వధూవరులను ఆశీర్వదిస్తున్న సీఎం స్టాలిన్
సాక్షి, చైన్నె: మతపరంగా ప్రజల మధ్య చిచ్చు పెట్టి రానున్న ఎన్నికల్లో గెలవచ్చన్న ధీమాతో ఉన్న బీజేపీకి జాతీయ స్థాయిలో పతనం తప్పదని సీఎం స్టాలిన్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి 2024 ఎన్నికల్లో ప్రజలు పెద్ద గుణపాఠం చెప్పడం తథ్యమన్నారు. గురువారం డీఎంకే కార్యాలయం అన్నాఅరివాలయంలో పార్టీ నాయకుడు గుమ్మిడిపూండి వేణు ఇంటి శుభకార్య వేడుకలో సీఎం స్టాలిన్ పాల్గొని ప్రసంగించారు.
డీఎంకే అంటే ఓ కుటుంబం అన్న విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ గుర్తుంచుకుంటే మంచిదని హితవు పలికారు. మహానాడులైనా సరే, పార్టీ కార్యక్రమాలైనా సరే కుటుంబ సమేతంగా నాయకులు, కార్యకర్తలు తరలి వచ్చే ఒకే ఒక్క పార్టీ డీఎంకే అని గుర్తు చేశారు. డీఎంకేలో ఉన్న ప్రతి ఒక్కర్ని దివంగత నేత కలైంజ్ఞర్ కరుణానిధి తన కుటుంబంలోని వ్యక్తులుగానే భావిస్తారని పేర్కొన్నారు.
డీఎంకేకు ఓటు వేస్తే అది కరుణానిధి కుటుంబ ప్రయోజనానికే ఉపయోగకరం అని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. డీఎంకే అంటే కుటుంబం, డీఎంకే అంటే తమిళనాడు, తమిళనాడు ప్రయోజనాలే డీఎంకేకు ముఖ్యం అన్న విషయాన్ని ఆయన బాగానే గ్రహించినట్టున్నారని హితవు పలికారు.
ఓటమి తప్పదు..
గత 50 ఏళ్లుగా తమిళనాడు అనే కుటుంబం సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా డీఎంకే శ్రమిస్తున్న విషయాన్ని మోదీ గుర్తెరగాలని సూచించారు. ఆధునిక తమిళనాడు రూపకర్త దివంగత నేత కరుణానిధి అని, ఆయన అడుగుజాడల్లో ద్రావిడ మోడల్ పాలన తమిళనాట సాగుతోందన్నారు. కలైంజ్ఞర్ శత జయంతి ఉత్సవాల వేళ గత రికార్డుల గురించి చెబుతూ పోతే సమయం చాలదని పేర్కొన్నారు.
మీసా చట్టంలో తాను అరెస్టయిన సమయంలో జైల్లో ముందుగా తనను కాకుండా ఇతర నాయకులు, కార్యకర్తలను దివంగత నేత పరామర్శించారని గుర్తు చేశారు. ఆయనకు కుమారుడి కంటే డీఎంకే కుటుంబం ముఖ్యం అని గుర్తు చేస్తూ, ఇవన్నీ మోదీకి ఎలా అర్థమయ్యేలా చెప్పాలో అని వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీలో భయం పెరిగిందన్నారు.
ప్రతిపక్షాలన్నీ ఏకం కావడంతో ఓటమి తప్పదన్న ఆందోళనలో ఆయన ఉన్నారని పేర్కొన్నారు. అందుకే ప్రజల మధ్య మత చిచ్చులు పెట్టి, ఆ నీడలో 2024 ఎన్నికల్లో గెలవాలన్న వ్యూహ రచనలో ఉన్నారని ఆరోపించారు. ఆయన పాచికలు ఇక పారబోవని, ప్రజలు మోదీ గురించి సమగ్రంగా అధ్యయనం చేసి ఓడించడం లక్ష్యంగా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.
మణిపూర్ ఘటనలను గుర్తు చేస్తూ, ఈ వ్యవహారంలో మోదీ అనుసరిస్తున్న తీరుపై ధ్వజమెత్తారు. అల్లర్లు బయలుదేరిన నెలన్నర రోజుల తర్వాత హోంమంత్రి అమిత్‌షా ద్వారా అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించడం శోచనీయమని విమర్శించారు. ఈసారి ఎన్ని కుట్రలు చేసినా మోదీకి ఓటమి తప్పదని, ప్రజలు ఆయనకు రానున్న ఎన్నికల్లో గుణపాఠం చెప్పడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment