మనీలాండరింగ్ కేసులో అత్యంత నాటకీయ పరిణామాలు, ఉత్కంఠ భరిత వాతావరణం నడుమ రాష్ట్ర విద్యుత్, ఎకై ్సజ్ శాఖా మంత్రి సెంథిల్ బాలాజీని ఈడీ బుధవారం అరెస్టు చేసింది. అర్ధరాత్రి వరకు కొన్ని గంటల పాటు తనను నిర్బధించి విచారించడంతో ఆందోళనకు గురైన సెంథిల్ బాలాజీకి గుండెపోటు సైతం వచ్చింది. ఆయన్ను ఆస్పత్రికి తరలించగా, అత్యవసరంగా బైపాస్ సర్జరీ చేయాల్సిందేనని వైద్యులు నిర్ధారించారు. అయినా, ఈడీ తగ్గలేదు. ఆయన్ను తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
సాక్షి, చైన్నె: అన్నాడీఎంకే హయాంలో రవాణాశాఖలో ఉద్యోగాల పేరిట జరిగిన మోసం వ్యవహారం ప్రస్తుతం డీఎంకే ప్రభుత్వంలో విద్యుత్, ఎకై ్సజ్ శాఖ మంత్రిగా ఉన్న సెంథిల్ బాలాజీ మెడకు ఉచ్చుగా మారిన విషయం తెలిసిందే. గతంలో ఆయన రవాణా మంత్రిగా ఉన్న కాలంలో జరిగిన ఈ వ్యవహారంలో మనీలాండరింగ్ ఆరోపణలను ఈడీ అస్త్రంగా చేసుకుంది. దీంతో ప్రస్తుతం సుప్రీంకోర్టు ఆదేశాలతో సెంథిల్ బాలాజీని టార్గెట్ చేసింది.
మంగళవారం ఆయన నివాసం, సన్నిహితులు, సోదరుడి నివాసం కార్యాలయాలో ఈడీ సోదాలు పొద్దుపోయే వరకు జరిగాయి. కొన్ని గంటల పాటు ఈడీ వర్గాలు విచారణ పేరిట సెంథిల్ బాలాజీని ఉక్కిరి బిక్కిరి చేసినట్టు సమాచారం. అర్ధరాత్రి మూడు గంటల పాటు ఆయన్ను ప్రత్యేక గదిలో ఉంచి నిర్బంధించి మరీ విచారించినట్టు ప్రచారం. దీంతో ఆయన ఆందోళనకు గురై గుండెపోటు తెచ్చుకున్నట్టున్నారు. అదే సమయంలో ఆయన్ను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచేందుకు ఈడీ ప్రయత్నించినా, చివరకు సెంథిల్ బాలాజీ నొప్పితో పెడుతున్న కేకలతో సీఆర్‌పీఎఫ్, ఆర్‌పీఎఫ్ భద్రతా బలగాలు, ఈడీ వర్గాలు తమ వాహనంలో ఎక్కించుకుని ఓమందూరార్ ప్రభుత్వ మల్టీ సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించారు.
మూడు చోట్ల బ్లాక్‌లు..
పరీక్షించిన వైద్యులు సెంథిల్‌బాలాజీకి గుండెపోటుగా ధ్రువీకరించారు. ఆయన గుండెలోని నాళాలలో మూడు చోట్ల రక్తం బ్లాక్ అయినట్టు తేల్చారు. అత్యవసరంగా ఆయనకు బైపాస్ సర్జరీ చేయాల్సిందేనని సూచించారు. అయితే, ఆయన తమ ఆధీనంలో ఉండడంతో ఈడీ వర్గాలు వైద్యుల సూచనలపై అనుమానాలు వ్యక్తం చేశాయి.
చివరకు ఈఎస్‌ఐ వైద్యులు పరిశోధించి నిర్ధారించారు. అయినా, ఈడీ ఏ మాత్రం తగ్గలేదు. ఆయన్న అరెస్టు చేయడం లక్ష్యంగా దూకుడుగానే ముందుకు సాగింది. సెంథిల్ బాలాజీకి గుండెపోటు సమాచారంతో సీఎం స్టాలిన్, మంత్రులు ఓమందూరార్ ఆస్పత్రికి చేరుకున్నారు. వైద్యులతో మాట్లాడారు. ఆయన్ను కావేరి ఆస్పత్రికి తరలించేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. అయితే, ఈడీ అడ్డుపడడంతో కావేరి వైద్యులు ఓమందూరార్‌కు వచ్చి మరీ పరీక్షించి చికిత్స అందిస్తున్నారు.
ఉత్కంఠ నడుమ అరెస్ట్..
సెంథిల్ బాలాజీ అరెస్టుపై ఈడీ దూకుడును ఏమాత్రం తగ్గించలేదు. చైన్నె జిల్లా మొదటి మెజిస్ట్రేట్ న్యాయమూర్తి లిల్లీని ఆశ్రయించారు. ఆమె స్వయంగా ఆస్పత్రికి వచ్చి సెంథిల్ బాలాజీని విచారించారు. వెళ్తూ వెళ్తూ సెంథిల్ బాలాజీని ఈడీ అరెస్టు చేసినందుకు తన వద్ద ఆధారాలు సమర్పించినట్టు ఈనెల 28వ తేదీ వరకు రిమాండ్ విధిస్తున్నట్టు న్యాయమూర్తి ప్రకటించి వెళ్లారు. దీంతో సాయంత్రం ఆమె కోర్టులో ఈడీ తరఫు, డీఎంకే తరఫు న్యాయవాదులు వాదనలు వాడి వేడిగా జరిగాయి. ఒక మంత్రి పదవిలో ఉన్న వ్యక్తికి కనీసం సమన్లు కూడా ఇవ్వకుండా సోదాల పేరిట వచ్చి అరెస్టు చేయడమే కాకుండా, మానవత్వాన్ని మరిచి మరీ ఈడీ వ్యవహరిస్తున్నదని వాదనలు వినిపించారు.
అత్యవసరంగా బైపాస్ సర్జరీ చేయాల్సి ఉందని వైద్యులు పేర్కొంటున్నా, కస్టడీకి ఈడీ కోరడం వెనుక కక్ష సాధింపు ధోరణి ఉన్నట్టు అనుమానాలు కలుగుతున్నాయని డీఎంకే సీనియర్ న్యాయవాదులు వాదన వినిపించారు. అలాగే, అరెస్టును వ్యతిరేకిస్తున్నామని, రిమాండ్‌ను రద్దు చేయాలని కోరారు. లేదా బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఈడీ తరఫు న్యాయవాదులు తమ వాదనలో అరెస్టుకు సంబంధించిన సమాచారం, సెంథిల్‌బాలాజీ, ఆయన కుటుంబానికి తెలియజేశామని, ఆయన్ను కస్టడీకి అప్పగించాలని కోరారు. వాదనల అనంతరం న్యాయమూర్తి తర్వాత ఉత్తర్వులను రిజర్వుడ్‌లో ఉంచారు.
గురువారం న్యాయమూర్తి తీర్పు వెలువరించే అవకాశాలు ఉన్నాయి. ఈ మేరకు ఆయన్ను శస్త్ర చికిత్స నిమిత్తం కావేరి ఆస్పత్రికి తరలించే అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో తన భర్తను ఎందుకు అరెస్టు చేశారో, ఏ కేసులో అరెస్టు చేశారో, ఆయన్ను గుండె పోటు వచ్చేంతగా నిర్బంధించాల్సిన పరిస్థితి ఎమిటో అని ప్రశ్నిస్తూ సెంథిబాలాజీ సతీమణి మేఘల హైకోర్టులో అత్యవసర పిటిషన్ వేశారు.
ఈ పిటిషన్‌ను తొలుత ఓబెంచ్‌కు అప్పగించగా, అందులోని ఓ న్యాయమూర్తి తాను విచారణ నుంచి తప్పుకుంటున్నట్టు పేర్కొనడం చర్చకు దారి తీసింది. రిమాండ్‌కు కోర్టు ఆదేశాలు ఇచ్చిన దృష్ట్యా, ఓమందూరార్ ఆస్పత్రి పరిసరాలలో పోలీసులు, సీఆర్‌పీఎఫ్ బలగాలు నిఘా పెంచారు. ఈడీ పర్యవేక్షణలో సెంథిల్ బాలాజీకి చికిత్స అందిస్తున్నారు.
నిఘా కట్టుదిట్టం...
మంత్రి అరెస్టు సమాచారంతో ఆయన సొంత జిల్లా కరూర్‌లో, కొంగు మండలంలోని జిల్లాలో భద్రత పెంచారు. కోయంబత్తూరు జిల్లాకు డీఎంకే ఇన్‌చార్జ్‌గా సెంథిల్ బాలాజీ దూసుకెళ్తున్నారు. దీంతో అక్కడ ఆయనకు మద్దతు పెరిగింది. అలాగే, ఆయన సామాజిక వర్గం కూడా అధికంగా ఈ మండలంలో ఉండడంతో పోలీసులు ముందు జాగ్రత్తగా భద్రతను కట్టుదిట్టం చేశారు. అలాగే, ఓమందూరార్ ఆస్పత్రి పరిసరాలను నిఘా నీడలోకి తెచ్చారు. దీంతో ఆస్పత్రికి వచ్చే రోగులకు అవస్థలు తప్పలేదు.
గుండెపోటు వచ్చేంతగా ఒత్తిడి..
సెంథిల్‌బాలాజీకి గుండెపోటు వచ్చేంతగా ఈడీ ఒత్తిడి చేసినట్టుందని సీఎం స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మానవత్వాన్ని మరిచి మరీ తమ యజమానుల కోసం (కేంద్రం) ఈడీ వ్యవహరిస్తున్నట్టు స్పష్టం అవుతోందని ధ్వజమెత్తారు. మంత్రులు ఎం సుబ్రమణియన్, నెహ్రూ, ఉదయనిధి స్టాలిన్, గీతా జీవన్ సెంథిల్ బాలాజీని పరామర్శించినానంతరం కేంద్రం తీరుపై తీవ్రంగా విరుచుకు పడ్డారు. బీజేపీ హద్దులు దాటి వ్యవహరిస్తున్నదని 2024 ఎన్నికలలో ప్రజలు ఆ పార్టీకి గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు.
కోయంబత్తూరు , తిరుప్పూర్, ఈరోడ్ కొంగు మండలంలోని జిల్లాలో బీజేపికి వణుకు పుట్టించే విధంగా సెంథిల్‌బాలాజీ పనితీరు ఉండడంతో, ఆయన్ను అడ్డు తొలగించుకునేందుకే అరెస్టు అని మండిపడ్డారు. డీఎంకే మిత్ర పక్ష పార్టీలు సీపీఐ నేత రాజా, సీపీఎం నేత బాలకృష్ణన్ అరెస్టును ఖండించారు. అయితే, ఈ అరెస్టును అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై సమర్థించారు. ఈడీని వెనకేసుకొచ్చారు. తప్పు చేసిన వాళ్లు శిక్షించ బడాల్సిందేనని వ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment