అసెంబ్లీలో మాట్లాడుతున్న పళణి వేల్ త్యాగరాజన్
సాక్షి, చైన్నె: అన్నాడీఎంకే ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాల్లో ఏ ఒక్కదాన్నీ తాము రద్దు చేయలేదని ఆర్థికమంత్రి పిటీఆర్ పళణి వేల్ త్యాగరాజన్ స్పష్టం చేశారు. అనేక పథకాలను సరికొత్తగా మెరుగులు దిద్ది అమలు చేస్తున్నామని వివరించారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మంగళవారం పలువరు సభ్యుల ప్రశ్నలకు మంత్రులు కేఎన్‌నెహ్రూ, ఉదయ నిధి స్టాలిన్, పొన్ముడి, పెరియకరుప్పన్ సమాధానం ఇచ్చారు.
117 బస్టాండ్‌లను ఆధునీకరించనున్నట్లు మంత్రి నెహ్రూ తెలిపారు. దరఖాస్తు చేసుకున్న 15 రోజులలో మహిళా స్వయం సహాయక బృందాలకు రుణాలు అందుతాయని మంత్రి ఉదయనిధి ప్రకటించారు. రాష్ట్రంలోని 54 పాలిటికెన్నిక్ కళాశాలలను రూ. 2,753 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యుత్తమ శిక్షణ కేంద్రాలుగా మారుస్తామని మంత్రి పొన్ముడి తెలిపారు.
రూ. 26,352 కోట్లతో అనుబంధ పద్దు
ఈనెల 20వ తేదీన అసెంబ్లీలో 2023–24 సంవత్సరానికి గాను ఆర్థిక బడ్జెట్‌ను అసెంబ్లీలో మంత్రి పిటీఆర్ పళణి వేల్ త్యాగరాజన్ ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన చర్చలో భాగంగా గత ఏడాది చివరిలో అదనంగా ప్రభుత్వం పలు కొత్త పథకాలు, వివిధ పనులకు కేటాయించిన నిధుల వివరాలతో అనుబంధ పద్దు వివరాలను అసెంబ్లీలో మంగళవారం ఆయన దాఖలు చేశారు. రూ. 26,352 కోట్లు ఖర్చుకు సంబంధించిన వివరాలను అందులో పొందు పరిచారు. అలాగే అన్నాడీఎంకే సభ్యులు చేస్తూ వస్తున్న విమర్శలకు సమాధానం ఇస్తూ ప్రసంగించారు.
అన్నాడీఎంకే అధికారంలో ఉన్న పదేళ్లలో 507 వాగ్దానాలు ఇచ్చారని, ఇందులో 269 మాత్రమే అమలు చేశారని వివరించారు. అయితే, తాము అధికారంలోకి వచ్చిన రెండేళ్లల్లో 85 శాతం వాగ్దానాలు అమలు చేశామని పేర్కొన్నారు. ఇది తమకు అన్నాడీఎంకేకు మధ్య ఉన్న తేడా అని వ్యాఖ్యానించారు. అన్నాడీఎంకే ప్రవేశ పెట్టిన ఏ ఒక్క పథకాన్నీ తాము రద్దు చేయలేదని స్పష్టం చేశారు. ఆ పథకాలకు మరింత వన్నె తెచ్చే విధంగా మార్పులు చేర్పులతో, లబ్ధిదారులకు మరింత అవకాశం కల్పించే విధంగా అమలు చేస్తున్నామని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment