పోలీసులతో వాగ్వాదం చేస్తున్న దళితులు
సూర్యాపేట: ఆత్మకూర్ మండల పరిధిలోని నెమ్మికల్ గ్రామంలో ఎన్నికలకు ముందు దళితబంధు లొల్లి మొదలైంది. అనర్హులకు ఇచ్చారంటూ ఏకంగా సర్పంచ్ ఇంటికే తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు. నెమ్మికల్ గ్రామానికి 24 దళితబంధు యూనిట్లు మంజూరయ్యాయని, వాటి ని మాదిగ సామాజిక వర్గానికి 12, మాల సామాజిక వర్గానికి 12 చొప్పున ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
అయితే ఈ యూనిట్ల పంపిణీ సక్రమంగా జరగలేదని దళితులు ఆరోపిస్తున్నారు. గ్రామంలో ఆర్థికంగా బలంగా ఉన్న దళితులకు, ప్రజాప్రతినిధులు, వారి బంధువులు, అంగన్‌వాడీ టీచర్, ఆశా కార్యకర్తలుగా పనిచేస్తున్న వారికే ఈ పథకం మంజూరు చేశారని, ఇదే విషయమై బుధవారం ఎస్సీ వర్గానికే చెందిన గ్రామసర్పంచ్ గంపల సతీష్‌ను కొందరు ప్రశ్నించారు. ఈ సమయంలో సర్పంచ్ కుటుంబ సభ్యులు దురుసుగా ప్రవర్తించడంతో ఆగ్రహంతో దళితులు ఆందోళన చేశారు.
దళిత బంధులో అక్రమాలు జరిగాయని గ్రామంలోని సూర్యాపేట – దంతాలపల్లి రహదారిపై రాస్తారోకో చేశారు. ఇటీవల బీఆర్‌ఎస్ నాయకులు పంపిణీ చేసిన గోడ గడియారాలను తీసుకొచ్చి పగులగొట్టారు. గృహలక్ష్మి పొందిన వారే తిరిగి దళితబంధు తీసుకుంటున్నారని, నిజమైన నిరుపేద దళితులు అన్యాయానికి గురవుతున్నారని ఆరోపించారు. ఉదయం 7గంటలకే రోడ్డు ఎక్కి 11గంటల వరకూ ఆందోళన విరమించకపోవడంతో రహదారికి ఇరువైపులా భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.
విషయం తెలుసుకున్న ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి ఆందోళన కారులకు నచ్చజెప్పినా వినిపించుకోకుండా వాగ్వాదానికి దిగడంతో పాటు అతని కాళ్లపై పడి తమకు న్యాయం చేయాలని కోరారు. అనంతరం అక్కడి నుంచి కలెక్టరేట్‌కు తరలివెళ్లారు. ఇదిలా ఉండగా అసలు మండలానికి దళితబంధు యూనిట్లు రాలేదని తెలుస్తోంది. కేవలం ఆ పార్టీకి చెందిన నాయకులు దళితబంధు మంజూరైందని చెప్పి దళితుల మెప్పుపొందేందుకు ప్రయత్నించారని, ఇది బెడిసి కొట్టినట్లు విమర్శలు వస్తున్నాయి.
ఇప్పటి వరకు మండలంలో దళితబంధు ఊసెత్తని వారు ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత మంజూరైందని చెప్పడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయమై తహసీల్దార్ కృష్ణయ్య, ఎంపీడీఓ మల్సూర్‌నాయక్‌ను వివరణ కోరగా తమకు దళితబంధు పథకంపై ప్రభుత్వ పరంగా ఎలాంటి ఆదేశాలు రాలేదని తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా రాస్తారోకో చేసి ప్రజారవాణాకు ఆటంకం కలిగించిన గంపల కరుణాకర్, గంపల లెనిన్, చంద్రు, పురం శివక్రిష్ణ, జానకిరాములు, గరిగంటి రాంబాబులతో పాటు మరికొంతమందిపై కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ వెంకటరెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment