కోనేటంపేటలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జన్మించిన నివాసం
సాక్షి, పళ్లిపట్టు ( తమిళనాడు): బాలు మరణ వార్తతో ఆయన స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తమ ముందు బుడిబుడి నడకలు వేసిన బాలుడు ఈ భూమిని వదిలి వెళ్లిపోయాడనే వాస్తవాన్ని తట్టుకోలేకపోతున్నారు. తమిళనాడు రాష్ట్రం పళ్లిపట్టు సమీపంలోని కోనేటంపేట గ్రామంలో 1946 జూన్ 4న తెలుగు బ్రాహ్మణ హరికథ కళాకారుడు శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి, శకుంతలమ్మ దంపతులకు ఆయన జన్మించారు. ఆరుగురు సంతానంలో ఎస్పీ సుబ్రహ్మణ్యం అగ్రజుడు. తన ప్రాథమిక విద్యను గ్రామానికి సమీపంలోని నగరిలో అభ్యసించారు.
తన కీర్తిప్రతిష్టలతో కోనేటంపేటకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన ఎస్పీ చివరగా 2017లో తన 71వ జన్మదిన వేడుకలను గ్రామస్తులతోనే జరుపుకున్నారు. స్వగ్రామమంటే ఎస్పీకి మహాప్రేమ. సమయం దొరికినప్పుడల్లా తను బాల్యంలో నివశించిన చిన్నపాటి ఇంటికి వచ్చి వెళ్లేవారు. ఆ సమయంలో పాత మిత్రులను పేరు పేరున పలకరించేవారు. తన సొంత ఖర్చుతో గ్రామంలో తాగునీటి వసతి కల్పించారు. కరోనా నుంచి కోలుకుని త్వరలో గ్రామానికి వస్తారని ఆశతో ఎదురుచూసిన గ్రామస్తులకు చివరి చూపు సైతం దూరం కావడంతో తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. (ఎస్పీ బాలు అంత్యక్రియలకు మంత్రి అనిల్ కుమార్)
Comments
Please login to add a commentAdd a comment