సాక్షి, అమరావతి: లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ శ్రీకాకుళం డీఎంహెచ్‌వో డాక్టర్ టి.వెంకట బాల మురళీకృష్ణ, డిప్యూటీ పారామెడికల్ ఆఫీసర్ వి.సురేశ్‌కుమార్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. వైద్యశాఖ ఉద్యోగిని నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ వీరిద్దరూ ఈ నెల నాలుగో తేదీన ఏసీబీకి చిక్కారు. కోర్టు వీరికి ఈ నెల 17 నుంచి రిమాండ్ విధించింది. వీరిని సస్పెండ్ చేసినట్టు బుధవారం ఉత్తర్వులు ఇచ్చిన వైద్య శాఖ కార్యదర్శి డాక్టర్ మంజుల ఈ నెల నాలుగో తేదీ నుంచి సస్పెన్షన్ అమల్లోకి వస్తుందని వివరించారు.
బ్యాంకు పీఓగా రైతుకూలీ బిడ్డ
కంచిలి: మండలంలోని తలతంపర గ్రామానికి చెందిన రైతుకూలీ బిడ్డ నడుపూరి శివాజీ యూనియన్ బ్యాంకు పీఓ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. శివాజీ తండ్రి రామకృష్ణ రోజుకూలీగా జీవనం సాగిస్తున్నారు. తల్లి భాగ్యలక్ష్మి గృహిణి. శివాజీ నూజివీడు ట్రిపుల్ ఐటీలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. తర్వాత పోటీపరీక్షలకు సన్నద్ధమయ్యాడు. ఇటీవల విడుదలైన ఫలితాల్లో బ్యాంకు పీఓ ఉద్యోగానికి ఎంపికకావడంతో తల్లిదండ్రులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు
శ్రీకాకుళం(పీఎన్‌కాలనీ): శ్రీకాకుళం మున్సిప ల్ కార్పొరేషన్ పరిధిలో అక్రమ నిర్మాణాలు ఎక్కువగా ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని రీజనల్ డైరెక్టర్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ అధికారి పి.నాయుడు అన్నారు. శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఏసీపీ, ప్లానింగ్ సెక్రటరీలతో బుధవారం సమావేశం నిర్వహించారు. అక్రమ నిర్మాణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేకుంటే ప్లానింగ్ సెక్రటరీలపై చర్యలు తీసుకోవాల్సి వస్తుందన్నారు. తూతూమంత్రంగా నోటీసులిచ్చి చేతులు దులుపుకొంటే సరిపోదని, నిర్మాణదారులకు సవివరంగా తెలియజేసి జరిమానాలు విధించాలన్నారు. సెట్‌బ్యాక్‌లు, ఆక్రమణలు లేకుండా చూడాల్సిన బాధ్యత ప్లానింగ్ సెక్రటరీలదేనని స్పష్టం చేశారు. ఎల్‌ఆర్‌ఎస్ ద్వారా రూ 4.64 కోట్లు, బీపీఎస్ ద్వారా రూ.1.4 కోట్లు వసూలు చేశామని, ఆ మొత్తాన్ని కార్పోరేషన్ పరిధిలో రోడ్లు, మౌలిక వసతుల కల్పనకు వినియోగిస్తామని చెప్పారు. నగరంలో ఇరుకుగా ఉన్న రోడ్లు వెడల్పు చేసి ప్రమాదాల నివారణకు చర్యలు చేపడతామన్నారు. సర్క్యులేషన్ ప్యాట్రన్ అమల్లోకి వచ్చిందని, దీనిపై ప్రజల్లో విస్త్రృత ప్రచారం చేయాలన్నారు. పాలకొండ రోడ్డు, రామలక్ష్మణ కూడలి వెడల్పు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సమావేశంలో అసిస్టెంట్ సిటీ ప్లానర్లు వెంకటేశ్వరరావు, జానకి పాల్గొన్నారు.
ఆలివ్ రిడ్లే తాబేళ్ల సంరక్షణకు కృషి
ఎచ్చెర్ల క్యాంపస్: సముద్ర జలాల్లో కాలుష్య నియంత్రణలో ఆలివ్ రిడ్లే తాబేళ్ల పాత్ర కీలకమని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. బొంతలకోడూరు పంచాయతీ పాతదిబ్బలపాలెం సముద్ర తీరంలో బుధవారం ఆలివ్ రిడ్లే తాబేళ్ల పిల్లలను సముద్ర జలాల్లో విడిచిపెట్టారు. తీరంపై తాబేళ్లు పెట్టిన గుడ్లను 45 రోజుల పాటు సంరక్షణ కేంద్రంలో ఉంచి ప్రత్యేకంగా పొదిగేలా అటవీశాఖ అధికారులు చేపట్టారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జలాల్లో తాబేళ్ల సంఖ్య పెరగాలని చెప్పారు. ప్రస్తుతం వేట నిషేధం 61 రోజులు అమల్లో ఉందని, తాబేళ్లు సురక్షితంగా పెరుగుతాయని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అటవీశాఖాధికారి వెంకటేష్, రేంజర్ రాజశేఖర్, ట్రీ ఫౌండేషన్ జిల్లా కో–ఆర్డినేటర్ సోమేశ్వరరావు, సర్పంచ్ పంచిరెడ్డి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
ఏసీబీకి పట్టుబడ్డ డీఎంహెచ్‌వో సస్పెన్షన్
ఏసీబీకి పట్టుబడ్డ డీఎంహెచ్‌వో సస్పెన్షన్