సాక్షి, చైన్నె: కువైట్ నుంచి చైన్నెకు వచ్చిన విమానంలో ఓ యువకుడు పొగతాగి అడ్డంగా బుక్కయ్యాడు. అతడిని చైన్నెలో పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. కువైట్ నుంచి ఆదివారం రాత్రి ఓ విమానం చైన్నెకు బయలు దేరింది. 184మంది ప్రయాణికులు ఇందులో ఉన్నారు. 38 వేల అడుగుల ఎత్తులో విమానం ప్రయాణిస్తుండగా, ఇందులో ప్రయాణించిన ఓ యువకుడు సిగిరెట్ వెలిగించాడు.. దీనిని పక్కనే ఉన్న మరో ప్రయాణికుడు వ్యతిరేకించాడు.
అతడు పట్టించుకోక పోవడంతో విమాన సిబ్బందికి తెలియజేశాడు. విమాన సిబ్బంది, ఫైలట్, ఇతర ప్రయాణికులు వారించినా అతడు ఖాతరు చేయలేదు. దీంతో అతడి చర్యలపై చైన్నె విమానాశ్రయ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించారు. అర్ధరాత్రి వేళ విమానం చైన్నెలో ల్యాండ్ కాగానే భద్రతా సిబ్బంది ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.
విమానంలో తనకు సిగరేట్ తాగాలనిపించింది తాగాను..అంటూ అతడు ఇచ్చిన సమాచారం భద్రతా సిబ్బందిని విస్మయానికి గురి చేసింది. దీంతో ఆయువకుడ్ని చైన్నె విమానాశ్రయ పోలీసులకు అప్పగించారు. విచారణలో ఆ యువకుడు మహారాష్ట్ర రాజధాని నగరం ముంబై లోని థానే ప్రాంతానికి చెందిన మహ్మద్ సదాం(32)గా గుర్తించారు. అతడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment