సాక్షి, చైన్నె: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి హోదాలో ఢిల్లీ పర్యటనకు పళణి స్వామి సిద్ధమయ్యారు. ఈనెల 26వ తేదీన కేంద్ర హోం శాఖమంత్రి అమిత్ షాతో ఆయన భేటీ కానున్నారు. ఇదిలా ఉండగా పళణి స్వామిని కేంద్ర ఎన్నికల కమిషన్ అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా అంగీకరించడాన్ని వ్యతిరేకిస్తూ మాజీ సీఎం పన్నీరు సెల్వం అప్పీలు పిటిషన్ దాఖలు చేశారు. వివరాలు.. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా గత నెల పళని స్వామి ఏకగ్రీవంగా ఎంపికై న విషయం తెలిసిందే. ఆయన ఎన్నిక, ఆయన నేతృత్వంలో గత ఏడాది జరిగిన సర్వ సభ్య సమావేశానికి కేంద్ర ఎన్నికల కమిషన్ రెండు రోజుల క్రితం ఆమోద ముద్ర వేసింది.
దీంతో పార్టీ పై పట్టు సాధించడమే లక్ష్యంగా పళని వ్యూహాలకు పదును పెట్టారు. అలాగే కర్ణాటకలోని పులికేశినగర్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని నిలబెట్టి ఉనికి చాటాలని నిర్ణయించారు. అలాగే ఇక్కడ పన్నీరు సెల్వం తరపున అన్నాడీఎంకే అభ్యర్థులుగా పోటీలో ఉన్న వారిని తిరస్కరించాలని కోరుతూ కేంద్ర ఎన్నికల కమిషన్‌కుల లేఖ రాశారు. నిజమైన అన్నాడీఎంకేకు చెందిన అభ్యర్థి అన్భరసు పులికేశి నగర్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారనని, ఆయనకే రెండాకు గుర్తు సైతం కేటాయించాలని కోరారు.
పన్నీరుసెల్వం అభ్యర్థులతో అన్నాడీఎంకేకు సంబంధం లేదని స్పష్టం చేశారు. అదే సమయంలో కేంద్రం పెద్దల ఆశీస్సు అందుకునేందుకు సిద్ధమయ్యారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి హోదాలో బుధవారం తొలిసారిగా ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈనెల 26వ తేదీని ఢిల్లీ వెళ్లనున్న పళణి స్వామి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో తొలుత భేటీ కానున్నారు. అనంతరం పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో భేటీకి తగ్గ కార్యాచరణతో పళణి స్వామి ఉన్నారు.
పన్నీరు అప్పీలు
పళణి స్వామిని ప్రధాన కార్యదర్శిగా కేంద్ర ఎన్నికల కమిషన్ అంగీకరించడాన్ని వ్యతిరేకిస్తూ పన్నీరు సెల్వం అప్పీల్‌కు వెళ్లారు. శనివారం ఆయన తరపు ప్రతినిధులు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అన్నాడీఎంకే కు సంబంధించిన కేసులు హైకోర్టులో విచారణలో ఉన్నాయని, ఈ సమయంలో కేంద్ర ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని అందులో వివరించారు. ఈ పిటిషన్ సోమవారం విచారణకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఇదిలా ఉండగా పన్నీరు సెల్వం నేతృత్వంలో ఈనెల 24వ తేదీన తిరుచ్చి వేదికగా మహానాడు జరగనున్న విషయం తెలిసిందే. ఇందులో అన్నాడీఎంకే పేరు, పార్టీ జెండా, గుర్తును ఉపయోగించకుండా పన్నీరు మద్దతుదారులపై పళణి మద్దతు దారులు కొరడా ఝుళిపించే పనిలో పడ్డారు. తిరుచ్చితో పాటు పలు చోట్ల పన్నీరు మద్దతుదారులకు వ్యతిరేకంగా పళణి శిబిరం పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment