన్య తెలిపారు. బుధవారం పోలాకిలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ప్రస్తుతం 2.44 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ బడుల్లో చదువుతుండగా వారిలో 29 వేల మంది పదో తరగతి విద్యార్తులు రిలీవ్ కానున్నారని చెప్పారు. మరో 35 వేల మంది విద్యార్థులు కొత్తగా ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. ప్రతి తరగతికి ఉపాధ్యాయున్ని నియమించాలన్న ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పాఠశాలల క్రమబద్ధీకరణ జరుగుతోందని చెప్పారు. ఆ వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని డీఈవో తెలిపారు. దాదాపు ప్రతి పంచాయతీ పరిధిలో మోడల్‌స్కూల్ ఉండేలా కృషిచేస్తున్నామని చెప్పారు.
పశువుల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ
కంచిలి: ప్రకృతి వైపరీత్యాల నుంచి పశువుల్ని రక్షించుకోవాలని భువనేశ్వర్‌కు చెందిన ఇంటర్నేషనల్ లైవ్ స్టాక్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ శాస్త్రవేత్తలు డాక్టర్ అరుణ్‌కుమార్ పండా, డాక్టర్ బ్రీగేంద్ర అన్నారు. కంచిలి, కవిటి మండలాలకు చెందిన మహిళా పాడిరైతులతో సోంపేట మార్గంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో బుధవారం సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రకృతి వైపరీత్యాల వల్ల పశువుల పెంపకంలో కలిగే సమస్యలు, వాటి పరిష్కారాలు, పశువుల పెంపకంలో మహిళల పాత్రను వివరించారు. కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధకశాఖ సంయుక్త సంచాలకులు డాక్టర్ కె.రాజగోపాల్, సోంపేట సహాయ సంచాలకులు డాక్టర్ కె.అప్పలస్వామి, పశువైద్యాధికారులు డాక్టర్ టి.శిరీష, డాక్టర్ జి.కిరణ్‌కుమార్, డాక్టర్ సంజయ్‌కుమార్, కంచిలి ఏపీఎం అప్పలనర్సమ్మ, మహిళా పాడి రైతులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఎట్టకేలకు ఫ్లెక్సీల తొలగింపు
శ్రీకాకుళం పరిధిలోని పెదపాడులో వైఎస్సార్ విగ్రహం చుట్టూ టీడీపీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై ‘విగ్రహాన్ని కప్పేశారు’ శీర్షికన ఈ నెల 14న సాక్షిలో ఫొటో కథనం ప్రచురితమైంది. విషయం ఉన్నతాధికారుల దృష్టిలోకి వెళ్లడంతో మున్సిపల్ అధికారులు స్పందించారు. బుధవారం ఫ్లెక్సీలను పూర్తిగా తొలగించడంతో వైఎస్సార్ అభిమానులు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
– శ్రీకాకుళం రూరల్

2.50 లక్షల మంది విద్యార్థులు లక్ష్యం

2.50 లక్షల మంది విద్యార్థులు లక్ష్యం