
రాజీవ్ యువ వికాసానికి దరఖాస్తు చేసుకోండి
భానుపురి (సూర్యాపేట): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకానికి జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ వర్గాలకు చెందిన నిరుద్యోగ యువత ఈ నెల 14లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. ఈ పథకం ద్వారా రూ.50 వేల నుంచి రూ.4లక్షల వరకు రుణం పొందవచ్చని పేర్కొన్నారు. రూ.50వేల లోపు యూనిట్లకు 100 శాతం, రూ.లక్ష లోపు యూనిట్లకు 90 శాతం, రూ.2లక్షల యూనిట్ల వరకు 80శాతం, రూ.4లక్షల యూనిట్లకు 70 శాతం సబ్సిడీ వర్తిస్తుందని తెలిపారు. వ్యవసాయేతర పథకాలకు సంబంధించిన యూనిట్ల స్థాపనకు 21–55 ఏళ్ల వయస్సు, వ్యవసాయ ఆధారిత పథకాలకు 21–60 ఏళ్ల వయస్సు కలిగి, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలలోపు ఆదాయం ఉన్నవారు అర్హులని తెలిపారు. ఆధార్, ఆహార భద్రతకార్డు లేదంటే ఆదాయ ధ్రువీకరణ పత్రం, కుల ధ్రువీకరణ పత్రం, డ్రైవింగ్ లైసెన్స్ (రవాణా పథకాలకు), పట్టాదారు పాస్‌పుస్తకం (వ్యవసాయ రంగ పథకాలకు), సదరం సర్టిఫికెట్ (వైకల్యమున్న వ్యక్తులు), పాస్‌పోర్ట్‌సైజ్ ఫొటో, బలహీన వర్గాల ధ్రువీకరణ పత్రం ఉండాలని పేర్కొన్నారు. దరఖాస్తు ఫారాలకు సంబంధి పత్రాలు జతచేసి ఎంపీడీఓ, మున్సిపల్ కార్యాలయాల్లో అందించాలని కోరారు.
గోదావరి
జలాల నిలిపివేత
అర్వపల్లి: ప్రస్తుత యాసంగి సీజన్‌కు గాను అదనంగా విడుదల చేస్తున్న గోదావరి జలాలను ఆదివారం నిలిపివేశారు. 7వ తడిగా ఈ నెల 2న గోదావరి జలాలను జిల్లాకు పునరుద్ధరించారు. అయితే ఐదు రోజులపాటు నీటిని వదిలారు. కాగా ఈ సీజన్‌కు సంబంధించి జనవరి 1న జిల్లాకు గోదావరి జలాలను విడుదల చేశారు. షెడ్యూల్ ప్రకారం వారబందీ విధానంలో మార్చి 24 వరకు 6 తడులుగా నీళ్లిచ్చారు. అయితే పంటలు చేతికొచ్చే సమయంలో నీళ్లు నిలిపివేశారు. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చేయడంతో అధికారులు మరో తడికి అదనంగా విడుదల చేశారు.

రాజీవ్ యువ వికాసానికి దరఖాస్తు చేసుకోండి