సాక్షి, చైన్నె: ఇద్దరు పోలీసు సహోదరులు, ఓ విద్యాశాఖ అధికారితో కూడిన కుటుంబం తమతో పనిచేస్తున్న వారిని ఆన్‌లైన్ వర్తకం పేరిట బురిడీ కొట్టించి రూ. 40 కోట్లు మోసానికి పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదుతో ఈ బ్రదర్స్ కుటుంబంలోని 8 మందిని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. వివరాలు.. కాంచీపురం జిల్లా ఏనాత్తూరు పుదునగర్‌కు చెందిన జోషఫ్, మరియా సెల్వి దంపతులకు ముగ్గురు కుమారులు.
ఇందులో సహాయ భారత్, ఆరోగ్య అరుణ్ పోలీసులు. ఒకరు మహాబలిపురం నేర విభాగంలో, మరొకరు కాంచీపురం ట్రాఫిక్ పోలీసు విభాగంలో పనిచేస్తున్నారు. మరొకరు విద్యాశాఖలో పనిచేస్తున్నారు. ఈ కుటుంబం అంతా ఆన్‌లైన్ వర్తకం, పెట్టుబడులు అంటూ పార్ట్ టైం జాబ్ వ్యవహారాన్ని సాగిస్తున్నాయి. ఆన్‌లైన్ వర్తకంలో పెట్టుబడులు పెట్టే వారికి రెట్టింపు ఆదాయం వస్తున్నదంటూ తమ సహచరులు, బంధువులు, ఇరుగు పొరుగు వారి చేత రూ.40 కోట్ల వరకు వసూలు చేశారు.
అయితే తాము చెల్లించిన మొత్తాలకు ఏ ఒక్క సమాచారం ఈ పోలీసు బ్రదర్స్ ఫ్యామిలీ నుంచి రాకపోవడంతో సహచర పోలీసులు, విద్యాశాఖలో పనిచేస్తున్న వారు నిలదీశారు. వారి సమాచారం లేకపోవడంతో పోలీసు ఉన్నతాధికారులను దర్యాప్తునకు ఆదేశించారు. విచారించిన కాంచీపురం పోలీసులు ఈ కుటుంబంలోని ఎనిమిది మందిని అరెస్టు చేశారు. ఇందులో తల్లిదండ్రులు, పోలీసు బ్రదర్స్, విద్యాశాఖ అధికారి, వారి సతీమణులు మహాలక్ష్మీ, జయశ్రీ, సమీయా ఉన్నారు.
ఆన్‌లైన్ వర్తకం బలిగొంది..
ఆన్‌లైన్ వర్తకంలో పెట్టుబడి పెట్టి నష్ట పోయిన ఓ ప్రైవేటు సంస్థ ఉద్యోగి మదురై ఉసిలం పట్టిలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఉసిలం పట్టకి చెందిన జగదీశ్(39) కోయంబత్తూరు లోని ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నాడు. ఆయనకు మణిమాల భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆన్‌లైన్ వర్తకంపై ఉత్సాహంతో ఉండే జగదీశ్ తన వద్ద ఉన్న నగదు, భార్య నగలే కాదు, సన్నిహితులు, మిత్రులు, బంధువుల వద్ద నగదు అప్పు చేసి మరీ పెట్టుబడి పెట్టాడు. ఆశించిన ఫలితం రాక పోగా నష్టం ఏర్పడడంతో ఆందోళనతో ఇంట్లో ఉన్న మాత్రలను మింగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబీకులు గుర్తించి ఆసుపత్రికి తరలించగా, శనివారం మరణించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment