సాక్షి, చైన్నె : చైన్నె నగర శివారులోని నషరత్ పేటలో బీజేపీ నేతను గురువారం రాత్రి ఓ ముఠా దారుణంగా హతమార్చింది. నాటు బాంబులతో దాడి చేసింది. ప్రాణభయంతో పరుగులు తీస్తున్న ఆ నాయకుడ్ని వెంటాడి, వేటాడి మరీ నరికి చంపింది. ఈ హత్య కేసులో తొమ్మిది మంది శుక్రవారం మధ్యాహ్నం ఎగ్మూర్ కోర్టులో లొంగిపోయారు.కాంచీపురం జిల్లా శ్రీపెరంబదూరు సమీపంలోని వలర్‌పురం పంచాయతీ అధ్యక్షుడిగా వీపీజీటీ శంకర్ (43) వ్యవహరిస్తున్నారు. ఈయన బీజేపీ ఎస్సీ, ఎస్టీ విభాగం రాష్ట్ర కోశాధికారి కూడా.
ఈయన రియల్ ఎస్టేట్ వ్యాపారం, కట్ట పంచాయతీలు, రాజకీయ కార్యక్రమాలతో బీజీగా ఉన్న శంకర్‌పై పలు కేసులు ఉన్నాయి. ఈ పరిస్థితులలో గురువారం రాత్రి చైన్నెలో పనిముగించుకుని ఇంటికి వెళ్తున్న శంకర్‌ను ఓ ముఠా రహస్యగా వెంబడించింది. పూందమల్లి సమీపంలోని నషరత్ పేట సిగ్నల్‌లో ఆగిఉన్న శంకర్ కారుపై నాటు బాంబు దాడి జరిగింది. ఓ బాంబు దాడిలో కారు ముందు భాగం దెబ్బతింది.
అద్దాలు పగిలాయి. మరోబాంబు దాడితో పాటుగా పెట్రో బాంబు కారుపై విసరడంతో ప్రాణ భయంతో శంకర్ బయటకు దిగి పరుగులు తీశారు. పది మందితో కూడిన ఆ ముఠా శంకర్‌ను వెంటాడి వేటాడి మరి కిరాతకంగా నరికి చంపేశారు. అక్కడ ఏమి జరుగుతోందో ఎవ్వరూ పసిగట్టలేని పరిస్థితి. నాటు బాంబుల మోతను సమీపంలో ఉన్న కల్యాణ మండపంలో జరుగుతున్న వేడుకలో బాణసంచాలు పేల్చుతున్నట్టుగా ఆ పరిసర వాసులు భావించారు.
రంగంలోకి ప్రత్యేక బృందాలు..
సమాచారం అందుకున్న ఆవడి పోలీసు కమిషనరేట్ ఉన్నతాధికారులు విచారణను వేగవంతం చేశారు. తొమ్మిది ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. శంకర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కీల్పాకం ఆస్పత్రికి తరలించారు. ఈ హత్యకు గల కారణాలపై విచారణను వేగవంతం చేశారు. ఇటీవల శంకర్ మిత్రుడైన కుమార్ ఏ విధంగా హత్యకు గురయ్యాడో అదే తరహాలో ఈ హత్య ఉండడంతో పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. శంకర్ కారుపై మొత్తం ఐదు బాంబులు విసిరి ఉండటంతో పథకం ప్రకారం ఈ హత్య జరిగినట్టు పోలీసులు నిర్ధారించారు.
తన స్నేహితుడు కుమార్ హత్యకు ప్రతీకారంగా కుండ్రత్తూరుకు చెందిన రౌడీ వైరంను మట్టుబెట్టేందుకు కొంత కాలంగా శంకర్ వ్యూహ రచనలో ఉన్నట్టు వెలుగు చూసింది. దీనిని పసిగట్టిన వైరం ముందుగానే మేల్కొని తన అనుచరులతో శంకర్‌ను హతమార్చి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. అలాగే, వలర్ పురం పంచాయతీ 13వ వార్డు కౌన్సిలర్‌గా ఉన్న ఓ వ్యక్తితో పరిశ్రమలలో కాంట్రాక్టుల వివాదం ఉన్నట్టు వెలుగు చూసింది. అంతే కాకుండా యూనియన్ పంచాయతీ మాజీ చైర్మన్ వెంకటేశ్ హత్యలో శంకర్ నిందితుడు కావడంతో ఈ హత్య ఆయన మద్దతుదారుల పనిగా పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.
పలు కోణాల్లో విచారణ జరుగుతున్న సమయంలో శుక్రవారం మధ్యాహ్నం తొమ్మిది మంది ఎగ్మూర్ కోర్టులో లొంగిపోయారు. వీరిని కస్టడికి తీసుకుని విచారించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ హత్య ఘటనను బీజేపీ వర్గాలు తీవ్రంగా పరిగణించాయి. తమ వారికి భద్రత కల్పించడంలో డీఎంకే ప్రభుత్వం విఫలమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment