తమిళనాడు: విధుల నుంచి తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ మాజీ మహిళా ఇన్‌స్పెక్టర్ దాఖలు చేసిన పిటిషన్‌ను మద్రాసు హైకోర్టు మదురై బెంచ్ తిరస్కరించింది. శివగంగై జిల్లా ఇలియాన్ కుడిలో బ్యాగ్ తయారు చేసే కంపెనీ నిర్వహిస్తున్న హర్షిత్ వద్ద గత సంవత్సరం రూ.10 లక్షలు నగదును అపహరించినట్లు మదురై నాగమలై ఇన్‌స్పెక్టర్ వసంతి సహా జిల్లా క్రైమ్ పోలీసులకు ఫిర్యాదులు వచ్చాయి. పోలీసులు కేసు నమోదు చేసి ఇన్‌స్పెక్టర్ వసంతిని అరెస్టు చేశారు. బెయిల్‌పై బయటకు వచ్చిన వసంతి సాక్షులను బెదిరించినట్టు ఆరోపణలు వచ్చాయి.
దీనిపై చర్యలు తీసుకోవాలని అధికారులను హైకోర్టు మదురై బెంచ్ ఆదేశించింది. దీంతో గత మార్చి 31వ తేదీ ఇంటిలో నుంచి కారులో బయటకు వెళ్లడానికి వచ్చిన వసంతిని ప్రత్యేక బృందం పోలీసులు అరెస్టు చేశారు. తర్వాత వసంతిని విధుల నుంచి తొలగించారు. దీన్ని వ్యతిరేకిస్తూ వసంతి హైకోర్టు మదురై బెంచ్‌లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను న్యాయమూర్తి జి.ఆర్ స్వామినాథన్ విచారించారు.
ఆ సమయంలో ఎస్పీ శివప్రసాద్ హాజరై వివరణ ఇచ్చారు. పిటిషన్ దారుడిపై ఉన్న కేసులు నిలువలో ఉన్నాయని, ప్రస్తుతం విచారణ జరుగుతున్న క్రమంలో డిపార్ట్‌మెంట్ పరంగా చర్యలు తీసుకున్నందున విధుల నుంచి తొలగించడంపై కోర్టు జోక్యం చేసుకోవలసిన అవసరం లేదని ఆ పిటిషన్‌ను కొట్టి వేస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment