
నల్లగొండ బిడ్డకు ఉన్నత పదవి
నల్లగొండ : నల్లగొండ వాసికి మరో ఉన్నత పదవి లభించింది. హైకోర్ట్ జస్టిస్‌గా పలు ఉన్నతస్థాయి హోదాల్లో పనిచేసి పదవీ విరమణ పొందిన జస్టిస్ షమీమ్ అక్తర్‌ను తెలంగాణ మానవ హక్కుల కమిషన్ చైర్మన్‌గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జస్టిస్ షమీమ్ అక్తర్ ఇటీవల రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్‌గా ఏమాత్రం వివాదం లేకుండా ఎస్సీ వర్గీకరణపై నివేదిక ఇచ్చారు. నల్లగొండ పట్టణానికి చెందిన ఒక సామాన్య సాంప్రదాయ కుటుంబంలో జన్మించిన షమీమ్ పట్టణంలోనే పాఠశాల, ఇంటర్, డిగ్రీ పూర్తి చేశారు. నాగపూర్‌లో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసిన అనంతరం ఎల్‌ఎల్‌ఎం, ీపీహెచ్‌డీ చేశారు. నల్లగొండలో దాదాపు 16 సంవత్సరాల లాయర్‌గా ప్రాక్టీస్ చేసి సివిల్, క్రిమినల్, రెవెన్యూ కేసులను వాదించారు. 2002లో జిల్లా కోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. తెలంగాణలోని వివిధ న్యాయ స్థానాల్లో సేవలందించారు. న్యాయపరమైన తీర్పులు, సామర్థత, చట్టంపై లోతైన అవగాహన తదితర కారణాలతో జస్టిస్ షమీమ్ అక్తర్‌కు 2017లో హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి లభించింది.
బడుగు, బలహీన వర్గాల హక్కుల
పరిరక్షణలో
కీలక పాత్ర
బడుగు, బలహీన వర్గాలు ప్రధానంగా కార్మికులు, మహిళలు, పేదల హక్కుల పరిరక్షణలో జస్టిస్ షమీమ్ అక్తర్ కీలక పాత్ర వహించారు. ప్రత్యామ్నాయ వివాద పరిష్కారం (ఏడీఆర్) ద్వారానే సత్వర న్యాయం లభిస్తుందనే నమ్మకంతో అనేక కేసులను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించి కోర్టులపై కేసుల భారాన్ని తగ్గించారు. రాజ్యాంగం అంశాలపై విశేష పట్టు ఉన్న జస్టిస్ షమీమ్ అక్తర్ తీర్పులు పలు కేసుల తుది నిర్ణయాలకు మార్గదర్శకంగా మారాయి. 2022లో హైకోర్టు న్యాయమూర్తిగా రిటైర్ అయినప్పటికీ అనేక న్యాయ సంబంధిత, రాజ్యాంగ పరమైన అంశాలపై తన ప్రసంగాల ద్వారా యువ న్యాయవాదులు, సహచర న్యాయమూర్తులకు మార్గదర్శకంగా నిలిచారు. ఆయనను తాజాగా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఫ మానవ హక్కుల కమిషన్ చైర్మన్‌గా
జస్టిస్ షమీమ్ అక్తర్ నియామకం