మాట్లాడుతున్న ఉదయ నిధి స్టాలిన్
సాక్షి, చైన్నె : సనాతన ధర్మాన్ని డెంగీ, మలేరియాలతో పోల్చుతూ రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి ఉదయ నిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. బీజేపీతో పాటు హిందూ సంఘాలు ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాయి. వివరాలు.. తేనాంపేటలోని కామరాజర్ అరంగంలో సనాతన ధర్మానికి వ్యతిరేకంగా జరిగిన కార్యక్రమానికి మంత్రి ఉదయ నిధి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇందులో ఆయన సనాతన ధర్మాన్ని డెంగీ, మలేరియాలతో పోల్చారు. వీటిని ఏవిధంగా కట్టడి చేశామో, అదే తరహాలో సనాతన ధర్మాన్ని కట్టడి చేయాల్సిన అవసరం ఉందన్నారు.
సనాతన ధర్మం వ్యతిరేకం అని ఈ కార్యక్రమానికి పేరు పెట్టకుండా, సనాతన ధర్మం కట్టడి లక్ష్యం అని సూచించి ఉండాల్సిన అవసరం ఉందన్నారు. సనాతన ధర్మం అంటే ఏమిటీ? అంటూ ఆయన తీవ్రంగానే విరుచుకు పడ్డారు. సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా సనాతన ధర్మం తెర మీదకు తెచ్చి ఉన్నారని, ఇది స్థిరం కాదని, ఇలాంటి వాటి గురించి కమ్యూనిస్టులు, డీఎంకే వాదులు ప్రశ్నిస్తూనే ఉంటారని ధ్వజమెత్తారు. మరింతగా ఆయన వీరావేశంతో చేసిన వ్యాఖ్యలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైతో పాటుగా హిందూ సంఘాలు తీవ్రంగా పరిగణించాయి.
సనాతన ధర్మం గురించి ఉదయ నిధికి ఏం తెలుసు? అని ప్రశ్నిస్తూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. ఉదయ నిధి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాయి. అదే సమయంలో సనాతన ధర్మం గురించి ఉదయ నిధి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ, ఆయనపై చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీసు కమిషనరేట్‌లో కొందరు ఫిర్యాదు చేయడం గమనార్హం. అలాగే బీజేపీ తమిళనాడు కో– ఇన్‌చార్జి పొంగులేటి సుధాకర్ రెడ్డి ఓ ప్రకటనలో ఉదయనిధి వ్యాఖ్యలను ఖండించారు.
Comments
Please login to add a commentAdd a comment