గవర్నర్‌లను కించపరచొద్దు! | - | Sakshi
Sakshi News home page

గవర్నర్‌లను కించపరచొద్దు!

Published Sun, May 7 2023 7:20 AM | Last Updated on Sun, May 7 2023 7:25 AM

- - Sakshi

సాక్షి, చైన్నె: అధికార పక్షం సభ్యులు గవర్నర్‌లను కించపరచొద్దని పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తమిళి సై సౌందరరాజన్‌ హితవు పలికారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజ్‌భవన్‌ అవసరమని, అధికారంలోకి వచ్చినానంతరం అదే రాజ్‌భవన్‌ను విమర్శించడం తగదని వ్యాఖ్యానించారు. తిరుచ్చిలో శనివారం లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తమిళి సై సౌందరరాజన్‌ మీడియాతో మాట్లాడారు. పుదుచ్చేరి జిప్మర్‌ ఆసుపత్రి పూర్తిగా పేదల కోసమే ఏర్పాటు చేసినట్లు వివరించారు. అయితే ఇక్కడ సరిగ్గా వైద్యసేవలు అందడం లేదంటూ తమిళనాడు నుంచి వచ్చి కొందరు పోరాటాలు, ఆందోళనలు చేయడం శోచనీయమన్నారు.

అనవసర వ్యాఖ్యలు తగవు..
అసలు గవర్నర్‌ పదవే అవసరం లేదంటూ ప్రస్తుతం కొందరు ఇష్టారాజ్యంగా వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజ్‌ భవన్‌ గడప తొక్కకుండా ఉన్నారా? అని డీఎంకే పాలకులను పరోక్షంగా ప్రశ్నించారు. ఆన్‌లైన్‌ రమ్మీతో పాటు అనేక చట్టాలను రాజ్‌ భవన్‌ నిశితంగా పరిశీలించి ఆమోదించడం జరిగిందని మరో ప్రశ్నకు సమధానంగా చెప్పారు. ఒకటి రెండు బిల్లుల సమగ్ర పరిశీలన కోసం కొంత సమయం తీసుకుంటే.. పక్కన పెట్టేశారంటూ గవర్నర్‌లను విమర్శించడం దారుణమన్నారు. గవర్నర్‌లను గవర్నర్‌లుగానే చూడాలని హితవు పలికారు. గవర్నర్‌లకు దురుద్దేశాలను ఆపాదించడం తగదని, వారికీ వాక్‌ స్వాతంత్య్రం ఉందే విషయాన్ని గుర్తించాలన్నారు. తీవ్ర వాదాన్ని బీజేపీ అనుమతించదని, సినిమాలను సినిమాలుగా చూడాలని కేరళ స్టోరీ చిత్రంపై సంధించి ప్రశ్నకు బదులిచ్చారు.

భూతద్దంలో చూడడం తగదు
మరోవైపు రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి చేస్తున్న వ్యాఖ్యలపై మంత్రి ఎం. సుబ్రమణియన్‌ శనివారం మీడియాతో మాట్లాడారు. భూతద్దం పెట్టి మరీ ఏదేని ఒక చిన్న సమస్య ప్రభుత్వానికి వ్యతిరేకంగా దొరుకుతుందా..? అని ఈ గవర్నర్‌ వెతుకుతున్నట్లుందని ధ్వజమెత్తారు. చిదంబరంలో బాల్యవివాహం జరిగినట్టు, బాలిక వేలి ముద్రలను కూడామోదు చేసుకున్నట్లుగా ఆయన చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. జరగని ఘటనలను జరిగినట్లు గవర్నర్‌ స్థాయిలో ఉన్న వ్యక్తి చెప్పడం ఆయన విజ్ఞతనే వదిలేస్తున్నామని పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement