సాక్షి, చైన్నె : క్యాష్ ఫర్ జాబ్స్ కేసులో తమిళనాడు విద్యుత్, ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీని ఎలాగైనా తమ కస్టడీకి తీసుకుని విచారించేందుకు ఈడీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. మద్రాసు హైకోర్టు ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ సోమవారం సుప్రీం కోర్టులో అప్పీలు పిటిషన్ దాఖలు చేశారు. దీనిని అత్యవసరంగా విచారించాలన్న ఈడీ విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది.
మనీ లాండరింగ్ కేసులో గత వారం మంత్రి సెంథిల్‌బాలాజీని ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయన గుండెపోటుతో ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. మంత్రికి బుధవారం బైపాస్ సర్జరీ చేయడానికి వైద్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. అదే సమయంలో సెంథిల్ బాలాజీని విచారించలేని పరిస్థితిలో ఈడీ తలలు పట్టుకుంటోంది. చైన్నె జిల్లా కోర్టు 8 రోజుల కస్టడీకి అవకాశం కల్పించినా ఇంతవరకు సెంథిల్ బాలాజీని ఈడీ సమీపించలేని పరిస్థితి. హైకోర్టు ఆదేశాలు, ఆంక్షల నడుమ సెంథిల్ బాలాజీ ప్రైవేటు ఆసుపత్రిలో ఉన్నారు.
ఆయన్ను విచారించాలంటే ఆసుపత్రి వైద్యుల సలహాలు, సూచనలు అవసరం. సెంథిల్ బాలాజీ ఐసీయూలో ఉండడంతో ఇంతవరకు వైద్యుల నుంచి ఈడీకి అనుమతి దక్కలేదు. దీంతో హైకోర్టు ఉత్తర్వులను రద్దు చేయించి, ఎలాగైనా సెంథిల్‌బాలాజీని తమ కస్టడీకి తీసుకుని విచారించాలన్న లక్ష్యంగా డెప్యూటీ డైరెక్టర్ నేతృత్వంలోని ఈడీ బృందం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.
సుప్రీం కోర్టులో అప్పీలు పిటిషన్
ప్రైవేటు ఆసుపత్రిలో ఉన్న సెంథిల్‌ను ప్రభుత్వ ఆసుపత్రిలోకి తీసుకొచ్చే దిశగా ఈడీ వర్గాలు వ్యూహ రచన చేయడం గమనార్హం. సెంథిల్ బాలాజీ సతీమణి విజ్ఞప్తి మేరకు ఆయన్ను ప్రైవేటు ఆసుపత్రిలో ఉంచి చికిత్స అందించేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ అనుమతిని రద్దు చేయించేందుకు ఈడీ ప్రయత్నాలు మొదలెట్టింది. ఇందులో భాగంగా అధికారులు సోమవారం సుప్రీం కోర్టులో అప్పీలు పిటిషన్ వేశారు. ఈ వ్యవహారం ఇప్పటికే హైకోర్టుతో పాటు, సుప్రీం కోర్టులో మరో బెంచ్‌లో విచారణలో ఉన్న నేపథ్యంలో అత్యవసరంగా తాము విచారించలేమని వేసవి సెలవుల ప్రత్యేక బెంచ్ పిటిషన్‌ను తిరస్కరించింది.
ఈ నెల 21వ తేదీన పిటిషన్‌ను విచారిస్తామని న్యాయమూర్తులు ప్రకటించారు. అదే రోజున సెంథిల్ బాలాజీకి శస్త్ర చికిత్స ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో ఆయన్న ఈడీ కస్టడీకి తీసుకునే అవకాశాలు దక్కేనా అన్నది వేచి చూడాల్సిందే. ఇదిలా ఉండగా, సెంథిల్‌ను తమ కస్టడీకి తీసుకునేందుకు ఈడీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో కావేరి ఆసుపత్రి పరిసర మార్గాలలో పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేయడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment