అఫిడవిట్‌లో సమర్పించిన సమాచారమే ఆయుధంగా.. అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ అధికారులు పెట్టిన సంతకాలే సాక్ష్యాలుగా.. విచ్చలవిడిగా చేసిన డబ్బు పంపకాల దృశ్యాలే ధ్రువీకరణలుగా.. ఓసామాన్యుడు ఏకంగా ఓ ఎంపీపైనే గెలిచాడు.. అయితే ఇదంతా ఎన్నికల్లో కాదు.. న్యాయపోరాటంలో.. నీతి.. న్యాయం.. అనే ధర్మ సూత్రాలను పక్కనబెట్టి అంగ, అర్ధబలంతో అడ్డదారిన అందలమెక్కిన ఓ ప్రజాప్రతినిధిని.. ఓ ఓమాన్యుడు.. అసామాన్య రీతిలో ఎదిరించి కోర్టు ద్వారా చివరికి అతడి పదవికే ఎసరు తెచ్చాడు.. చట్టం ఎవరి చుట్టమూ కాదని నిరూపించాడు.. స్ఫూర్తి కలిగించే ఓటరు ‘మిలానీ’ పోరాటాన్ని మీరూ చదవండి.
సాక్షి, చైన్నె: నియోజక వర్గంలోని ఓ ఓటరు అలుపెరగని పోరాటం.. ఏకంగా ఓ ఎంపీ సీటుకి ఎసరు తెచ్చింది. దీంతో అన్నాడీఎంకే ఎంపీ రవీంద్రనాథ్ చివరికి తన పదవిని కొల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. న్యాయ పోరాటంలో సదరు ఓటరు సమర్పించిన ఆధారాలన్నీ ఎంపీకి వ్యతిరేకంగా నిర్ధారణ అయ్యాయి. ఫలితంగా ఎంపీగా రవీంద్రనాథ్ ఎన్నిక చెల్లదు అని కోర్టు ప్రకటించింది. అయితే తీర్పును రిజర్వ్ చేస్తూ.. అప్పీల్‌కు 30 రోజుల పాటు అవకాశం కల్పించింది.
నేపథ్యం ఇదీ..
అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్, మాజీ సీఎం ఓ పన్నీరు సెల్వం వారసుడు రవీంద్రనాథ్ 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు క్రియా శీలక రాజకీయాల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆయన దృష్టి అంతా సొంత జిల్లా తేని మీదే పెట్టారు. ఎన్నికల్లో ఎంపీగా తేని నుంచే పోటీ చేశారు. ఈ కాలంలో రాష్ట్రంలో అన్నాడీఎంకే అధికారంలో ఉండటం, తన తండ్రి పన్నీరు సెల్వం డిప్యూటీ సీఎం, పార్టీ సమన్వయ కమిటీ కన్వీనర్ కావడంతో రవీంద్రనాథ్‌కు అవకాశాలు కలిసి వచ్చాయి. ప్రధాని నరేంద్ర మోదీ సైతం రవీంద్రనాథ్‌కు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేశారు.
ఎన్నికల సమయంలో ఈ నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు మొదలు అనేక అక్రమాలు జరిగినట్లు పెద్దఎత్తున ఆరోపణలు వచ్చాయి. రాష్ట్రంలో అన్నాడీఎంకే అధికారంలో ఉండడంతో స్థానిక ఎన్నికల అధికారి చూసి చూడనట్లు వ్యవహరించారన్న విమర్శలు వచ్చాయి. చివరికి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఈవీకేఎస్‌పై రవీంద్రనాథ్ గెలుపొందారు. సొంత జిల్లాలో కీలక నియోజకవర్గాన్ని పన్నీరు తన కుటుంబ ఖాతాలో వేసుకుంది. తనయుడిని కేంద్ర మంత్రిని చేయడానికి సైతం ప్రయత్నించి, చివరకు అన్నాడీఎంకే గ్రూప్ రాజకీయాల పుణ్యమా అవకాశాన్ని కోల్పోవాల్సి వచ్చింది.
కోర్టు సంచలన తీర్పు..
2019 లోక్ సభ ఎన్నికలలో తేనిలో జరిగిన వ్యవహారాలపై పిటిషనర్ సమర్పించిన ఆధారాలను మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి సుందర్ పరిగణనలోకి తీసుకున్నారు. ఈ ఆధారాలకు రవీంద్రనాథ్ వద్ద వివరణ కోరగా.. సమాధానం కరువైంది. ఇదే రవీంద్రనాథ్ పదవీ గండానికి కారణమైంది. దీంతో గురువారం న్యాయమూర్తి సుందర్ తుది తీర్పు వెలువరించారు. నామినేషన్ దాఖలు, పరిశీలనలో అధికార దుర్వినియోగం జరిగినట్టు ఆధారాలతో సహా నిర్ధారణ అయినట్లు ప్రకటించారు. రవీంద్రనాథ్ గెలుపు చెల్లదంటూ తీర్పు వెలువరించారు. దీంతో ఆయనపై అనర్హత వేటు పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే, అప్పీలుకు అవకాశం ఇవ్వాలని రవీంద్రనాథ్ తరపు న్యాయవాదులు విజ్ఞప్తి చేసుకోగా, న్యాయమూర్తి స్పందించారు.
రవీంద్రనాథ్ ఎన్నిక చెల్లదు అని ఇచ్చిన తీర్పును 30 రోజులు పెండింగ్‌లో పెడుతున్నట్టు, అంతలోపు అప్పీల్‌కు వెళ్లవచ్చని గడువు కేటాయించారు. దీంతో అప్పీలు ప్రయత్నాలపై న్యాయవాదులు దృష్టి పెట్టారు. అయితే, అప్పీలుకు వెళ్లినా రవీంద్రనాథ్‌కు అనుకూలంగా స్టే వచ్చేది అనుమానమే అని న్యాయ వర్గాలు భావిస్తున్నాయి. తాము చేయాల్సిన పనిని సాధారణ ఓటరు మిలాని న్యాయ పోరాటంతో ఎంపీ రవీంద్రనాథ్‌కు పదవీ గండం సృష్టించడాన్ని అభినందిస్తున్నానని ఓటమి పాలైన కాంగ్రెస్ అభ్యర్థి ఈవీకేఎస్ ఇలంగోవన్, అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం అభ్యర్థి, ప్రస్తుత డీఎంకే నేత తమిళ్ సెల్వన్ పేర్కొనడం గమనార్హం
వెనక్కి తగ్గని మిలానీ..
తేని నియోజకవర్గంలో రవీంథ్రనాథ్ గెలుపును వ్యతిరేకిస్తూ ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు ఎవరూ కోర్టు తలుపు తట్ట లేదు. అయితే, ఆ నియోజకవర్గం ఓటరు అయిన మిలానీ మాత్రం స్పందించారు. నామినేషన్ దాఖలు మొదలు, ఫలితాల లెక్కింపు వరకు జరిగిన అవినీతి అక్రమాలు, అధికార దుర్వినియోగం, నగదు బట్వాడా తదితర అన్ని ఆధారాలనూ సేకరించారు. ఆయన గెలుపు అక్రమం అంటూ 2020లో హైకోర్టును ఆశ్రయించారు. ఆ నియోజకవర్గ ఓటరుగా తనను పరిచయం చేసుకుంటూ పిటిషన్ వేశారు. నామినేషన్ దాఖలు, పరిశీలనలో జరిగిన అక్రమాలు, అధికార దుర్వినియోగం వంటి అంశాలకు ఆధారాలను కోర్టుముందు ఉంచారు. కరోనా కాలం పుణ్యమా రెండేళ్లు విచారణ ముందుకు సాగలేదు.
అయితే గత ఏడాది కాలంగా ఈ కేసు విచారణ శరవేగంగా జరుగుతూ వచ్చింది. అదే సమయంలో అన్నాడీఎంకేలో చీలికతో పన్నీరు సెల్వం కొత్త శిబిరం తో రాజకీయ పయానాన్ని మొదలెట్టడంతో రవీంద్రనాథ్‌కు వ్యతిరేకంగా పళణి స్వామి శిబిరం లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. ఆయన్ని తమ పార్టీ ఎంపీగా పరిగణించ వద్దు అంటూ విజ్ఞప్తి చేసింది. అదే సమయంలో గతంలో ఎప్పుడు సాగిన అక్రమాల వ్యవహారంలో ఈడీ రంగంలోకి దిగడం, రవీంద్రనాథ్ ఆస్తుల అటాచ్ వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ పరిస్థితులలో ఓటరు మిలానీ రూపంలో ఏకంగా రవీంద్రనాథ్ తన ఎంపీ పదవి కోల్పోయే పరిస్థితి నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment