Inspector General Of Police
-
మాజీ మహిళా ఇన్స్పెక్టర్ వసంతి పిటిషన్ తిరస్కరణ
తమిళనాడు: విధుల నుంచి తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ మాజీ మహిళా ఇన్స్పెక్టర్ దాఖలు చేసిన పిటిషన్‌ను మద్రాసు హైకోర్టు మదురై బెంచ్ తిరస్కరించింది. శివగంగై జిల్లా ఇలియాన్ కుడిలో బ్యాగ్ తయారు చేసే కంపెనీ నిర్వహిస్తున్న హర్షిత్ వద్ద గత సంవత్సరం రూ.10 లక్షలు నగదును అపహరించినట్లు మదురై నాగమలై ఇన్స్పెక్టర్ వసంతి సహా జిల్లా క్రైమ్ పోలీసులకు ఫిర్యాదులు వచ్చాయి. పోలీసులు కేసు నమోదు చేసి ఇన్స్పెక్టర్ వసంతిని అరెస్టు చేశారు. బెయిల్‌పై బయటకు వచ్చిన వసంతి సాక్షులను బెదిరించినట్టు ఆరోపణలు వచ్చాయి. దీనిపై చర్యలు తీసుకోవాలని అధికారులను హైకోర్టు మదురై బెంచ్ ఆదేశించింది. దీంతో గత మార్చి 31వ తేదీ ఇంటిలో నుంచి కారులో బయటకు వెళ్లడానికి వచ్చిన వసంతిని ప్రత్యేక బృందం పోలీసులు అరెస్టు చేశారు. తర్వాత వసంతిని విధుల నుంచి తొలగించారు. దీన్ని వ్యతిరేకిస్తూ వసంతి హైకోర్టు మదురై బెంచ్‌లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను న్యాయమూర్తి జి.ఆర్ స్వామినాథన్ విచారించారు. ఆ సమయంలో ఎస్పీ శివప్రసాద్ హాజరై వివరణ ఇచ్చారు. పిటిషన్ దారుడిపై ఉన్న కేసులు నిలువలో ఉన్నాయని, ప్రస్తుతం విచారణ జరుగుతున్న క్రమంలో డిపార్ట్మెంట్ పరంగా చర్యలు తీసుకున్నందున విధుల నుంచి తొలగించడంపై కోర్టు జోక్యం చేసుకోవలసిన అవసరం లేదని ఆ పిటిషన్‌ను కొట్టి వేస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. -
ఫస్ట్ ఉమన్.. డేరింగ్ అండ్ కేరింగ్ ఆఫీసర్
అస్సాం తొలి మహిళా ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలిస్ (ఐజీ) గా వయొలెట్ బారువాకు ప్రభుత్వం పదోన్నతి కల్పించిన తరువాత ఆమె ట్విట్టర్ పేజీలో అభినందనలు వెల్లువెత్తాయి. వాటిలో కొన్ని... ‘ఈ పదవికి మీకంటే అర్హులైన వారు లేరు’ ‘మీ విజయం ఎంతోమంది మహిళలకు స్ఫూర్తి ఇస్తుంది’ ‘అవినీతిపరుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించారు’ ‘ఐపీయస్ చేయాలనేది నా కోరిక. మీ ఆశీర్వాదం, సలహాలు కావాలి. మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను’ అస్సాంలో వరదలు ఎంత సహజమో, అల్లర్లు అంతే సహజం. వరదలకైనా టైమ్ ఉంటుందేమోగానీ, అల్లర్లు మాత్రం... అన్ని కాలాల్లోనూ ఉంటాయి. అలాంటి చోట పోలిసు ఉద్యోగం చేయడం అనేది కత్తులవంతెన మీద ప్రయాణం చేయడమంత కష్టం. అయితే డియస్పీ, ఎస్పీ, డిఐజీగా రకరకాల హోదాల్లో పనిచేసిన బారువా మాత్రం తాను రిస్క్ జాబ్ చేస్తున్నానని ఎప్పుడూ అనుకోలేదు. ఒకవేళ అలా అనుకోని ఆగిపోయి ఉంటే చారిత్రక గుర్తింపుకు నోచుకొని ఉండేవారు కాదమో! వయొలెట్ బారువా....‘బ్యూటిఫుల్ నేమ్’ అంటారు ఆమె సన్నిహితులు. వర్ణశాస్త్రం ప్రకారం వయొలెట్ కలర్‌ను జ్ఞానానికి, సున్నితత్వానికి ప్రతీకగా చెబుతారు. ‘సాహసం’ అనే మరో ప్రతీకను కూడా చేర్చారు బారువా. గౌహతి యూనివర్శిటీ నుంచి బాచ్లర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ తీసుకున్నారు బారువా. యూనివర్శిటీ రోజుల్లో కూడా చదువు ఎంత ముఖ్యమో, సమాజం కూడా అంతే ముఖ్యం అనుకునేవారు. తాను వెళ్లే దారిలో ఎక్కడైనా గొడవ జరిగితే సర్దిచెప్పడం, ఆకతాయిల పని పట్టడం జరిగేది. గౌలపర, మోరిగన్, కచర్,బర్పెట జిల్లాల్లో ఎస్పీగా విధులు నిర్వహించడమంటే మాటలు కాదు. కేవలం తూటాలు, లాఠీలను నమ్ముకుంటే మాత్రమే సరిపోదు. తెలివి ఉపయోగించాలి. అల్లర్లకు అడ్రస్ అయిన ఆ నాలుగు జిల్లాల్లో శాంతిభద్రతలను పరిరక్షించడంలో బారువా విజయం సాధించారు. సీబిఐ విభాగంలోనూ తన సత్తా చాటారు. నేరపరిశోధనలో, నేరాలను అదుపులో పెట్టడంలో తనదైన ముద్ర వేసిన బారువా ఇలా అంటున్నారు... ‘నా కెరీర్లో ఏ పోస్టింగ్, టాస్క్‌కు ఇబ్బంది పడలేదు. నో చెప్పలేదు. గౌహతి పోలిస్ హెడ్‌క్వార్టర్స్‌లో పనిచేయడం కంటే మారుమూల ప్రాంతాలలో పనిచేయడానికే ఆసక్తి చూపాను’ బారువా ఏ ప్రాంతంలో పనిచేసినా ‘పోలిస్ ఆఫీసర్’తో పాటు ‘కేరింగ్ ఆఫీసర్’ అని అభిమానంగా పిలుచుకుంటారు ప్రజలు. అస్సాం పోలిస్‌శాఖలో మహిళల సంఖ్య చాలా తక్కువ. అయితే అస్సాం తొలి మహిళా డీఎస్పీ, తొలి మహిళా డీఐజీ, తొలి ఐజీ అయిన బారువా స్ఫూర్తితో ఎంతోమంది మహిళలు పోలిస్‌శాఖలో పనిచేయడానికి ఉత్సాహం చూపుతున్నారు. బారువా సాధించించిన మరో మహత్తరమైన విజయమిది! -
అతనితో సన్నిహిత సంబంధాలు.. ఐజీపై సస్పెన్షన్ వేటు
తిరువనంతపురం: నకిలీ పురాతన కళాఖండాలను విక్రయించిన కేసులో నిందితుడిగా ఉన్న యూట్యూబర్ మోన్సన్ మవున్‌కల్‌తో సన్నిహిత సంబంధాలున్న ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జి లక్ష్మణ్‌ను కేరళ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. మోసపూరిత కార్యకలాపాలలో మోన్సన్‌కు సహాయం చేయడానికి తన పదవిని ఉపయోగించారనే ఆరోపణలపై హోం శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. పురాతన వస్తువుల వ్యాపారిగా మాయమాటలు చెప్పి ప్రజల నుండి కోట్లాది రూపాయలను మోసం చేసినందుకు మోన్సన్ సెప్టెంబర్‌లో అరెస్ట్ అయ్యాడు. ఆ సమయంలోనే మోన్సన్ మవున్‌కల్‌కి కేరళ మాజీ పోలీసు చీఫ్ డీజీపీ లోక్‌నాథ్ బెహెరా, ప్రస్తుత రాష్ట్ర పోలీస్ చీఫ్ డీజీపీ అనిల్‌కాంత్‌తో సహా రాష్ట్రంలోని అనేక మంది పోలీస్ ఉన్నతాధికారులతో సంబంధం ఉన్నట్లు కొన్ని చిత్రాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే లక్ష్మణ్‌పై చర్యలకు పోలీసు ప్రధాన కార్యాలయం సిఫారసు చేసింది. 1997 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారిపై శాఖాపరమైన చర్యలకు మార్గం సుగమం చేస్తూ ఐజీపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి పినరయి విజయన్ మంగళవారం రాత్రి ఆమోదం తెలిపారు. చదవండి: (పోలీస్ కస్టడీలో యువకుడు మృతి.. హత్యా? ఆత్మహత్యా?) -
మాజీ ఐజీ కేఎస్ఎన్ మూర్తి కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, మాజీ ఐజీ కేఎస్ఎన్ మూర్తి కన్ను మూశారు. గత కొన్ని రోజులుగా ఆయన కోవిడ్‌తో బాధపడుతున్నారు. ఆదివా రం ఉదయం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ఆయన పార్థివదేహానికి అంత్యక్రియలు జరిగాయి. డీఎస్పీగా పోలీసుశాఖలో చేరిన మూర్తి హైదరాబాద్ పోలీసు విభాగంపై తనదైన ముద్ర వేశారు. ఐపీఎస్ హోదా పొందిన తర్వాత ఆయన నగర పోలీసు విభాగంలో వివిధ హోదాల్లో పని చేశారు. హైదరాబాద్‌లో 1991–92లో జరిగిన మత ఘర్షణలను అణచివేయడంతోపాటు రౌడీషీటర్లకు తనదైన శైలిలో చెక్ చెప్పారు. మూర్తి పనితీరును చూసిన ఉన్నతాధికారులు, సిబ్బంది ఆయనకు గబ్బర్‌సింగ్ అని పేరు పెట్టారు. సిటీ కమిషనరేట్ పరిధిలో సిట్ల ఏర్పాటుకు ఆయన కృషి చేశారు. చదవండి: కర్ణాటకను వణికిస్తున్న బ్లాక్ ఫంగస్ -
ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఇక తాట తీసుడే
పాట్నా: భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు రాజ్యాంగంలో కల్పించారు. అయితే ఈ హక్కు ఉందని చెప్పి కొందరు ఇష్టారీతిన ప్రభుత్వాన్ని, ప్రజాప్రతినిధులను తీవ్రరూపంలో విమర్శించడం వివాదమవుతోంది. ఈ రకమైన విమర్శలు సామాజిక మాధ్యమాల వేదికగా తీవ్రంగా ఉంది. ఇది పలుసార్లు తీవ్ర వివాదాలకు దారి తీసే పరిస్థితి ఏర్పడింది. గతంలో ఇలాంటి ఘటనలు ఎన్నో చోటుచేసుకున్నాయి. ఇకపై ఇలాంటివి బిహార్‌లో చెల్లవు. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి విమర్శలపై ఉక్కుపాదం మోపనుంది. ఈ సందర్భంగా అన్ని విభాగాలకు నోటీసులు పంపించారు. ఇన్నాళ్లు వస్తున్న విమర్శలను సహించం. ఇకపై సహించబోమని ఐజీ నయ్యర్ హస్ నయిన్ ఖాన్ తెలిపారు. ప్రభుత్వం, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలపై వివాదాస్పద విమర్శలు.. అసభ్య మాటలు వస్తే చట్టం ప్రకారం నేరమని ఆయా విభాగ శాఖ అధికారులకు ఐజీ గుర్తుచేశారు. వారిపై చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉందని తెలిపారు. సంస్థలయినా.. వ్యక్తులైనా వారిపై కఠిన చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేశారు. వారిపై న్యాయపరమైన విచారణ చేసి శిక్ష విధించవచ్చని వివరించారు. ఈ మేరకు ఈనెల 21వ తేదీన ఐజీ ఆయా విభాగాల కార్యదర్శులకు లేఖ రాశారు. విమర్శించే వారిపై ఉక్కుపాదం మోపుతామని బిహార్ ప్రభుత్వం హెచ్చరించింది. ఇకపై సోషల్ మీడియాలోనైనా.. ఇక ఎక్కడైనా ఆచుతూచి మాట్లాడాలని పరోక్షంగా హితవు పలికింది. అయితే ఈ ఉత్తర్వులను ప్రతిపక్షాలు తప్పుపట్టాయి. విమర్శలకు బదులివ్వకుండా ప్రశ్నించే గొంతులను నొక్కేస్తున్నారని ఆర్జేడీ, జనతా దళ్ తెలిపాయి. నిర్వేదంతో ఈ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నాయి. -
ఐజీని కబళించిన కరోనా మహమ్మారి
లక్నో: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి భారత్‌లో రోజురోజుకూ విజృంభిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 1,14,031 మందిని పొట్టనబెట్టుకుంది. బిహార్‌లోనూ పంజా విసురుతోంది. తాజాగా రాష్ట్రానికి చెందిన పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్ కరోనాతో కన్నుమూశారు. పుర్నియాలో ఐజీగా విధులు నిర్వర్తిస్తున్న ఐపీఎస్ బినోద్ కుమార్ మూడు రోజులుగా కరోనాతో పోరాడి ఆదివారం ఉదయం ప్రాణాలు విడిచారు. ఇదిలాఉండగా.. జనతాదళ్ (JDU) సీనియర్ నాయకుడు, బిహార్ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కపిల్ డియో కామత్ (69), బీజేపీ నేత, బిహార్ మంత్రి వినోద్ కుమార్ సింగ్ (50) కూడా కోవిడ్ బారినపడి ఇటీవల మరణించారు. ఇక రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,91,619 చేరగా.. వైరస్ బారినపడి 990 మంది మరణించారు. -
మాస్కు లేదని ఐజీకే జరిమానా.. అయితే,
లక్నో: మాస్కు ధరించని కాన్పూర్ ఇన్స్పెక్టర్ జనరల్ మోహిత్ అగర్వాల్‌కు చలాన్ తప్పలేదు. అయితే, ఆయనకెవరూ ఫైన్ వేయలేదు. నైతిక విలువలకు కట్టుబడే తనే స్వయంగా చలాన వేయించుకున్నారు. వివరాలు.. తనిఖీలకు వెళ్తున్న క్రమంలో ఐజీ అగర్వాల్ తన కార్యాలయం నుంచి కారిడార్‌లోని వాహనం వరకు మాస్కు లేకుండా వచ్చారు. వెంటనే తన తప్పును తెలుసుకుని వాహనంలో ఉన్న మాస్కు పెట్టుకున్నారు. అయినప్పటికీ విధుల్లో ఉన్న సిబ్బందితో చర్చించి... నిబంధనల ప్రకారం తనకు జరిమానా విధించాలని చెప్పారు. దాంతో వారు ఐజీకి రూ.100 చలాన్ విధించారు. దీనిపై అగర్వాల్ మాట్లాడుతూ.. ‘విధుల్లో భాగంగా బయటికి వెళ్తున్న సమయంలో మాస్కు లేకుండా బయటికొచ్చా. కానీ, నా తప్పిదాన్ని సిబ్బంది తెలియజేశారు. దాంతో మరోమాట లేకుండా నిబంధనలు అతిక్రమించినందుకు చలాన్ వేయమని చెప్పా. ఆ మొత్తం చెల్లించా. నైతిక విలువలకు కట్టుబడే ఈ పనిచేశా. ఇతరులకు చెప్పే ముందు మనం పాటించాలి కదా అని’ ఆయన ట్విటర్లో పేర్కొన్నారు. చలాన రశీదు ఫొటో పెట్టారు. కాగా, కరోనా కట్టడి చర్యల్లో భాగంగా మాస్కు లేనిదే బయట తిరిగితే రూ.100 ఫైన్ విధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిబంధన విధించింది. ఇక ఐజీ చర్యపై ట్విటర్లోప్రశంసలు కురుస్తున్నాయి. कल बर्रा थाना क्षेत्र मे भ्रमण दौरान गाड़ी से उतरते वक़्त IG रेंज द्वारा मास्क धारण नहीं किया गया था,यद्यपि कुछ ही सेकेन्ड मे उन्होने मास्क पहन लिया, फिर भी उन्होंने स्वयं चालान करवाया व जुर्माना राशि जमा की ताकि जनता व अन्य पुलिस कर्मियों में मास्क पहनने की जागरूकता पैदा हो । pic.twitter.com/ZlVIg1M4D8 — IG RANGE KANPUR (@igrangekanpur) June 6, 2020 -
నలుగురు ఐజీలకు పదోన్నతి
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఐజీలుగా సేవలందిస్తోన్న నలుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు పదోన్నతి దక్కనుంది. వాస్తవానికి 1995 బ్యాచ్‌కు చెందిన విమెన్‌సేఫ్టీ వింగ్ ఐజీ స్వాతిలక్రా, తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ) చైర్మన్ వి.వి. శ్రీనివాసరావు, రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్‌లకు ఫిబ్రవరిలోనే ప్రమోషన్లకు ప్రతిపాదనలు సిద్ధమయ్యారు. అదేసమయంలో తెలంగాణ ప్రభుత్వం 13 మంది ఐపీఎస్ అధికారులకు డీఐజీలు, ఐజీలుగా పదోన్నతి కల్పించింది. కానీ, సాంకేతిక కారణాలు, కరోనా కేసులు, లాక్డౌన్ కారణంగా నలుగురు ఐజీ ర్యాంకు అధికారులకు పదోన్నతి కల్పించే ఫైలుకు గ్రహణం పట్టుకుంది. అప్పటి నుంచి వీరి ఫైల్ పెండింగ్‌లోనే ఉండిపోయింది. తాజాగా ఈ ఫైల్లో కదలిక వచ్చిందని సమాచారం. త్వరలోనే వీరి పదోన్నతులకు ప్రభుత్వం పచ్చజెండా ఊపనుందని తెలుస్తోంది. ప్రమోషన్లు దక్కినా.. పాత కుర్చీలోనే విధులు గతేడాది ఏప్రిల్‌లో రాష్ట్ర ప్రభుత్వం 23 మంది ఐపీఎస్ అధికారులకు పదోన్నతి కల్పించింది. వీరిలో సీనియర్ ఎస్పీ, డీఐజీ, ఐజీ, ఏడీజీ వరకు ర్యాంకులు ఉన్నాయి. ఈ పదోన్నతి కల్పించి దాదాపు 14 నెలలు కావస్తోంది. అయినా, వీరికి కొత్త పోస్టింగుగానీ, బదిలీగానీ కల్పించలేదు. అదే సమయంలో గతేడాది ఏప్రిల్‌లో ఎస్పీ ర్యాంకు నుంచి సీనియర్ ఎస్పీలుగా పదోన్నతి పొందిన 2006 ఐపీఎస్ బ్యాచ్‌కుచెందిన కార్తికేయ, కె.రమేశ్‌నాయుడు, వి.సత్యనారాయణ, బి.సుమతి, ఎం.శ్రీనివాసులు, ఎ.వెంకటేశ్వర్లు డీఐజీలు అయ్యారు. పదినెలల కాలంలో రెండోసారి పదోన్నతి సాధించినా ప్రభుత్వం పోస్టింగ్, బదిలీపై ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం. వీరితోపాటు 2002 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన డీఐజీ అధికారులు రాజేశ్‌కుమార్, వి.రవీందర్, శివశంకర్‌రెడ్డిలకు ఐజీలుగా పదోన్నతి కల్పించింది. అదేసమయంలో ఏడీజీలుగా ఉన్న 1987 బ్యాచ్‌కుచెందిన వీకే సింగ్, ఎం.గోపీకృష్ణ, సంతోష్‌మెహ్రా, జె.పూర్ణచంద్రరావులను డీజీ ర్యాంకు ఆఫీసర్లుగా పదోన్నతి కల్పించింది. వీరిలో సంతోష్‌మెహ్రా కేంద్ర సర్వీసులకు డిప్యుటేషన్‌పై వెళ్లారు. మిగిలిన వారు కూడా ఎవరిస్థానాల్లో వారే ఉన్నారు. ఈ విషయంలో సీనియర్ ఐపీఎస్ అధికారులు ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారు. రెండుప్రమోషన్లు వచ్చినా.. పాత కుర్చీల్లోనే విధులు నిర్వహించాల్సి రావడం ఏమిటని అంటున్నారు. -
ఉగ్రవాదులకు పోలీసు సాయం..
శ్రీనగర్: ఉగ్రవాదులకు సహాయం చేస్తున్న ఓ డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ)ని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీనగర్ ఎయిర్పోర్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న డీఎస్పీ దావిందర్ సింగ్ శనివారం ఇద్దరు ఉగ్రవాదులను కారులో తీసుకెళుతూ పట్టుబడ్డాడని కశ్మీర్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీపీ) విజయ్ కుమార్ వెల్లడించారు. డీఎస్పీ స్థాయిలో ఉండి, ఉగ్రవాదులకు సహాయం చేయడం హీనమైన చర్య అని పేర్కొన్నారు. వీరిలోని మరో ఉగ్రవాది నవీద్ కూడా కానిస్టేబుల్‌గా పనిచేశాడు. 2017లో పోలీసు వృత్తిని వదలి హిజ్బుల్ ముజాహిదీన్‌లో చేరాడు. పలువురు పోలీసులను, పౌరులను చంపినట్లు ఇతడిపై 17 కేసులున్నాయని తెలిపారు. పార్లమెంటు దాడి కేసులో వీరి ప్రమేయం ఉందన్న ఆరోపణలను ఐజీపీ కొట్టిపారేశారు. దీనిపై తమకు ఏ సమాచారం లేదని, అయినప్పటికీ ఈ విషయం గురించి వారిని విచారిస్తామని చెప్పారు. దొరికారిలా.. శ్రీనగర్ నుంచి జమ్మూ వైపు ఇద్దరు ఉగ్రవాదులు ఓ వాహనంలో ప్రయాణిస్తున్నారని సోపియన్ ఎస్పీకి ఇంటెలిజెన్స్ సమాచారం ఇచ్చింది. ఆ ఎస్పీ ఐజీపీకి, ఐజీపీ డీఐజీకి సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు కాపు కాసి వారి కారును ఆపి తనిఖీలు నిర్వహించి ఉగ్రవాదులను పట్టుకున్నారు. అనంతరం విచారణ కోసం ఇంటెలిజెన్స్ బ్యూరో, ఆర్ఏడబ్ల్యూ, సీఐడీ వంటి ఇంటెలిజెన్స్ వర్గాలన్నింటికీ సమాచారం ఇచ్చామని ఐజీపీ చెప్పారు. ఉగ్రవాదులను తరలిస్తున్న డీఎస్పీ దావిందర్ సింగ్‌ను కూడా ఉగ్రవాదిగానే పరిగణించి విచారిస్తున్నామని చెప్పారు. విచారణ కొనసాగుతున్నందున అంతకు మించి వివరాలు వెల్లడించలేమని పేర్కొన్నారు. ఒక పోలీస్ ఉగ్రవాదులకు సాయపడినంత మాత్రాన కశ్మీర్ పోలీసులంతా అంతేననే ఆలోచన సరికాదని చెప్పారు. కీలక మిలిటెంట్లు హతం.. జమ్మూకశ్మీర్‌లోని ట్రాల్లో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు కీలక ఉగ్రవాదులు మృతిచెందారని పోలీసులు తెలిపారు. వీరంతా హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్ర సంస్థకు చెందిన మోస్ట్ వాంటెడ్ మిలిటెంట్లని చెప్పారు. మృతులను ఉమర్ ఫయాజ్ లోనె , ఫైజాన్ హమిద్, అదిల్ బాషిర్ మిర్ అలియాస్ అబు దుజనగా గుర్తించారు. ఇందులో ఫయాజ్ లోనెపై 16 కేసులు ఉన్నట్లు చెప్పారు. -
శ్రీలంక పోలీస్ చీఫ్‌పై వేటు
కొలంబో: శ్రీలంకలో ఈస్టర్ పండుగ రోజు జరిగిన బాంబు పేలుళ్లకు సంబంధించి ముందుగానే నిఘా సమాచారం ఉన్నప్పటికీ సరైన భద్రతా చర్యలు తీసుకోలేకపోయినందుకు పోలీస్ చీఫ్ పూజిత్ జయసుందరను అధ్యక్షుడు సిరిసేన సోమవారం సస్పెండ్ చేశారు. జయసుందర రాజీనామా చేస్తానని ప్రకటించినప్పటికీ చేయలేదు. దీంతో సిరిసేన ఆయనను సస్పెండ్ చేశారు. సీనియర్ డెప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్‌గా ఉన్న విక్రమరత్నేను తాత్కాలికంగా పోలీస్ చీఫ్‌గా, మాజీ ఇన్స్పెక్టర్ జనరల్ ఇళంగకూన్‌ను రక్షణ శాఖ కార్యదర్శిగా నియమిస్తున్నట్లు సిరిసేన ప్రకటించారు. బాంబు పేలుళ్లకు నేతృత్వం వహించినట్లుగా భావిస్తున్న జహ్రాన్ హషీమ్ కుటుంబంలో 18 మంది కనిపించకుడా పోయారనీ, వారంతా చనిపోయుంటారని తనకు భయంగా ఉందని జహ్రాన్ సోదరి మహ్మద్ హషీమ్ మథానియా చెప్పారు. బాంబు పేలుళ్లు జరిగిన రోజు రాత్రి నుంచి తమ కుటుంబంలో ఐదుగురు కనిపించకుండా పోయారనీ, వారిలో తన తండ్రి, ముగ్గురు తన సోదరులు, మరొకరు తన సోదరి భర్త ఉన్నారని ఆమె తెలిపారు. మళ్లీ శుక్రవారం రాత్రి సైందమరుదు పట్టణంలో పోలీసులు, అనుమానిత ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఆరుగురు చిన్నారులు సహా 10 మంది చనిపోయారని అధికారులు చెప్పారు. ముసుగుపై నిషేధం అమల్లోకి ఈస్టర్ బాంబు పేలుళ్ల నేపథ్యంలో శ్రీలంకలో ముస్లిం మహిళలెవరూ బహిరంగ ప్రదేశాల్లో మొహానికి ముసుగులు ధరించకుండా తీసుకొచ్చిన నిషేధం అమల్లోకి వచ్చింది. ముఖం కనిపించకుండా ఎలాంటి ముసుగులూ ధరించకూడదని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. -
అమరావతి చేరుకునేందుకు ఏడు మార్గాలు
- గుంటూరురేంజ్ ఐజీ ఎన్.సంజయ్ గుంటూరు : గుంటూరు జిల్లా ఉద్దండరాయనిపాలెం గ్రామంలో గురువారం జరుగుతున్న అమరావతి నగర శంకుస్థాపన కార్యక్రమాన్ని పురస్కరించుకుని రాష్ట్రంతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే సందర్శకులకు ఏడు మార్గాలను గుర్తించామని గుంటూరు రేంజ్ ఐజీ ఎన్. సంజయ్ తెలిపారు. వాహనదారులు శంకుస్థాపనకు చేరుకోవాల్సిన మార్గాల గురించి వివరించారు. అది ఆయన మాటల్లోనే.. విజయవాడ వైపు నుంచి వచ్చే సాధారణ సందర్శకులు, భారీవాహనాలు ... కనకదుర్గమ్మ వారధి, మంగళగిరిపాతబస్టాండ్, నిడమర్రు, కురగల్లు, ఐనవోలు, మల్కాపురం, మందడం, తాళయపాలెం రోడ్డు మీదుగా శంకుస్థాపన స్థలానికి సమీపంలో ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలంలో పార్కు చేసుకోవాలి. తమిళనాడు, నెల్లూరు, ఒంగోలు - గుంటూరు వైపు నుంచి వచ్చే అన్ని రకాల వాహనదారులు తమిళనాడు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల నుంచి చిలకలూరిపేట మీదుగా శంకుస్థాపన స్థలానికి వచ్చే వాహనాలు చిలకలూరిపేట, గుంటూరు బైపాస్‌రోడ్డు, పెదకాకాని, తాడికొండ, పెదపరిమి, తుళ్ళూరు, రాయపూడి, మోదుగలంకపాలెం, వెలగపూడి బైపాస్ మీదుగా శంకుస్థాపన స్థలానికి చేరుకోవాలి. రాయలసీమ జిల్లాలు (కర్నూలు, కడప, అనంతపురం)భారీ వాహనాలు... వినుకొండ, నరసరావుపేట బైపాస్, ములకలూరు, ముప్పాళ్ళ, పెదకూరపాడు, అమరావతి, బోరుపాలెం, తుళ్ళూరు బైపాస్‌రోడ్డు, రాయపూడి, మోదుగలంకపాలెం, వెలగపూడి బైపాస్ మీదుగా శంకుస్థాపన స్థలానికి చేరుకోవాలి. చిన్న వాహనాలు : నరసరావుపేట బైపాస్, పేరేచర్ల, గుంటూ రు అవుటర్ రింగ్‌రోడ్డు, తాడికొండ, పెదపరిమి, తుళ్ళూరు, మోదుగలంకపాలెం మీదుగా శంకుస్థాపన స్థలికి చేరుకోవాలి. హైదరాబాద్ నుంచి భారీ వాహనాలు హైదరాబాద్, దాచేపల్లి, సత్తెనపల్లి, పెదకూరపాడు, అమరావతి, తుళ్ళూరు బైపాస్, వెలగపూడి బైపాస్ మీదుగా శంకుస్థాపన స్థలికి చేరుకోవాలి. చిన్న వాహనాలు: హైదరాబాద్, దాచేపల్లి, సత్తెనపల్లి, గుంటూరు అవటర్ రింగ్‌రోడ్డు, తాడికొండ, తుళ్ళూరు, మోదుగలంకపాలెం మీదుగా శంకుస్థాపన స్థలానికి చేరుకోవాలి. ఏఏఏ పార్కింగ్ ఏరియాలో గవర్నర్లు, సీఎంలు, జడ్జిలు, వివిధ దేశాల అంబాసిడర్లు, వివిధ దేశాల ప్రముఖులు, ప్రముఖ పారిశ్రామిక వేత్తలకు ప్రత్యేక స్థలం కేటాయించడమైంది. క్యాబినెట్ మినిస్టర్ల వాహనాలు మార్షలింగ్, రీమార్షలింగ్ కోసం ప్రత్యేక స్థలం కేటాయించారు. ఒక వాహన మార్గానికి రెండోవాహన మార్గం అడ్డురాకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు. శంకుస్థాపన కార్యక్రమం జరిగే 22వ తేదీ ఉదయం 7 నుంచి సాయంత్రం 7 గంటల వరకు విజయవాడ - మంగళగిరి రోడ్డులో ప్రకాశం బ్యారేజీపై ఎటువంటి వాహనాలు సంచారం అనుమతి లేదు. విజయవాడ నుంచి గుంటూరు వైపు అదేవిధంగా గుంటూరు నుంచి విజయవాడవైపు తిరుగు వాహనాలు ప్రయాణించుటకు కనకదుర్గవారధి పూర్తికాలం అనుమతి ఉంటుంది. శంకుస్థాపన జరిగే 22వ తేదీ ఉదయం 8 గంటలనుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు శంకుస్థాపన ప్రదేశానికి వాహనాలు సులువుగా వెళ్ళుటకు గాను అన్ని మార్గాల్లో వన్‌వే అమలులో ఉంటుంది. అదేవిధంగా మధ్యాహ్నం 1.45 నుంచి శంకుస్థాపన స్థలం నుండి బయటకు వెళ్ళే వాహనాలు సులువుగా తిరుగు ప్రయాణం చేయుటకు అన్ని మార్గాల్లో వన్‌వే అమలులో ఉంటుంది. మధ్యాహ్నం 11.30 గంటల తరువాత కరకట్టపైన ఎటువంటి వాహనాలకు ప్రవేశం లేదు. ఏఏ, ఏ పాస్‌లు కలిగిన వాహనదారులు గన్నవరం విమానాశ్రయం నుంచి బెంజిసర్కిల్, కనకదుర్గమ్మ వారధి, ఎన్టీఆర్ కరకట్ట, ఉండవల్లి జంక్షన్, కరకట్ట రోడ్డుకు సమాంతరంగా కొత్తగా వేయబడిన రోడ్డు నుంచి శంకుస్థాపన స్థలానికి చేరుకుని కుడిపక్కన ఏర్పాటు చేసిన ఏఏ, ఏ పార్కింగ్ నందు వాహనాలు నిలుపుకోవాలి. హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలు నందిగామ, ఇబ్రహీంపట్నం, కనకదుర్గమ్మ వారధి, ఉండవల్లి సెంటర్, కరకట్ట రోడ్డుకు సమాంతరంగా ఏర్పాటు చేసిన మార్గం గుండా శంకుస్థాపన కార్యక్రమానికి చేరుకోవాలి. గుంటూరువైపు నుంచి వచ్చే వాహనాలు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కాజా టోల్‌ప్లాజా, ఎన్టీఆర్ కరకట్ట బోట్‌హౌస్, ఉండవల్లి సెంటర్, కరకట్టకు సమాంతరంగా ఏర్పాటు చేయబడిన కొత్త మార్గం గుండా శంకుస్థాపన కార్యక్రమానికి చేరుకోవాలి.